శుక్రవారం 29 మే 2020
Badradri-kothagudem - Feb 27, 2020 , 23:53:52

కోళ్ల వైరస్‌కు కరోనాకు సంబంధం లేదు

కోళ్ల వైరస్‌కు కరోనాకు సంబంధం లేదు

పెనుబల్లి, ఫిబ్రవరి 27: ఇటీవల కోళ్ల ఫారాల్లో మృతి చెందిన వైరస్‌కు కరోనా వైరస్‌కు ఎట్టి సంబంధం లేదని హైదరాబాద్‌ వైద్య బృందం స్పష్టం చేసింది. గురువారం మండల పరిధిలోని నాయకులగూడెంలో కోళ్లు మృతి చెందిన కోళ్ల ఫారాలను పరిశీలించి యజమానికి సూచనలు చేశారు. అనంతరం పెనుబల్లి పశు వైద్యశాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీబీఆర్‌ఐ జాయింట్‌ డైరెక్టర్‌ మల్లీశ్వరి, డిప్యూటీ డైరెక్టర్‌ ముజీ అక్తర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ సృహదలు మాట్లాడుతూ.. ఇటీవల మృతి చెందిన కోళ్లకు వచ్చిన వైరస్‌కు కరోనా వైరస్‌కు సంబంధం లేదని, ఇది కేవలం వీఎన్‌సీడీ వైరస్‌ మాత్రమేనని, ఇది కోళ్లకు ఫిబ్రవరి, జూన్‌ నెలల్లో వస్తుందన్నారు. వాతావరణంలోని మార్పులను బట్టి ప్రతి సంవత్సరం ఈ వైరస్‌ వస్తూనే ఉంటుందని, ఇది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు సంవత్సరాలుగా వస్తుందన్నారు. ఈ వైరస్‌ వ్యాప్తి చెందినప్పుడు వెంటనే స్పందించి మెరుగైన వ్యాక్సిన్‌ను అందిస్తే వారం రోజుల్లోనే తగ్గిపోతుందని, వైరస్‌ వచ్చినప్పుడు ఫారంలోని వస్తువులు, మనుష్యులను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఒక్కసారిగా అధికమొత్తంలో కోళ్లు చనిపోవడం వలన ప్రజలు భయభ్రాంతులు చెందారని, ఈ వైరస్‌కు భయపడాల్సిన పరిస్థితి లేదని, ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 2006లో నాగ్‌పూర్‌లో బర్డ్‌ప్లూ వైరస్‌ వచ్చిందని, మరలా అలాంటిది ఆ స్థాయిలో వైరస్‌ ప్రభావం కనపడలేదన్నారు. ఎవరైనా, ఏదైనా అనుమానాలుంటే వైద్యులకు తెలపాలని, అప్రమత్తమై త్వరితగతిన వైరస్‌ను నివారించే వ్యాక్సిన్‌ ఉందన్నారు. ఇలాంటి వైరస్‌ వ్యాప్తి చెందిన కోళ్లఫారాల యజమానికి కొన్ని సూచనలు, సలహాలు అందించడం జరిగిందన్నారు. తప్పనిసరిగా ఇన్సులేటర్‌, డంపింగ్‌, బర్నింగ్‌ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని, ఈ వైరస్‌పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పశువైద్యాధికారి పురేందర్‌, అరుణ, స్థానిక వైద్యులు ఉమాకుమారి, సృజన తదితరులున్నారు.  


logo