బుధవారం 03 జూన్ 2020
Badradri-kothagudem - Mar 03, 2020 , 00:23:47

రహదారులకు మహర్దశ..

రహదారులకు మహర్దశ..

మామిళ్లగూడెం: ప్రజలకు గతుకులు లేని ప్రయాణం కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ప్రజా రవాణా వ్యవస్థలను బలోపేతం చేస్తూ రహదారుల అభివృద్ధితో ప్రజలకు సులభమైన రవాణా సౌకర్యాలు కల్పిస్తుంది. ప్రధానంగా గ్రామీణ రహదారుల అభివృద్ధిలో ప్రభుత్వం ఎంతో కృతనిశ్చయంతో పని చేస్తున్నది. అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగం చేయడంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించే రహదారుల నిర్మాణం, మరమ్మతులకు కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తుంది. ఇప్పటికే జిల్లాలో కొనసాగుతున్న రహదారుల అభివృద్ధి పనులతో పాటు గత వానాకాలంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తుంది. దీంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనింగ్‌ నిధులతో రహదారులకు మహర్దశ పట్టిందని చెప్పవచ్చు. ఇటీవల జరిగిన రెండు జిల్లాల మైనింగ్‌ కమిటీ సమావేశంలో రెండు జిల్లాల్లో మైనింగ్‌ ద్వారా జిల్లా మినరల్‌ ఫౌండేషన్‌ ట్రస్టులో అందుబాటులో ఉన్న నిధులతో రహదారుల అభివృద్ధికి రెండు జిల్లాల కలెక్టర్లు పెద్దపీట వేశారు. రెండు జిల్లాల్లో ఇప్పటికే రహదారుల వెడల్పు, నూతనంగా నిర్మాణం చేస్తున్న వాటికి, వానాకాలంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు నిధులు విడుదల చేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఖమ్మం రహదారులు, భవనాలశాఖ ఆధ్వర్యంలో రెండు డివిజన్ల పరిధిలో పనులు ప్రారంభమయ్యాయి. ఖమ్మం జిల్లాకు రూ.107కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రూ.61.42కోట్లు కేటాయిండంతో రెండు జిల్లాల వ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న పనుల వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లాలో మ్యాచింగ్‌ గ్రాంట్‌లో 

58 పనులకు కేటాయింపు..

ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 58 రహదారుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. వాటిలో కొద్ది కాలంగా పనుల నిర్మాణంలో వేగం తగ్గింది. ప్రస్తుతం నిర్మాణం చేస్తున్న పనులకు అదనపు నిధులు అవసరం కావడంతో జిల్లా మినరల్‌ ఫౌండేషన్‌ ట్రస్టులో అందుబాటులో ఉన్న నిధులలో రూ.92.4214కోట్లు కేటాయించారు. వాటితో జిల్లాలో జరుగుతున్న రహదారుల అభివృద్ధి మరింత వేగం పుంజుకోనుంది. ఖమ్మం జిల్లాలో రోడ్లు భవనాలశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే రూ.198.90కోట్లు ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంతో జిల్లావ్యాప్తంగా 58 రహదారుల విస్తరణ పనులు ప్రారంభించారు. ఈ పనులకు ఇప్పటికే రహదారులు భవనాలశాఖ ఆధ్వర్యంలో రూ.106.07కోట్లు ఖర్చు చేశారు. అయినా పనులు ఇంకా మిగిలి పోవడంతో ప్రస్తుతం కొనసాగుతున్న పనులకు జిల్లాలో మైనింగ్‌ ఆదాయం ద్వారా వచ్చిన నిధులను ఖర్చు చేసి ఆయా పనులను పూర్తి చేయనున్నారు.  

ఖమ్మం జిల్లాలో 53.22 కిల్లోమీటర్ల 

మరమ్మతులకు నిధులు విడుదల

ఖమ్మం జిల్లాలో వర్షాకాలంలో కురిసిన వానలకు రహదారులు దెబ్బతిన్నాయి. ఖమ్మం జిల్లాలో 18 రహదారులు 53.22కిలోమీటర్లు మరమ్మతులు చేసేందుకు అధికారులు అంచనాలు రూపొందించారు. దీంతో జిల్లావ్యాప్తంగా వాటి మరమ్మతులకు జిల్లా మినరల్‌ ఫౌండేషన్‌ ట్రస్టు ద్వారా రూ.34.50కోట్ల నిధులు మంజూరు చేశారు. దీంతో ఆయా రహదారుల పనులను అధికారులు ప్రారంభించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 16 రహదారుల పనులు చేపట్టేందుకు రహదారులు, భవనాల శాఖ నుంచి ప్రభుత్వం రూ.62.55 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో పనులు ప్రారంభించిన అధికారులు ఇప్పటి వరకు రూ.18.05కోట్లు ఖర్చు చేసి నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇంకా అవసరమైన నిధులను జిల్లా మినరల్‌ ఫౌండేషన్‌ ట్రస్టు ద్వారా ఖర్చు చేసేందుకు జిల్లా కలెక్టర్లు నిర్ణయించడంతో ఈ పనులు కొనసాగించేందుకు రూ.61.42కోట్లు మంజూరు కావడంతో ప్రస్తుతం కొనసాగుతున్న  పనులు వేగవంతం చేశారు. అదే విధంగా జిల్లాలో వానాకాలంలో దెబ్బతిన్న మరో 11 రహదారులను మరమ్మతులు చేసేందుకు అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. ఈ నిధులతో 75.65 కిలోమీటర్లు మరమ్మతులు చేసేందుకు రూ.33.09కోట్ల నిధులు మంజూరు కావడంతో ఆ శాఖ అధికారులు పనులు ప్రారంభించారు.


logo