గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 27, 2020 , 00:05:32

సోంతింటి కల నెరవేరే వేళ..

సోంతింటి కల నెరవేరే వేళ..

ఖమ్మం నమస్తే తెలంగాణ : వాగ్దానాలు ఇవ్వడం.. వాటిని మరవడం.. తిరిగి ఎన్నికల నాడు కొత్త హామీలు ఇవ్వడం.. నిత్యం ప్రజలను మోసం చేయడం గత పాలకులకు చెల్లింది. పిట్టగూళ్లను నిర్మించి ఫోజులిచ్చిన నాటి కాంగ్రెస్‌ నేతలు నేటి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను చూసి ముక్కుమీద వేలు వేసుకుంటున్నారు. ఇందిరమ్మ పేరుతో కొల్లగొట్టిన కోట్ల రూపాయల అవినీతిని చూస్తున్న ఇందిరమ్మ ఆత్మ క్షోభిస్తోంది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం.. ఇవ్వని హామీని అమలుపర్చడం.. ప్రజల ఆశలను నెరవేర్చేందుకు వెనుదిరగని దైర్యం.. ఎదుటివానితో మాటపడని  నైజం.. పేద ప్రజల మోముల్లో చిరునవ్వులు చూడటమే నేటి ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యాలకు అనుగుణంగా ఖమ్మం జిల్లాలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఖమ్మం నగర సమీపంలో వైఎస్‌ఆర్‌ నగర్‌లో 240, రఘునాథపాలెంలో 60 ఇండ్లను మొత్తం 300 ఇండ్లను రూ. 168 కోట్లతో నిర్మించారు. ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వం రూ.5 లక్షల 60 వేలను కెటాయించింది. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసిన అధికారులు వారికి ఇండ్లను కూడా కెటాయించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రత్యేక కృషితో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం శరవేగంగా జరిగింది. మంత్రి కృషి కారణంగా పేద ప్రజల మొముల్లో ఆనందం వెల్లి విరిస్తోంది.

మార్చి 1న గృహ ప్రవేశాలు

ఖమ్మం నియోజకవర్గంలో నిరుపేదల సొంతింటి కల సాకారం కాబోతోంది. ఖమ్మం నగరం 6వ డివిజన్‌ పరిధి వైఎస్‌ఆర్‌ నగర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిని తుది విడతగా ఇళ్లు లేని పేదలకు కేటాయించారు. మార్చి  1న కేటీఆర్‌ చేతుల మీదుగా డబుల్‌ బెడ్‌రూమ్‌ గృహ ప్రవేశాలు జరుగనున్నాయి. ఖమ్మం నగరం 6వ డివిజన్‌ పరిధి వైఎస్‌ఆర్‌ నగర్‌లో పూర్తయిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్దేశించిన డివిజన్లలో అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటున్న నిరు పేదలను లబ్ధిదారులుగా గుర్తించి జాబితాలో చేర్చారు. పనుల్లో ఖమ్మం అర్బన్‌ రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. మార్చి 1న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామాత్యులు కల్వకుంట్ల తారకరామారావు పర్యటన ఖరారు కావడంతో వైఎస్‌ఆర్‌ నగర్‌లోని 240డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల ప్రారంభోత్సవానికి సన్నద్దం చేస్తున్నారు. రాష్ట్ర రవాణాశాఖా మాత్యులు పువ్వాడ అజయ్‌ కుమార్‌లతో కలిసి యువనేత కేటీఆర్‌ ముఖ్య అతిథిగా లబ్ధిదారుల చేత గృహప్రవేశాల కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుపనున్నారు. వైఎస్‌ఆర్‌ నగర్‌లో పూర్తయిన 240 ఇళ్లను 8,9,11,12,15, 16 డివిజన్లలో నివాసం ఉండే నిరుపేదలకు కేటాయించారు. డివిజన్‌కు 40చొప్పున కేటాయించారు. రఘునాథపాలెం గ్రామానికి కేటాయించిన 30డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు సైత నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. లబ్ధిదారుల గుర్తింపు పూర్తయింది. 

డబుల్‌బెడ్‌రూమ్‌, హాల్‌, కిచెన్‌

 దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణాలో పరుగులు పెడుతున్నాయి. 560 చదరపు గజాల స్థలంలో రెండు బెడ్‌రూమ్‌లు, ఒక హాల్‌, ఒక కిచెన్‌తో పాటు రెండు బాత్‌రూమ్‌లను నిర్మించి లబ్ధిదారునికి రూపాయి ఖర్చు లేకుండా ఇళ్లు అప్పగించడం తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమవుతుంది. అన్ని వర్గాల ప్రజల ఆశలను, ఆశయాలను నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం జట్‌ స్పీడ్‌ వేగంతో ఉరుకుతోంది. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఏ ఒక్క విషయంలోనైనా విమర్శించేందుకు బూతద్దంతో వెతికే ప్రతిపక్ష నేతలకు ఒక్కటి కన్పించకపోవడం విశేషం. నెలకొక గ్రామంలో గృహ ప్రవేశాలు చేస్తూ రాష్ట్ర ప్రజల దృష్టిని ఖమ్మం జిల్లా ఆకర్షిస్తోంది. ఆయా నియోజకవర్గాల శాసనసభ్యుల సహకారంతో ఇళ్ల నిర్మాణం వేగవంతమైంది. ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలపై సమీక్షలు కొనసాగించడం జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాలలో భూసేకరణ, టెండర్ల ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల నిర్మాణాలు  కొంతమేర వెనుకబడి ఉన్నాయి. ఈ విషయంలో కూడా ఎమ్మెల్యేల సమన్వయంతో అధికారులు జిల్లాలో కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఇళ్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 

లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేవు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద ప్రజలు అడగకుండానే డబుల్‌బెడ్‌రూం పథకాన్ని ఒక వరంగా ప్రకటించారు. కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించారు.  ఇంటి నిర్మాణంతో పాటు విద్యుత్‌, సీసీ రోడ్లు, తాగునీటి వసతి, డ్రైనేజీ పనులను కూడా అధికారులు సకాలంలో పూర్తి చేశారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా డబుల్‌బెడ్‌రూమ్‌ ఇంటిని ప్రభుత్వం అందించడం పట్ల లబ్ధిదారులు సంతోషపడుతున్నారు. కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ జిల్లాలో డబుల్‌ బెడరూం గృహ నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తరుచుగా అధికారులతో సమీక్షించడం, క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తూ, నిర్మాణాలు సకాలంలో పూర్తి చేసేందుకు అహర్నిషలు కృషి చేస్తున్నారు.