సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 27, 2020 , 23:55:21

పోలీసులు మానవీయకోణంతో పనిచేయాలి

పోలీసులు మానవీయకోణంతో పనిచేయాలి

ఖమ్మం క్రైం, ఫిబ్రవరి 27: రాష్ట్రంలో పోలీసు అధికారులు, సిబ్బంది శాంతి భద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తూ మానవీయ కోణంలో విధులు నిర్వర్తించాలని డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి ఆదేశించారు. పఠాన్‌ చెరువులో బుధవారం కానిస్టేబుల్‌ చేసిన అనుచిత ప్రవర్తన నేపథ్యంలో హైదరాబాద్‌లోని డీసీపీ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు, పోలీస్‌ కమిషనర్‌లు, టైనింగ్‌ కళాశాల పోలీస్‌ బెటాలియన్లు, ఎస్‌పీలు, ఇతర యూనిట్‌ అధికారులతో గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీడియో కాన్పరెన్స్‌కు పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌, ఇతర పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్‌శాఖలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తేవడం ద్వారా తెలంగాణ పోలీసింగ్‌ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. పఠాన్‌చెరువులో జరిగిన దురదృష్ట సంఘటన వల్ల పోలీస్‌శాఖ అప్రదిష్టపాలైయ్యే అవకాశం ఏర్పడిందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్‌, హోంగార్డు వరకు బాధ్యతంగా వ్యవహరించాలని ఆదేశించారు. విధినిర్వహణలో ప్రతి పోలీస్‌ అధికారి ప్రజలే తమ యాజమానులని, తాము ప్రజా సేవలకులమనే మౌలిక విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సమాజం హర్షించే విధంగా  పనిచేస్తూ తమ విధినిర్వహణలో లక్ష్యాలను సాధించాలన్నారు. రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాలుగా పోలీస్‌శాఖకు లభించిన గౌరవం కేవలం కొంత మంది ప్రవర్తన వల్ల నీతినిజాయితీగా పనిచేసే వేలాది మంది పోలీస్‌ అధికారుల గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రజల నుంచి ఎప్పటికప్పుడు అభ్యంతరాలు స్వీకరించాలని, ఇందుకుగాను పోలీస్‌స్టేషన్ల వారీగా యువకులు, రైతులు, కార్మికులు, సీనియర్‌ సిటిజన్‌, ఉపాధ్యాయులు, మహిళలు, విద్యార్థులతో ప్రత్యేక ఫోకస్‌ గ్రూపులను ఏర్పాటు చేయాలని డీజీసీ సూచించారు. పోలీస్‌శాఖ పనితీరును సమాజం మొత్తం పరిశీలిస్తుందని, ఉన్నతస్థాయి అధికారుల నుంచి హోంగార్డుల వరకు స్వీయ క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. సమాజంలో ఏ వ్యక్తి ఆత్మగౌరవ దెబ్బతినే విధంగా ప్రవర్తించవద్దని ఆదేశించారు. పోలీస్‌శాఖలో ఏవిధమైన చర్యలు చేపట్టలో పలు అంశాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వెల్లడించారు. ఈ కాన్ఫరెన్స్‌లో అడిషనల్‌ డీజీలు అభిలాష బిస్త్‌, సందీప్‌ శాండిల్య, ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర, డీఐజీ శివశకంర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.