శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 02, 2020 , 00:48:11

అభివృద్ధే మా నినాదం..

అభివృద్ధే మా నినాదం..


అభివృద్ధే మా నినాదం..ఖమ్మం, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మున్సిపల్‌ ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఖమ్మం జిల్లా పర్యటన విజయవంతంగా ముగిసింది. ఖమ్మం నగరంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పట్టణ ప్రగతి’ ప్రణాళిక కార్యక్రమంలో యువనేత కేటీఆర్‌ పాల్గొన్నారు. ఆయనతో పాటు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, శాసనమండలి సభ్యుడు, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్నారు. వీరితో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, ఖమ్మం మేయర్‌ పాపాలాల్‌, ఖమ్మం మున్సిపల్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలి, ట్రైనీ కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తదితరులు ఉన్నారు. 


కేటీఆర్‌కు స్వాగతం పలికిన మంత్రి పువ్వాడ..

హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం 8.50 గంటలకు బయల్దేరిన మంత్రి కేటీఆర్‌ 9.30 గంటలకు ఖమ్మం మమత ఆసుపత్రి ఆవరణంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్దకు చేరుకున్నారు. హెలికాప్టర్‌లో మంత్రి కేటీఆర్‌తో పాటు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎక్సైజ్‌, క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి వచ్చారు. వీరికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన పరిచయ వేదిక వద్దకు కేటీఆర్‌ను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తీసుకువచ్చారు. మంత్రి కేటీఆర్‌ను కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర, టీఎస్‌పీఎస్‌ఈ సభ్యురాలు బానోత్‌ చంద్రావతి, ఖమ్మం మేయర్‌ పాపాలాల్‌ మంత్రి కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. నూతనంగా ఎన్నికైన డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావును మంత్రి పువ్వాడ కేటీఆర్‌కు పరిచయం చేయించారు. మంత్రి కేటీఆర్‌ను కలిసిన వారిలో జడ్పీ వైస్‌చైర్మన్‌ మరికంటి ధనలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళీప్రసాద్‌, కార్పొరేటర్‌ మేడా ప్రశాంతలక్ష్మి, వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆర్‌జేసీ కృష్ణ, మాజీ డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు, రూరల్‌ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, జడ్పీటీసీ ఇంటూరి శేఖర్‌, జడ్పీటీసీ ప్రియాంక, నల్లమల్ల వెంకటేశ్వర్లు, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బచ్చు విజయ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. 


ఇండోర్‌ స్టేడియం, ఓపెన్‌ జిమ్‌ను ప్రారంభం..

ఖమ్మం నగరంలోని పెవిలియన్‌ గ్రౌండ్‌లో రూ. 1.25 కోట్లతో నూతనంగా నిర్మించిన బాస్కెట్‌బాల్‌ ఇండోర్‌స్టేడియం, ఓపెన్‌జిమ్‌ను క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సుతో పాటు క్రీడాకారుల సౌలభ్యం కోసం నిధులు వెచ్చించి అంతర్జాతీయ ప్రమాణాలతో ఇండోర్‌ స్టేడియాల నిర్మాణాలు చేపట్టిందన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తూ తల్లిదండ్రులకు, విద్యనేర్పిన గురువులకు, తెలంగాణ రాష్ర్టానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. రాబోవు రోజుల్లో క్రీడలను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన పలు వసతులను, నూతన నిర్మాణాలను పరిశీలించారు. చాలా తక్కువకాలం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కృషితో ఇండోర్‌స్టేడియం నిర్మాణం చేపట్టి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. బాస్కెట్‌బాట్‌ క్రీడాకారులను వారు గతంలో పాల్గొన్న టోర్నమెంట్స్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ స్టేడియం ద్వారా జాతీయస్థాయి క్రీడల్లో శిక్షణ పొంది అనంతరం ఇక్కడే జాతీయస్థాయి పోటీల నిర్వహణకు కూడా ఈ స్టేడియం దోహదపడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 


మినీ ట్యాంక్‌బండ్‌..

ఖమ్మం నగరంతో పాటు జిల్లా ప్రజలకు లకారం ట్యాంక్‌బండ్స్‌ ఎంతో ఉపయోగ పడనున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు అన్నారు. లకారం చెరువులో ప్రస్తుతం ఉన్న ప్రధాన ట్యాంకు బండ్‌తో పాటు అదనంగా రూ 1.50 కోట్లతో నిర్మించిన మినీ ట్యాంకు బండ్‌ను ప్రారంభించారు. ఇలాంటి ట్యాంకు బండ్స్‌తో పర్యాటక అభివృద్ధితో పాటు ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి ఉపయోగ పడతాయన్నారు. ఎన్నో ఏళ్లుగా మురికి కూపంగా ఉన్న చెరువును తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ట్యాంకు బండ్‌లో ఉన్న సౌకర్యాలు, వసతులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. అనంతరం మొక్కలు నాటారు. 


కోబి బ్రయాంట్‌ చిత్రం గీసిన వారిని అభినందించిన మంత్రి..

స్టేడియం ముఖ్యద్వారంలో చిత్రీకరించిన కోబి బ్రయాంట్‌ చిత్రాన్ని మంత్రి కేటీఆర్‌ తదేకంగా తిలకించి తన్మయత్వానికి లోనయ్యారు. ఇంత అద్భుతంగా చిత్రాన్ని గీసిన ఖమ్మం నగరానికి చెందిన స్వాతి విజయ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అయితే మంత్రి ఆ చిత్రం వద్ద సెల్ఫీ దిగాలనే కోరిక ఉందని, రద్దీ దృష్ట్యా సాధ్యం కాలేదని చిత్రకారులతో సంబోధించారు. ఇండోర్‌ స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌ను ప్రారంభించి క్రీడాకారులు, క్రీడా సంఘాల నాయకులు, వాకర్స్‌ అసోసియేషన్‌ నాయకులతో మాట్లాడారు.  టీఆర్‌ఎస్‌ నాయకులు పాలెపు వెంకటరమణ, బుడి గం శ్రీను, రమణయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. ఐటీహబ్‌ తెచ్చాం.. మరిన్ని పరిశ్రమలు తెస్తాం...

‘మంత్రి అజయ్‌కుమార్‌తో పాటు ఎందరో పె ద్దలు చదువుకున్న కళాశాల, మరెందరినో ఉ న్నతంగా తీర్చిదిద్దేందు కు ఉన్నతంగా నిర్మించిన కళాశాల కొత్త భవనాన్ని ప్రారంభించడం నా అదృష్టం’ అని మం త్రి కేటీఆర్‌ అన్నారు. రూ.2.6కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన అల్లూరి శ్రీరామరాజు జూనియర్‌ కళాశాలను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. మంత్రి అజయ్‌ కుమార్‌ నాయకత్వంలో ఖమ్మం పట్టణ రూపురేఖలు మారయన్నారు. జిల్లా అభివృద్ధి చేయడంలో అజయ్‌ కృషి చేస్తున్నాడని, రాబోయే రోజుల్లో చదువుకున్న విద్యార్థులకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు రావాలనే ధృడ సంకల్పంతో ఐటీ హబ్‌ ప్రారంభం కాబోతుందన్నారు. జిల్లాకు పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌ మాట్లాడుతూ.. ‘నేను చదువుకున్న కళాశాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సార్‌కి  పరిస్థితి వివరించి నూతన భవనం నిర్మించేందుకు విజ్ఞప్తి చేయగా, వెంటనే రూ. 2.5కోట్లు అనుమతి ఇచ్చారు.. నాకు విద్యా బుద్ధులు నేర్పిన కళాశాల’ అన్నారు. తొలుత మంత్రులు కేటీఆర్‌, అజయ్‌కుమార్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీ నామ నాగేశ్వరరావు వజ్రా బస్సులో కళాశాలకు చేరుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ఎన్‌ విజయకుమారి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.  మంత్రులకు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. నూతన భవనాన్ని రిబ్బన్‌ కట్‌ చేసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రవిబాబు, కళాశాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఫ్లెక్సీలు కట్టాడని గిఫ్ట్‌ నిరాకరణ..   ఏఎస్‌ఆర్‌ కళాశాల నూతన భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌కు కార్పొరేటర్‌ గిఫ్ట్‌ ఇవ్వబోగా నిరాకరించారు. ‘ఫ్లెక్సీలు వద్దని చెప్పినా ఏర్పాటు చేసినందుకు మీరు అందజేసే గిఫ్ట్‌ను నిరాకరిస్తున్నట్లు’ వేదికపైనే మంత్రి ప్రకటించారు.


‘మన ఖమ్మం-మన అభివృద్ధి’ నినాదమవ్వాలి..

 నగరంలోని ఎస్‌బీఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన సీవిల్‌ విద్యార్థులు ప్రాజెక్ట్‌ వర్క్‌లో భాగంగా గుంతలను అత్యంత వేగంగా పుడ్చడం, స్వచ్ఛభారత్‌లో భాగంగా స్వచ్ఛ ఖమ్మంలో ఎస్‌బీఐటీ విద్యార్థులు పాల్గొన్న సందర్భాలను, సైంటిఫిక్స్‌ ఎక్స్‌పోలో వారు చేసిన ప్రాజెక్ట్‌లను వివరిస్తూ ఖమ్మం లకారం పార్క్‌లో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను మంత్రి కేటీఆర్‌ సందర్శించారు. రోడ్ల సుందరీకరణలో ఎస్‌బీఐటీ విద్యార్థుల భాగస్వామ్యం హర్షణీయమన్నారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడం, ‘మన ఖమ్మం-మన అభివృద్ధి’ నినాదమవ్వాలని, చైర్మన్‌ గుండాల కృష్ణను అభినందించారు. అనంతరం విద్యార్థులకు జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐటీ గౌరవ పర్యవేక్షకుడు ఎస్‌వీ సూర్యనారాయణ, ప్రిన్సిపాల్‌ రాజ్‌కుమార్‌, అధ్యాపకులు, నగర పాలక సంస్థ కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, చావా నారాయణరావు, కొత్తపల్లి నీరజ, ఇరిగేషన్‌ ఈఈ నరసింహరావు, డీఈ అర్జున్‌, మున్సిపల్‌ ఈఈ రంజిత్‌కుమార్‌, డీఈ ధరణికుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు జస్వంత్‌, పోట్ల వీరేందర్‌, హెచ్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  


స్కై సైక్లింగ్‌ను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌..

ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్‌ వద్ద నూతనంగా పర్యటకులకు, నగర ప్రజల కోసం ఏర్పాటు చేసిన స్కై సైక్లింగ్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.