మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 04, 2020 , 23:40:34

‘పట్టణ ప్రగతి’తో సమస్యల పరిష్కారం

‘పట్టణ ప్రగతి’తో సమస్యల పరిష్కారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం పదో రోజు బుధవారంతో ముగిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, ప్రత్యేకాధికారులు, వార్డు ప్రత్యేకాధికారులు, వార్డు కమిటీల సభ్యుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగింది. గత పదిరోజులుగా ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టి ప్రణాళికాబద్ధంగా అమలు చేశారు. దీంతో వార్డుల్లో అనేక ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు మార్గం సుగమమైంది. వార్డుల్లో ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించి ఆ సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా వార్డు కౌన్సిలర్లు పనిచేశారు. గత పదిరోజులుగా వార్డుల్లో ఉన్న చెత్తచెదారాన్ని తొలగించడంతో వార్డులన్నీ సుందరమంయగా రూపుదాల్చాయి. రోడ్డుకిరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను తొలగించడంతో పాటు కాలువల్లో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించేందుకు ప్రత్యేక చర్యలను చేపట్టడంతో వార్డుల్లో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


శిథిలావస్థకు చేరిన భవనాల తొలగింపు

నాలుగు మున్సిపాలిటీలలో శిథిలావస్థకు చేరుకున్న భవనాలను ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో గుర్తించారు. జేసీబీ సహాయంతో వాటిని కూల్చివేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలను చేపట్టారు. మున్సిపాలిటీల్లో ఖాళీ స్థలం ఉన్న ఇంటి యజమానికి సమాచారం అందించి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలని ఆదేశించారు. లేనిపక్షంలో మున్సిపల్‌ అధికారులు తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించడంతో వారు ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకుంటున్నారు.   


పట్టణంలో పర్యటించిన కలెక్టర్‌ 

కొత్తగూడెం మున్సిపాలిటీలో కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. పోస్టాఫీస్‌ సెంటర్‌ నుంచి సూపర్‌బజార్‌ డివైడర్‌ మధ్య నాటిన మొక్కలను పర్యవేక్షించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించేందుకు ప్రతిరోజు మొక్కలకు నీటిని పోయాలని మున్సిపల్‌ కమిషనర్‌ అరిగెల సంపత్‌కుమార్‌ను ఆదేశించారు. కూలీలైన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాలను పరిశీలించారు. అనంతరం హనుమాన్‌బస్తీలో పర్యటించి పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. వార్డుప్రజలు గ్రంథాలయం ఏర్పాటు చేయాలని కోరగా స్థలాన్ని పరిశీలించి ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని కమిషనర్‌కు సూచించారు. ఈ సందర్భంగా బస్తీలో మొక్క నాటారు.