శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 29, 2020 , 00:14:40

రెవెన్యూ అక్రమాలపై విచారణ

రెవెన్యూ అక్రమాలపై విచారణ

అశ్వారావుపేట, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 28: ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో భూ రికార్డుల ప్రక్షాళనపై అందిన ఫిర్యాదులకు సీసీఎల్‌ఏ (చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌) స్పందించారు. తక్షణమే విచారణ నిర్వహించి సమగ్ర నివేదికను పంపించాలని ఉత్తర్యులో పేర్కొన్నారు. సీసీఎల్‌ఏ ఆదేశాలతో అప్రమత్తమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ ఇప్పటికే విచారణాధికారిని నియమించారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గ మండలాలపై ప్రత్యేక విచారణ చేపట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. భూ రికార్డుల ప్రక్షాళనలో అవినీతి, అక్రమాలపై రాష్ట్ర స్థాయి రెవెన్యూ ఉన్నతాధికారుల దృష్టికి ఫిర్యాదులు అందటంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. ఈ వ్యవహారంలో లోతైన విచారణ జరిగితే దాని పర్యవసనం ఎక్కడ వరకు వెళ్తుందోనని వణికిపోతున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియను అడ్డుపెట్టుకుని కొందరు అధికారులు భారీ అక్రమాలకు పాల్పడటమే కాకుండా అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. 


ఇక్కడ రైతులను జలగల్లా రక్తం పీల్చుకుని దోచుకున్న సొమ్ముతో ఇతర ప్రాంతాలు, రాష్ర్టాల్లో ఆస్తులు కూడబెట్టుకున్నట్లు అవినీతి అధికారులపై బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రికార్డుల ప్రక్షాళనను ఆసరా చేసుకుని కొందరు అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు సీసీఎల్‌ఏకు ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం ఉన్న భూ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, అర్హత లేని అనేక మందిని రైతులను చేసిన అవినీతి అధికారుల అక్రమ భాగోతాలకు ఆధారాలు సైతం అందజేసినట్లు తెలిసింది. విలువైన అస్సైన్డ్‌ భూములకు కొందరు అధికారులే బహిరంగంగా అమ్మేసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటవీ భూములు, గుడి మాన్యాలు, ఏజెన్సీలో అక్రమ భూ బదలాయింపులు ఇలా అన్ని పద్దతుల్లోనూ అక్రమాలు భారీగా చోటు చేసుకున్నాయి. 


అస్సైన్డ్‌ భూములను దోచిపెట్టారు, అక్రమ వారసత్వాలకు బరితెగించారు, అర్హత ఉన్న నిరుపేద రైతుల భూ సమస్యలను గుర్తించలేని అవినీతి అధికారులు కొందరు కరెన్సీ కట్టలకు లొంగిపోయారు. ఎల్‌ఆర్‌యూపీ కనీస మార్గదర్శకాలను కూడా విస్మరించి సొంత ఆస్తులు ధారాదత్తం చేసినట్లు బహిరంగ మార్కెట్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి తలుపులు బార్లా తెరిచారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా వేంసూరు తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. అనంతరం తహసీల్దార్‌ ప్రకాశ్‌ను ఆయనపై వచ్చిన ఆరోపణలు దృష్ట్యా జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పరిధిలోని భూ అక్రమాలకు పాల్పడిన కొందరు వీఆర్వోలు సస్పెండ్‌కు గురయ్యారు. పాపం ఎప్పటికైనా పండుతుందన్న సామెతలా ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది. సీసీఎల్‌ఏ అందిన ఫిర్యాదులపై విచారణకు ఆదేశించటంతో కొందరు అధికారుల అవినీతి పునాదుల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. 


రికార్డుల మార్పులు ఇష్టానుసారం

భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియలో కొందరు అధికారులు ఇష్టానుసారం వ్యవహరించారు. అక్రమార్జనే లక్ష్యంగా చేసుకుని భూ అక్రమాలకు పాల్పడి రికార్డులను మార్చేశారు. తనదైన శైలిలో భూ అక్రమాలకు రాజముద్ర వేసుకున్నారు. అశ్వారావుపేట మండలంలోనే భూమి లేని వ్యక్తులు, అమ్ముకున్న భూములకు పట్టాలు ఇచ్చేశారు. ప్రక్షాళనకు అర్హత లేని భూస్వాములకు సైతం అన్సైన్డ్‌ భూములను కట్టబెట్టారు. రెవెన్యూలోని కొన్ని అవకాశాలను అవినీతికి అడ్డం పెట్టుకున్నారు. ప్రజలకు తెలియని కొన్ని పదాలను వాడుకుంటూ భూ దోపిడికే పాల్పడ్డారు. ఒకే ఇంట్లోని వ్యక్తికి ఏకంగా 30 ఎకరాల అన్సైన్డ్‌ భూమిని రూ.లక్షలకు అమ్ముకున్నారు. తండ్రి, తల్లి, కూతురు పేర్లు మీద కొత్త పట్టాలు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లికి చెందిన భూస్వాములకు ప్రభుత్వ భూములను కట్టబెట్టారు. కేవలం 3 ఎకరాలు ఉన్న విశ్రాంతి ఉద్యోగికి కుటుంబ సభ్యుల పేరు మీద 5 ఎకరాలు చొప్పున 2 పట్టాలు జారీ ఆయ్యాయి, పట్టాలు ఉన్న సామాజ్య రైతులకు మాత్రం ఆక్రమణలో ఉన్న భూమిని స్వాధీనం చేయలేకపోయారు. అంతేకాకుండా ఇరువర్గాలకు పట్టాలు ఇచ్చి కొత్త సమస్యకు దారి తీసిన సంఘటనలు ఉన్నాయి. రిటైర్డ్‌ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్‌కు వెయ్యి రెట్లకు పైగా రెండు నెలల్లోనే సంపాదించుకోవచ్చని వారి వక్ర బుద్ది సామాన్య రైతుల జీవనోపాధిని ఆవిరి చేసింది.

 

విచారణ అధికారిణిగా ఆర్డీవో 

సీసీఎల్‌ఏ (మెమో నెం.సీవో-ఓఆర్‌డీఎన్‌/03/2020, తేదీ: 29-01-2020) ఉత్తర్యుల మేరకు స్పందించిన జిల్లా కలెక్టర్‌ భూ అక్రమాలు, అధికారుల అవినీతిపై సమగ్ర విచారణకు నిర్ణయించారు. ఈ మేరకు కొత్తగూడెం ఆర్డీవో, భద్రాచలం ఇన్‌చార్జ్‌ సబ్‌ కలెక్టర్‌ను విచారణాధికారిగా నియమిస్తూ (ఆర్‌సీ నెం.ఏ1/607/2020, తేదీః 18-02-2020) తక్షణమే విచారణ జరిపి నివేదిక అందించాలని ఆదేశించారు. త్వరలోనే భూ అక్రమాలపై విచారణ ప్రారంభం కానున్నట్లు రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయమై తహసీల్దార్‌ చల్లా ప్రసాద్‌ మాట్లాడుతూ పూర్తి సమాచారం ఇంకా అందలేదని స్పష్టం చేశారు.