శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 02, 2020 , 00:44:26

పండుగలా... పొంగులేటి వారి వివాహ రిసెప్షన్‌

పండుగలా... పొంగులేటి వారి వివాహ రిసెప్షన్‌

ఖమ్మం, నమస్తే తెలంగాణ : ఒక్కరు కాదు...ఇద్దరు కాదు... ఏకంగా రెండు లక్షల పైచిలుకు జనం. ఖమ్మం నగరం ఆదివారం మేడారం జాతరను తలపించింది. ఇసుకేస్తే రాలని రీతిలో తండోపతండాలుగా జనం తరలివచ్చారు. కనీవినీ ఎరుగని రీతిలో అతిథులు పొంగులేటి వారి వివాహానంతరం ఆశీర్వచన మహోత్సవ ఆతిథ్యం స్వీకరించారు. ఖమ్మం వైరా రోడ్డులోని ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌ సమీపంలో నిర్వహించిన ఈ వేడుక ఉమ్మడి తెలుగు రాష్ర్టాల్లో విశేషంగా నిలువనుందని పలువురు వ్యాఖ్యానించారు. ఉదయం 10.30 గంటలకు వధూవరులు హర్షరెడ్డి, సోమరెడ్డిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి- మాధురి, ప్రసాదరెడ్డి- శ్రీలక్ష్మి దంపతులు, వధువు తల్లిదండ్రులు ఇర్గం సునీల్‌రెడ్డి, ఇందిరరెడ్డి వేదికకు పరిచయం చేశారు. అప్పటినుంచి సాయం త్రం 4.30 గంటల వరకు జనం రద్దీ కొనసాగుతూ నే ఉంది. ఓ వైపు భోజనాలు, మరోవైపు కళాప్రదర్శనలు.... భారీగా తరలివచ్చిన జనం ఆకలి తీర్చడంతో పాటు ఆహ్లాదాన్ని పంచాయి. లక్షల సంఖ్యలో జనం వచ్చినా ఏ ఒక్కరూ అసౌకర్యానికి గురికాకుండా.. లోటుపాట్లు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేయడం గమనార్హం.

పొంగులేటి ఆప్యాయ పలకరింపు....

అక్కా బాగున్నారా...అన్నా భోజనం చేసి వెళ్లండి...అంటూ శ్రీనివాసరెడ్డి ప్రతి ఒక్కర్నీ ఆప్యాయంగా పలుకరించారు. దాదాపు ఆరుగంటల పాటు స్వయంగా ఆయనే మైకు పట్టుకుని వచ్చిపోయే జనాన్ని ఓ వైపు పలుకరిస్తూనే... తోపులాటలు వంటివి చోటు చేసుకోకుండా దిశానిర్ధేశం చేశారు. వేదిక లోపలిభాగంలో వధూవరులు ఆసీనులు కాగా...పొంగులేటి దంపతులు వేదిక ముందు భాగం నుంచి అభివాదం చేస్తూ వచ్చారు. వరుస క్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరూ వధూవరులను ఆశీర్వదించారు. 

ఆకట్టుకున్న సెట్టింగ్‌...రుచికరమైన వంటకాలు...

ఆశీర్వాద వేదిక సెట్టింగ్‌ ఎంతో ఆకట్టుకుంది. పూరి జగన్నాథ క్షేత్రం తరహాలో వేదికను తీర్చిదిద్దారు. పూలు, వాటర్‌ ఫౌంటెన్‌లతో పరిసరాలను అలంకరించారు. లోన రద్దీ ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడకుండా షామియానాలు ఏర్పాటు చేశారు. చిరు తేమను చిలుకరిస్తూ వేదిక పరిసర ప్రాంతాలు చల్లగా ఆహ్లాదంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసు కున్నారు. రుచికరమైన శాకాహార, మాంసాహార భోజనాలతో విందు ఏర్పాటు చేశారు. 11 భారీ భోజనశాలల ద్వారా అన్నపానీయాలు అందించారు. సాయంత్రం 5.30 గంటల వరకు భోజనాలు కొనసాగాయి. టీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తలు, పొంగులేటి అభిమానులతో ఏర్పాటు చేసిన వలంటీర్ల బృందం ఈ కార్యక్రమ నిర్వహణలో విశేషంగా కృషి చేసినందుకు పొంగులేటి అభినందనలు తెలిపారు. 

పలువురు ప్రముఖుల రాక... 

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షరెడ్డి, సోమరెడ్డిల వివాహానంతర ఆశీర్వచన మహోత్సవానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయనతో పాటు మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, భట్టి విక్రమార్క, మెచ్చా నాగేశ్వరరావు, లావుడ్యా రాములునాయక్‌, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కోరం కనకయ్య, నగర మేయర్‌ పాపాలాల్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నూకల నరేశ్‌రెడ్డి, తాతా మధు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు గాయత్రి రవి తదితర అధికారులు, అనధికారులు ఈ మహోత్సవానికి హాజరయ్యారు. పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.