శుక్రవారం 29 మే 2020
Badradri-kothagudem - Mar 03, 2020 , 00:17:49

డీసీఎంఎస్‌ అభివృద్ధికి కృషి

డీసీఎంఎస్‌ అభివృద్ధికి కృషి

ఖమ్మం వ్యవసాయం, మార్చి 2: పాల్వంచ సహకార సంఘాన్ని అనతికాలంలోనే అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఉత్తమ సొసైటీగా అవార్డులు సొంతం చేసుకున్నామని, అదే తరహాలో జిల్లా కేంద్ర మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌కి కూడా గుర్తింపు తెచ్చే విధంగా చిత్తశుద్ధితో కృషిచేస్తామని డీసీఎంఎస్‌ వైస్‌ ఛైర్మన్‌ కొత్వాల శ్రీనివాసరావు పేర్కొన్నారు. దాదాపు 15 ఏళ్లు పాల్వంచ విశాల సహకార సంఘం అధ్యక్షుడిగా పనిచేశానని, గతంలో రూ.2 కోట్ల నష్టాల్లో ఉన్న సొసైటీని, కనీసం సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్న సొసైటీని తాను పగ్గాలు చేపట్టాక అభివృద్ధిలోకి తెచ్చానని గుర్తుచేశారు. పాలకవర్గ సభ్యులు, రైతులు, అధికారులు సహకరించడంతో అనతికాలంలో సొసైటీని లాభాలబాటలోకి తెచ్చానని జ్ఞప్తికి తెచ్చారు. ప్రస్తుతం డీసీఎంఎస్‌కు ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు రైతు సమస్యలపై, వ్యాపారాలపై, సహకార సంఘాలపై మంచి పట్టు ఉందని అన్నారు. సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ సహకారంతో మరికొద్ది రోజుల్లోనే డీసీఎంఎస్‌ను లాభాల బాటలో పయనించే విధంగా కృషి చేస్తామన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాపారాలు చేసేందుకు అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. డీసీఎంఎస్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా కొత్వాల శ్రీనివాసరావుతో ‘నమస్తే తెలంగాణ ముచ్చటించగా ఆయన వివిధ విషయాలను వెల్లడించారు.  

పాలకవర్గ పెద్దలకు మంచి అనుభవం..

‘ప్రస్తుతం డీసీఎంఎస్‌ ఆశించిన మేర వ్యాపారాలు చేయలేకపోయినప్పటికీ భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు రాబట్టుకునే సామర్థ్యాలు నూతన పాలకవర్గానికి ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నికైన చైర్మన్‌కు సహకార రంగంలో అపార అనుభవం ఉంది. ప్రభుత్వ పెద్దలతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. దాదాపు రెండు దశాబ్దాలపాటు రైతులతో మమేకమైన చరిత్ర నూతన ఛైర్మన్‌కు ఉంది. మిగిలిన పాలకవర్గ సభ్యులకు కూడా సొసైటీలు కొనసాగించి చేసిన వ్యాపారాలపై పట్టు ఉంది. వ్యవసాయేతర సంఘాల నుంచి వచ్చిన డైరెక్టర్లకు కూడా మంచి ప్రావీణ్యం ఉంది. అందరి అనుభవాలను పరిగణనలోకి తీసుకుని కార్యాచరణ తయారు చేస్తాం. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూనే డీసీఎంఎస్‌కు ఆదాయాన్ని తీసుకురావడమే ప్రధాన కర్తవ్యంగా మా పాలకవర్గం పనిచేస్తుంది’ అని వివరించారు. 

వ్యాపారాలకు మంచి అవకాశాలు..

‘డీసీఎంఎస్‌ నిర్వహించే వివిధ రకాల వ్యాపారాలకు ఉమ్మడి జిల్లాలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రైతులు పండించే దాదాపు ఆరు రకాల పంటలను కొనుగోలు చేసుకునేందుకు ఆవకాశం ఉంది. వ్యవసాయేతర వ్యాపారాలు కొనసాగించేందుకు సైతం అనేక మార్గాలున్నాయి. ప్రస్తుతం డీసీఎంఎస్‌కు ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డీసీఎంఎస్‌కు ఉన్న స్థిరాస్తులనువాటిని సద్వినియోగం చేసుకునే అంశాలను పరిశీలిస్తాం.’ అని వివరించారు. 

గుర్తింపు తీసుకరావడమే కర్తవ్యం..

‘ఒకప్పుడు పూర్తి నష్టాల్లో కూరుకపోయిన పాల్వంచ సొసైటీ ఇప్పుడు ఏటా రూ.10 కోట్ల టర్నోవర్‌తో వ్యాపారాలు చేస్తున్నది. రైతులకు రుణసౌకర్యంతోపాటు ఎరువులు, విత్తనాలు అందించే వ్యాపారాలు కూడా చేస్తున్నాం. ఇదే ఫార్ములాను డీసీఎంఎస్‌లో సైతం కొనసాగించి ఖమ్మం డీసీఎంఎస్‌కు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేందుకు పాటుపడుతాం. దశాబ్దాల చరిత్ర కలిగిన ఖమ్మం డీసీఎంఎస్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఛైర్మన్‌తో కలిసి కృషిచేస్తాం.’ అని పేర్కొన్నారు. 

పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు..

‘ప్రస్తుతం పాల్వంచ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న నాకు ఏకంగా ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌గా పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. వచ్చిన అవకాశాన్ని వందకు వందశాతం సద్వినియోగం చేసుకుంటాను. అవకాశం కల్పించిన పెద్దలకు మంచిపేరు తెచ్చేలా ప్రయత్నిస్తా. ఇంతకాలం రైతులకు చేసిన సేవలను గుర్తించి ఈ పదవిని అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావులకు కూడా రుణపడి ఉంటాను. సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని ముగించారు. logo