శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 04, 2020 , 23:33:29

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

కొత్తగూడెం ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియట్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 30 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష ముగిసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10,863 మంది విద్యార్థులకు గాను 10,208 మంది హాజరయ్యారు. 655 మంది గైర్హాజరయ్యారు. గురువారం నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 9,937 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. బుధవారం మొదటి సంవత్సరం విద్యార్థులకు సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1 పరీక్ష నిర్వహించారు. సీసీ కెమేరాల ఎదుట ప్రశ్నాపత్రాల సీల్‌ను ఓపెన్‌ చేశారు. సెట్‌-ఏ పరీక్షా పత్రాన్ని విద్యార్థులకు అందించారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేశారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. 


విద్యార్థినులకు రక్షణగా షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ సయ్యద్‌ జహీర్‌ ఆహ్మద్‌, పరీక్షా కమిటీ సభ్యులు బి.సులోచనరాణి, జి.జయశ్రీలు పరీక్షల ఏర్పాట్లను పర్యవేక్షించారు. సిట్టింగ్‌ స్వాడ్‌, ఫ్లైయింగ్‌ స్వాడ్స్‌ పర్యవేక్షణలో ఆరు బృందాలు ఎక్కడా మాస్‌ కాపీయింగ్‌, మాల్‌ ప్రాక్టీస్‌ జరుగకుండా పకడ్బందీగా పరీక్ష నిర్వహించారు. కొంత మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకొని పరీక్షా కేంద్రానికి హాజరయ్యారు. జిల్లా పరీక్షల కన్వీనర్‌ ఎస్‌డీ జహీర్‌ ఆహ్మద్‌ పాల్వంచలోని కేఎల్‌ఆర్‌, కృష్ణవేణి, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ బాలుర కాలేజీలు, కొత్తగూడెంలోని కృష్ణవేణి, జూలూరుపాడులోని కేజీబీవీ విద్యాలయాల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించారు. అక్కడి అధికారులతో మాట్లాడి ఎటువంటి లోపాలు జరుగకుండా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పోలీస్‌, రెవెన్యూ, ఆర్టీసీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించారు.  నిమిషం నిబంధన విధించడంతో లక్ష్మీదేవిపల్లి మండలంలో జేవీఎస్‌ చైతన్య జూనియర్‌ కాలేజీలో నలుగురు విద్యార్థులు, కొత్తగూడెంలోని చుంచుపల్లి ప్రభుత్వ జూ.కళాశాలలో ఒక విద్యార్థి వెనుదిరిగారు. 


కొత్తగూడెంలో.. 

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 450 మందికి గాను 442 హాజరు కాగా 8 మంది గైర్హాజరయ్యారు. కృష్ణవేణి జూనియర్‌ కళాశాలలో 482 మందికి 466 హాజరు కాగా 16 మంది గైర్హాజరయ్యారు. త్రివేణి జూనియర్‌ కాలేజీలో 381 మంది గాను 11 మంది గైర్హాజరు కాగా, 370 మంది హాజరయ్యారు. నలంద జూనియర్‌ కాలేజీ  509కి గాను 16 గైర్హాజరవ్వగా,  493 మంది పరీక్షలు రాశారు. కొత్తగూడెంలోని సింగరేణి మహిళా జూనియర్‌ కళాశాలలో 509కి 14మంది గైర్హాజరు, 495 మంది హాజరయ్యారు. జేవీఎస్‌ శ్రీచైతన్య కాలేజీ - ఒకేషనల్‌ కేంద్రంలో 760కి గాను 57 గైర్హాజరుకాగా,  703 పరీక్షకు హాజరయ్యారు.  


భద్రాచలంలో...  

లిటిల్‌ ఫ్లవర్‌ జూ.కాలేజీలో 473 మందికి గాను 24 మంది గైర్హాజరు కాగా 449 మంది పరీక్షలు రాశారు. ప్రభుత్వ జూ.కళాశాలలో 303కి గాను 16 గైర్హాజరయ్యారు. 287 విద్యార్థులు పరీక్షలు రాశారు. ట్రైబల్‌ వెల్ఫేర్‌ కళాశాలలో 304 మందికి గాను 21 గైర్హాజరు కాగా 283  మంది హాజరయ్యారు. త్రివేణిలో 371మందికి 338 హాజరవ్వగా 33మంది గైర్హాజరయ్యారు. 


పాల్వంచలో.. 

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 269 మందికి 14 గైర్హాజరు కాగా 255 మంది పరీక్ష రాశారు. సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాలలో 180 మందికి గాను 15 మంది గైర్హాజరుకాగా 165 మంది హాజరయ్యారు. కృష్ణవేణి జూనియర్‌ కాలేజీ ఒకేషనల్‌ కేంద్రంగా 491మందికి 48 మంది గైర్హాజరు కాగా, 4 43 మంది హాజరయ్యారు. కేఎల్‌ఆర్‌ జూనియర్‌ కాలేజీలో 294 మందికి గాను 273 హాజరయ్యారు. 21 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.