మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 04, 2020 , 03:00:30

బ్రహ్మోత్సవాలకు భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు..

బ్రహ్మోత్సవాలకు భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు..
  • నవమికి రూ.2కోట్ల బడ్జెట్‌ కేటాయింపుపై సీఎం దృష్టికి..
  • రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి చర్యలు
  • యాదాద్రిలా భద్రాద్రిని అభివృద్ధి చేస్తారు
  • మిథిలా ప్రాంగణంలో శాశ్వత పందిళ్ల ఏర్పాటు
  • రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌
  • రామాలయంలో నవమి ఏర్పాట్ల పరిశీలన

భద్రాచలం, నమస్తే తెలంగాణ: రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌ మంగళవారం భద్రాచలం వచ్చారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 2న శ్రీసీతారాముల కల్యాణం, 3న శ్రీరామ పట్టాభిషేకం జరగనున్న నేపథ్యంలో ఆయన స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కల్యాణం నిర్వహించే మిథిలా స్టేడియం, కల్యాణ మండప ప్రాంగణం, ఉచిత నిత్యాన్నదాన సత్రం, భక్తులకు తాత్కాలిక వసతి తదితర ప్రాంతాలను కమిషనర్‌ స్వయంగా పరిశీలించారు. రామాలయం అధికారులను పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ విలేకరులకు పలు విషయాలు వెల్లడించారు. శ్రీరామనవమికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా ముత్యాల తలంబ్రాలు, పట్టువస్ర్తాలు అందజేస్తోందని, వీటికి అయ్యే ఖర్చు ప్రస్తుతం పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం కేటాయించిన నిధులను పెంచే విషయం సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో హిందూ దేవాలయాల అభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్నారని ప్రశంసించారు. యాదాద్రి మాదిరిగా భద్రాద్రిని అభివృద్ధి చేస్తారన్నారు. ఈ సారి నవమిని తిలకించేందుకు వచ్చే భక్తులకు గతం కంటే మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.


బాసరలో ఇటీవలే గాళ్వారియం రేకులతో శాశ్వత షెడ్ల నిర్మాణం చేపట్టామని, ఈ తరహాలో భద్రాచలంలో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈ విషయమై డోనర్లతో సంప్రదిస్తామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాధనలు పంపాలని స్థానిక దేవస్థానం అధికారులను కమిషనర్‌ ఆదేశించారు. కల్యాణ ఏర్పాట్లలో పూర్తిగా దేవాదాయశాఖ సంప్రదాయానికి ప్రాధాన్యం ఇస్తుందని, అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. బ్రహ్మోత్సవాల ప్రచారాన్ని కూడా పెంచుతామన్నారు. నవమి ఏర్పాట్లకు ప్రతీ ఏటా దేవస్థానం రూ.2కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు. నవమికి కేటాయించే ఈ బడ్జెట్‌ విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. దేవస్థానంలో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి వేతనాలు సక్రమంగా అందడంలేదనే విషయం తన దృష్టికి వచ్చిందని.. దీనిపై తగు నివేదిక తెప్పించుకొని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం కమిషనర్‌ రామున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు సంప్రదాయబద్ధంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు.