సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 03, 2020 , 00:03:33

పట్టణ సుందరీకరణే లక్ష్యం

పట్టణ సుందరీకరణే లక్ష్యం

సత్తుపల్లి, నమస్తే తెలంగాణ, మార్చి 2: పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మున్సిపల్‌ పాలకవర్గం పనిచేయాలని, ప్రతి కౌన్సిలరూ వార్డు అభివృద్ధి కోసం పోటీపడి పనిచేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని 5, 6, 11 వార్డుల్లో సోమవారం ఆయన విస్తృతంగా పర్యటించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వార్డులోనూ ఎక్కడా ప్రజలకు అసౌకర్యం లేకుండా పనులు చేపట్టాలని, మురుగుకాలువల్లో పూడిక తీయించి వాటిలోని చెత్తాచెదారాన్ని తొలగించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా ఖాళీ స్థలాల్లో పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించాలని, ప్రభుత్వ స్థలాలను గుర్తించి పూర్తిస్థాయిలో శుభ్రపర్చాలని సూచించారు. అదేవిధంగా 5, 6, 11 వార్డుల్లో జరిగిన పనుల్లో భాగంగా ఆయన వీధివీధినా తిరుగుతూ అక్కడ జరిగే పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. కౌన్సిలర్లు తమ వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. వార్డుల్లో ఉన్న ప్రధాన సమస్యలను గుర్తించి నివేదిక రూపంలో మున్సిపల్‌ కమిషనర్‌కు అందించాలని ఆదేశించారు. ఖాళీ ప్రదేశాల యజమానులకు నోటీసులు అందజేయాలన్నారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సైతం సహకరించాలని కోరారు. ఆర్డీవో దశరథ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సుజాత, మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ తోట సుజలారాణి, కౌన్సిలర్లు నాగుల్‌మీరా, నరుకుళ్ల మమత, షేక్‌ చాంద్‌పాషా, మట్టా ప్రసాద్‌, కొత్తూరు ఉమామహేశ్వరరావు, నాయకులు యోగానందం, రఘు, టెక్స్‌మో రెడ్డి, తోట గణేశ్‌, వేంసూరు ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, హుస్సేన్‌, బాబూరావు, నరుకుళ్ల అప్పారావు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.