గురువారం 04 జూన్ 2020
Badradri-kothagudem - Mar 01, 2020 , 01:07:13

నేడు యువనేత రాక..

 నేడు యువనేత రాక..

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, యువనేత, రాష్ట్ర ఐటీ మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం ఖమ్మం రానున్నారు. ఆయనతో పాటు ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు, రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ హెలికాప్టర్‌లో ఉదయం 9:30గంటలకు ఖమ్మం చేరుకుంటారు. మధ్యాహ్నం వరకు ఖమ్మంలో జరిగే పట్టణ ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొంటారు. వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఖమ్మం ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌ పర్యటనకు పెద్ద ఎత్తున్న ఏర్పాట్లు చేపట్టారు. పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా మంత్రి కేటీఆర్‌ జిల్లా పర్యటనకు వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడే జిల్లాకు రావడం. దీంతో మంత్రి కేటీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో అన్నిరకాల ఎన్నికలు ముగియడం..  ఆ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో మంత్రి కేటీఆర్‌ పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆశయాలకు అనుగుణంగా పార్టీని ముందుకు నడిపించడంలో యువనేత కేటీఆర్‌ విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు.


ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ విజయం సాధించడం వెనుక కేటీఆర్‌ సూచించిన మార్గదర్శకాలే ప్రధాన కారణంగా గులాబీ నేతలు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రజాప్రతినిధులను సమన్వయ పరిచి అన్ని స్థానాల్లో గులాబీ అభ్యర్థులను గెలుపు బాట పట్టించడంలో మంత్రి పువ్వాడ కృషి ఎంతో ఉంది. మంత్రి పువ్వాడకు అన్నిరకాలుగా మంత్రి కేటీఆర్‌ సలహా సూచనలు అందజేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ను అగ్రభాగాన నిలుపుతున్నారు. ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌దే విజయం అన్నచందంగా జిల్లాలో పార్టీ అభివృద్ధి చెందింది. దీంతో ప్రతిపక్షాల అడ్రాస్‌ కల్లాస్‌ అయిన పరిస్థితి జిల్లాలో ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లా పర్యటనకు కేటిఆర్‌ వస్తున్న సందర్భంగా ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ నాయకత్వం, ప్రజాప్రతినిధులు ఖమ్మం చేరుకున్నారు. కేటీఆర్‌ రాకకు భారీ స్వాగతాన్ని పలికేందుకు సిద్ధమవుతున్నారు. 


ఉదయం 9:30గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మంలోని మమత ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లాకు చెందిన శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, స్థానిక మేయర్‌, యువనేత కేటీఆర్‌కు స్వాగతం పలుకుతారు.9:35గంటలకు మమత ఆసుపత్రి ఆవరణం నుండి మంత్రి కేటీఆర్‌ బయల్దేరి లకారం ట్యాంక్‌బండ్‌ పక్కన రూ.2కోట్లతో నూతనంగా నిర్మించిన మినీ లకారం ట్యాంక్‌బండ్‌ను ప్రారంభిస్తారు. ఆయనతో పాటు మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. పట్టణ ప్రగతిప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ ట్యాంక్‌బండ్‌ను నిర్మించారు. దీని చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. దీనిద్వారా వాకర్లకు ప్రయోజనం కలగడంతో పాటు ఈ ట్యాంక్‌లోని నీటిని పూర్తిగా తాగునీటికి వినియోగిస్తారు. దీని నిర్మాణం పట్ల ఖమ్మం నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుండి ముస్తఫానగర్‌లో నూతనంగా నిర్మించిన శాంతినగర్‌ కళాశాలకు చేరుకుంటారు.

 

9:55గంటలకు యువనేత కేటిఆర్‌ శాంతినగర్‌లో నూతనంగా రూ. 2.6కోట్లతో నిర్మించిన కళాశాల భవనాలను మంత్రి ప్రారంభిస్తారు. ఈసందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులతో ముచ్చటిస్తారు. ఖమ్మం శాసనసభ్యుడు, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చదువుకున్న ఈ కళాశాలలో భవనాలు లేక విద్యార్థులు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని గతంలోనే మంత్రి పువ్వాడ కళాశాల భవనాన్ని నిర్మిస్తానని ప్రకటించారు. ఆయన ఇచ్చిన హామి మేరకు ప్రభుత్వం నుంచి రూ.2.6కోట్లను మంజూరు చేయించి కళాశాల భవనంతో పాటు 16అదనపు గదులను నిర్మించి ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. అక్కడి నుండి ప్రకాశ్‌నగర్‌కు చేరుకుంటారు.10:10గంటలకు ప్రకాశ్‌నగర్‌లో పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు చేరుకుంటారు. అక్కడ నూతనంగా నిర్మించిన సీసీ కెమెరాల విజువల్‌ బిగ్‌ స్క్రీమ్‌ రూంలను ప్రారంభిస్తారు. ఈ సీసీ కెమెరాలు ఖమ్మం నగరంలో గతంలో నిర్మించిన అన్ని సీసీ కెమెరాలకు అనుసంధానం చేశారు. దీని ద్వారా నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న కొద్ది సమయంలోనే ఛేదించే అవకాశం ఉంటుంది.


10:30గంటలకు ప్రకాశ్‌నగర్‌ నుండి బయల్దేరి ఖమ్మం ఖమ్మం పెవిలియన్‌గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడ రూ.1కోటి వ్యయంతో నిర్మించిన నూతన బాస్కెట్‌ బాల్‌ ఇండోర్‌ స్టేడియాన్ని రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభిస్తారు. ఆయనతో పాటు మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ తదితరులుంటారు. ఈ స్టేడియం నిర్మాణం పట్ల ఖమ్మంలోని పలువురు క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ నుంచి ఎన్నెస్పీ క్యాంపునకు చేరుకుంటారు.10.45 ఎన్నెస్పీ క్యాంపులో ఎకరం స్థలంలో నూతనంగా రూ.3 కోట్లతో నిర్మించిన ఆధునాతన వెజ్‌ -నాన్‌వెజ్‌ మార్కెట్‌ను ప్రారంభిస్తారు. ఇక్కడ 38దుకాణాలను నిర్మించారు.వీటిలో 19 దుకాణాల్లో నాన్‌వెజ్‌, మరో 19 దుకాణాల్లో వెజ్‌ విక్రయిస్తారు. వీటి ద్వారా ఖమ్మం నగరంలోని ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పట్టణ ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అన్ని వస్తువులు ఒకే చోట దొరికేలా దీనిని నిర్మించారు. ఈ మార్కెట్‌లో చికెన్‌, మటన్‌, చేపలు అమ్ముతారు. ఇక్కడ దీనిని ప్రారంభించిన తరువాత అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించనున్నారు.

11.30 బైపాస్‌రోడ్‌లో నిర్మించిన నైట్‌ షెల్టర్‌ను మంత్రికేటీఆర్‌ ప్రారంభిస్తారు. ఎలాంటి ఆధారం లేకుండా అనాథలుగా ఉన్న వారికి ఇది ఆశ్రయం కల్పించనుంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రోడ్ల వెంబడి ఉండే వారికి దీనిలో ఆశ్రయం కల్పించనున్నారు.


11.45 రఘునాథపాలెం మండలం, జింకలతండ క్రాస్‌ రోడ్‌ వద్ద రూ.1.25 కోట్లతో నూతనంగా నిర్మించిన మండల పరిషత్‌ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభిస్తారు. నూతనంగా ఏర్పాటు చేసిన రఘునాథపాలెం మండలానికి మండల పరిషత్‌ కార్యాలయం లేకపోవడంతో ప్రజలు పలు ఇబ్బందులకు గురయ్యారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మంత్రి పువ్వాడ ఈ భవనాన్ని నిర్మించారు. దీనిని కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. 12 గంటలకు రఘునాథపాలెం గ్రామానికి చెందిన నిరుపేదలకు రూ. 3.36 కోట్లతో 60 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను నిర్మించారు. ఆ గ్రామానికి చెందిన అత్యంత నిరుపేదలకు వీటిని కేటాయించారు. ఇండ్లులేని నిరుపేదలకు ఇండ్లను నిర్మించి ఇవ్వడం వల్ల వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


12.20 గంటలకు ఖమ్మం నగరంలోని వివిధ డివిజన్‌లోని ఇండ్లులేని నిరుపేదలకు వైఎస్సార్‌ నగర్‌లో 240 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను నిర్మించారు. దీనికిగానూ ప్రభుత్వం రూ.134 కోట్లను కేటాయించింది. వీటిని పేదలకు కూడా కేటాయించారు. దీంతో పేదల మోముల్లో వెలుగులు నిండాయి. ఈ కాలనీకి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కేసీఆర్‌ కాలనీగా నామకరణం చేశారు. 


12.30 గంటలకు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ హాజరవుతారు. ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో జరిగే ఈ కార్యక్రమానికి కేటీఆర్‌తో పాటు మంత్రులు, పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు. 

1 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా ఇల్లెందుకు బయలుదేరి వెళ్తారు. 1.15 గంటలకు ఇల్లెందు చేరుకుంటారు. 1.30 గంటల నుంచి 2 గంటల వరకు ఇల్లెందులో పార్కు, మార్కెట్‌, సమీకృత భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. 2 గంటల నుంచి 3 గంటల వరకు సింగరేణి గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో యువనేత కేటీఆర్‌ పాల్గొంటారు. అనంతరం 3.15 గంటలకు హెలికాప్టర్‌లో హైద్రాబాద్‌ తిరిగి వెళ్తారు.  logo