గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 06, 2020 , 00:30:42

కరోనా అలర్ట్

కరోనా అలర్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) తెలంగాణలో ఒక వ్యక్తికి పరీక్షలలో పాజిటివ్‌ రావడంతో తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్‌ ప్రకటించింది. వెంటనే అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా వైద్యశాలల్లో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసి కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సంసిద్దమైంది. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రితో పాటు భద్రాచలంలోని ఏరియా ఆస్పత్రిలో కూడా ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు, రోగి సహాయకులకు సైతం మాస్క్‌లను అందించి కరోనా వైరస్‌ బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండాలని ప్రతిఒక్కరికీ వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘం వైద్యారోగ్యశాఖతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసింది. వైద్యారోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్‌ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్‌లో మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఐటీ, పురపాలకశాఖా మంత్రి కేటీఆర్‌, పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొని కరోనా విస్తరించకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సంబంధిత ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయానికి కో ఆర్డినేషన్‌ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయించారు. జిల్లా స్థాయిలో హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసి ప్రజల్లో భయాన్ని తొలగించాలని నిర్ణయించారు. సమాచార, ప్రసారశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, తెలుగు, ఆంగ్ల, ఉర్దూ భాషల్లో కరపత్రాలను ముద్రించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా చేయాలని నిర్ణయించారు. 


కరోనా, స్వైన్‌ ప్లూ, ఇతర ప్రాణాంతక వైరస్‌లు ప్రబలుతున్న సమయంలో ప్రజలు సమాచార మాధ్యమాల ద్వారా అప్రమత్తమై ముందస్తుగానే తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ప్రాణాంతక వైరస్‌ల బారిన పడకుండా ఉండవచ్చు. ఏదైనా ప్రాణాంతక వ్యాధులు ప్రభలుతున్న సమయంలో మన కుటుంబసభ్యులతో పాటు ప్రజలకు అప్రమత్తంగా ఉండే సలహాలు, సూచనలతో తగు జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఈ వ్యాధుల బారి నుంచి బయట పడవచ్చు. జిల్లా వైద్యారోగ్యశాఖ, వైద్యవిధాన పరిషత్‌ అధికార యంత్రాంగం ఈ వ్యాదుల పట్ల అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల చైనాలో తొలిసారిగా గుర్తించిన కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది. ఇది శ్వాసవ్యవస్థపై పంజా విసిరి ప్రాణాలను హరిస్తోంది. చైనా దేశంలోని వుహాన్‌లో ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్‌ కేంద్రంగా కొత్త వైరస్‌ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. కరోనా అనేది లాటిన్‌ పదం.. కరోనా అంటే కిరీటం అని అర్థం నుంచి ఈ పేరు వచ్చింది. ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్‌ మైక్రో స్కోప్‌లో చూసినప్పుడు రాజులు తలపై ధరించే కిరీటం ఆకృతి లేదా సూర్యుడు వలయాల మాదిరిగా కనిపించడం వల్ల ఈ పేరును సూచించారు. కలవరపెడుతున్న కరోనా వైరస్‌..

గాలి ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించే కరోనా వైరస్‌ ప్రజలను కలవరపెడుతోంది. శ్వాసవ్యవస్థపై ఈ వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతుంది. తొలిసారిగా 1960లో దీనిని గుర్తించారు. కరోనా వైరస్‌లు ఓ విస్తృత కుటుంబానికి చెందినవి. పక్షులు, క్షీరదాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీటిలో చాలా రకాలున్నా కేవలం ఆరు వైరస్‌లు మాత్రమే ఇప్పటి వరకు మనుషులపై ప్రభావం చూపించాయి. అవి హ్యూమన్‌ కరోనా వైరస్‌ 229 ఈ, హ్యూమన్‌ కరోనా వైరస్‌ ఓసీ 43, సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (సార్స్‌-సీవోవీ), హ్యూమన్‌ కరోనా వైరస్‌ ఎన్‌ఎల్‌ 63, హ్యూమన్‌ కరోనావైరస్‌ హెచ్‌కేయూ 1, మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ కరోనా వైరస్‌ (మెర్స్‌-సీఓవీ) తాజాగా పుట్టుకొచ్చిన నావెల్‌ కరోనా వైరస్‌తో వీటి సంఖ్య ఏడుకు పెరిగినట్లయింది. గతంలో సార్స్‌, మెర్స్‌ వైరస్‌లు చైనా, తైవాన్‌లో విజృంభించడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 


అప్రమత్తతే ముఖ్యం

ఈ వైరస్‌ గాలిలో ఉండిపోదు. వెంటనే నేలకు చేరుతుంది. సబ్బుతో చేతులు కడుక్కోవడం వల్ల వ్యాధులను నివారించవచ్చు. ఈ వైరస్‌ చేతులపై పది నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందువల్ల స్పిరిట్‌ ఆధారిత స్టెరిలైజర్‌ను ఎప్పుడూ ఉంచుకుంటూ చాలా మంచిది. ఈ వైరస్‌ 26 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో ఉంటే చనిపోతుంది. అందుకే వేడిఉన్న ప్రదేశాల్లో ఈ వైరస్‌ బ్రతకదు. వేడి నీళ్లు తాగడం, ఎండలో నిలబడటం వల్ల వైరస్‌ రాకుండా చూసుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు, ఉప్పు వేసి పుక్కిలించడం ద్వారా టాన్సిల్స్‌ క్రిములను నిర్మూలించుకోవచ్చు. ఊపిరితిత్తులో కరోనా బ్యాక్టీరియా చేరకుండా నివారించుకోవచ్చు. కొన్ని రోజుల పాటు జనసందోహం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడం మంచిది. కరోనా వైరస్‌ జంతువుల నుంచే మనుషులకు వ్యాప్తి చెందినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్‌ పుట్టుకకు కారణం ఇవే. చైనాలో వెలుగుచూసిన కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన రోగులలో ఎక్కువ మంది స్థానిక సముద్ర ఆహార మార్కెట్‌ కార్మికులు, కస్టమర్లు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. పందులు, ఒంటెలు, నక్కలు, బ్యాడ్జర్లు, వెదురు ఎలుకలు, ముళ్లపందులు, సరీసృపాల ఆహార ఉత్పత్తుల అమ్మకందారులు, కొనుగోలుదారులు కూడా ఈ వైరస్‌ బారిన పడినట్లు తెలుస్తోంది. ఏదేమైనా నీటి జంతువులకు సోకిన కరోనా వైరస్‌ను ఎవరూ ఇంతవరకు గుర్తించలేదు. ఆ మార్కెట్లో విక్రయించే ఇతర జంతువుల నుంచి ఇది ఉద్భవించి ఉండవచ్చని తెలుస్తోంది.