బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 06, 2020 , 00:29:07

పట్నాలకు ‘ప్రగతి’ మెరుగులు

పట్నాలకు ‘ప్రగతి’ మెరుగులు

కొత్తగూడెం అర్బన్‌, మార్చి 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పదిరోజుల పాటు నిర్వహించిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం విజయవంతమైంది.అనేక ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారమార్గం చూపారు. పదిరోజుల పాటు వార్డుల ప్రత్యేకాధికారులు, వార్డు కమిటీ సభ్యులు  కౌన్సిలర్లు వార్డుల్లో  పర్యటించి ప్రభుత్వం నిర్ధేశించిన రోజువారీ కార్యక్రమాలను అమలు చేసి పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలను చేపట్టడంతో సఫలీకృతులయ్యారు. రోడ్లు, డ్రైనేజీలను శుభ్రపరిచే కార్యక్రమంలో కౌన్సిలర్లు, వార్డుల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు. ‘హరితహారం’ కార్యక్రమం కోసం గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌ను తయారు చేసి నివేదికను అధికారులకు అందజేశారు.    


 సమస్యల పరిష్కారం 

నాలుగు మున్సిపాలిటీలలో అనేక సమస్యలను ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో గుర్తించి సమస్యలను పరిష్కరించారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో శిథిలావస్థకు చేరిన బిల్డింగ్‌ 32 గుర్తించి ఆరింటిని కూల్చివేయగా,ప్రమాదకరంగా ఉన్న రెండు బోరుబావులను గుర్తించి ఒకటిని పూడ్చారు. మున్సిపాలిటీ వార్డుల వారీగా 289కిలోమీటర్ల డ్రైన్లలో చెత్తను ఎత్తివేయాలని నిర్ణయించగా 102కిలోమీటర్ల మేర డ్రైన్లను శుభ్రంచేశారు. మున్సిపాలిటీ వ్యాప్తంగా 240కిలోమీటర్ల రోడ్లను శుభ్రం చేయాల్సి ఉండగా 200కిలోమీటర్లను శుభ్రం చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న 2.290మీటర్ల థర్డ్‌ వైర్లను గుర్తించి సమస్యను పరిష్కరించారు. 11చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు అవసరమవగా 3ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. 186 వీధిలైట్లకు రిపేర్లు అవసరంకాగా 83వీధి లైట్లకు రిపేర్లు పూర్తి చేశారు. 


 పాల్వంచ మున్సిపాలిటీలో శిథిలావస్థకు చేరిన బిల్డింగ్‌ 11 గుర్తించి ఆరింటిని కూల్చివేయగా, ప్రమాదకరంగా ఉన్న రెండు బోరుబావులను గుర్తించి పూడ్చివేశారు. మున్సిపాలిటీ వార్డుల వారీగా 210కిలోమీటర్ల డ్రైన్లలో చెత్తను ఎత్తివేయాలని నిర్ణయించగా 101కిలోమీటర్ల మేర డ్రైన్లను,మున్సిపాలిటీ వ్యాప్తం గా 263కిలోమీటర్ల రోడ్లను శుభ్రం చేయాల్సి ఉండగా 130కిలోమీటర్లను,  156 వీధిలైట్లకు రిపేర్లు అవసరంకాగా 83వీధి లైట్లకు రిపేర్లు చేయగా,  కూలేందుకు సిద్ధంగా 13విద్యుత్‌ స్తం భాలను గుర్తించి 3విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేయగా, వం గిన 18విద్యుత్‌ స్తంబాలకు 5స్తంభాలను సరిచేశారు. మంచినీటి సమస్యలపై 34 వినతులు రాగా 27పరిష్కరించారు. 

ఇల్లెందు మున్సిపాలిటీలో శిధిలావస్థకు చేరిన బిల్డింగ్‌ 113 గుర్తించి 52కూల్చివేయగా, ప్రమాదకరంగా ఉన్న 21బోరుబావులను గుర్తించి 15బోరుబావులను పూడ్చివేశారు. మున్సిపాలిటీ వార్డుల వారీగా  89కిలోమీటర్ల డ్రైన్లలో చెత్తను ఎత్తివేయాలని నిర్ణయించగా 75కిలోమీటర్ల మేర డ్రైన్లను శుభ్రంచేశారు. 


మున్సిపాలిటీ వ్యాప్తంగా 90కిలోమీటర్ల రోడ్లను శుభ్రం చేయాల్సి ఉండగా 80కిలోమీటర్లను శుభ్రం చేసినట్లు అధికారులు తెలిపారు. 203 వీధిలైట్లకు రిపేర్లు అవసరంకాగా 60వీధి లైట్లకు రిపేర్లు పూర్తి చేశారు. మణుగూరు మున్సిపాలిటీలో శిథిలావస్థకు చేరిన బిల్డింగ్‌ ఏడింటిని గుర్తించగా, ప్రమాదకరంగా ఉన్న 7 బోరుబావులను గుర్తించారు. 142కిలోమీటర్ల డ్రైన్లలో చెత్తను ఎత్తి పట్టణాన్ని శుభ్రంచేశారు. 8చోట్ల రహదారులకు మరమ్మతులు చేయుటకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 162 వీధిలైట్లు ఏర్పాటు చేశారు. వార్డుల్లో వంగిన పోల్స్‌ను గుర్తించి వాటిని సరిచేశారు. మంచినీటి సమస్యలపై 8  వినతులు రాగా వాటిని పరిష్కరించారు. 

 

ఎమ్మెల్యేల పర్యవేక్షణ, కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు 

పట్టణ ప్రగతి కార్యక్రమంలో  కలెక్టర్‌ ఎంవీ రెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో ఆకస్మిక తనిఖీలు చేశారు. పనులు ఏ విధంగా జరుగుతున్నాయో క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను  పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. మున్సిపాలిటీలలోని వివిధ వార్డులలో జరుగుతున్న పనులను, జరగాల్సిన పనులను ప్రజల నుంచి తెలుసుకున్నారు. ప్రజలకు వార్డుల్లో ఏయే మౌలిక వసతులు కల్పించాలనే అంశంపై స్పష్టంగా తెలుసుకొని పరిష్కరించాలని ప్రత్యేకాధికారులను ఆదేశించారు.  పట్టణ ప్రగతి కార్యక్రమంపై నిర్లక్ష్యం వహించిన సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు సైతం జారీ చేశారు.  అదే విధంగా మణుగూరులో ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, బానోతు హరిప్రియానాయక్‌లు పట్టణ ప్రగతి కార్యక్రమాలలో ప్రతిరోజు పాల్గొని పనులను చేశారు.