ఆదివారం 07 జూన్ 2020
Badradri-kothagudem - Feb 27, 2020 , 00:02:25

ప్రగతి సాధనలో సంక్షేమ వసతి గృహాలు..

ప్రగతి సాధనలో సంక్షేమ వసతి గృహాలు..

మామిళ్లగూడెం: ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. ప్రధానంగా విద్య, వైద్య రంగాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుంది. గత ప్రభుత్వాలకు భిన్నంగా ఆయా వర్గాల అభివృద్ధికి ముందు చూపుతో నిధులు వెచ్చించడంతో పాటు ఆయా వర్గాల అభ్యున్నతికి ప్రణాళికలు అమలు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమశాఖల వసతిగృహాల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు అందుతున్నాయి. ప్రధానంగా సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ బయట పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుంది. సంక్షేమ వసతి గృహాల్లో ఉండి విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు పదో తరగతిలో ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణులు కావడంతో పాటు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. జిల్లాలో రానున్న పదోతరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న సంక్షేమ వసతి గృహాల విద్యార్థులపై ఆయా శాఖల ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

గతేడాది ఉత్తమ ఫలితాలు..

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల్లో ఉంటూ పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. గత మార్చి-2019లో వార్షిక పరీక్షలు రాసిన విద్యార్థులు 90శాతానికి పైగా ఉత్తీర్ణులయ్యారు. గత మార్చిలో గిరిజన సంక్షేమ వసతి గృహాల నుంచి 479మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వారిలో 441మంది ఉత్తీర్ణులై 92శాతం ప్రతిభను సాధించారు. బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాల నుంచి 436 మంది పరీక్షలు రాశారు. వారిలో 393 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 90.14 శాతం సాధించారు. అదే విధంగా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ వసతి గృహాల నుంచి 454 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 425 మంది ఉత్తీర్ణులు కావడంతో 93.61 శాతం ఫలితాలు సాధించారు. ఉత్తర్ణులైన విద్యార్థుల్లో ఎక్కువ మంది 10 జీపీఏ నుంచి 9 జీపీఏ మార్కులు సాధించన వారు ఉండటం విశేషం.  

మెరుగైన ఫలితాల కోసం ప్రణాళికలు

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు పదో తరగతితో మరింత మెరుగైన ఫలితాల సాధనకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులకు పాఠశాలలో అందిస్తున్న విద్యా సంబంధిత స్టడీ మెటీరియల్‌తో పాటు సంక్షేమశాఖల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను విద్యార్థులకు అందించారు. అన్ని వసతి గృహాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు అవసరమైతే వారికి అదనంగా అనుబంధ ఆహారం అందిస్తున్నారు. రానున్న మార్చి 2020లో పదోతరగతి వార్షిక పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు అవసరమైన ప్రత్యేక తరగతులు వసతి గృహాంలో బోధిస్తున్నారు. పాఠ్యాంశాల వారీగా ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించి వెనుకబడిన విద్యార్థుల చదువులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వసతి గృహాల నుంచి ఈ ఏడాది 540 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. వారికి ప్రత్యేకంగా ట్యూటర్ల ద్వారా పాఠ్యాంశాల వారీగా పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటిరియల్‌ను అందిస్తున్నారు. అదేవిధంగా గిరిజన సంక్షేమశాఖ వసతి గృహాల నుంచి 600 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయనున్నారు. వారికి డిసెంబర్‌-2019 నుంచి ఫిబ్రవరి-2020 వరకు ప్రత్యేక క్యాంపుల ద్వారా శిక్షణ అందిస్తున్నారు. ప్రత్యేక మెను అమలు చేస్తున్నారు. ఎస్సీ సంక్షేమ వసతి గృహాల నుంచి 631మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరు కానున్నారు.  

మెరుగైన వసతి సౌకర్యాలు..

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమశాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న వసతి గృహాలలో విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు అందుతున్నాయి. ప్రభుత్వం పత్యేక కృషితో విద్యార్థులకు గతంలో ఎన్నడూలేని విధంగా వసతి కల్పిస్తున్నారు. ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో ఈ ఏడాది 5717 మంది, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో 2333 మంది, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో 3450 విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ప్రధానంగా సన్న బియ్యంతో భోజనం వడ్డించడంతో పాటు అల్పాహారం, టిఫిన్‌, చికెన్‌, మటన్‌, ప్రతి రోజు గుడ్డు, అరటి పండు, స్వీటు, బూస్ట్‌, పాలు-రాగి జావ, గుగ్గిళ్లు, గోదుమ రవ్వ ఉప్మా, ఇడ్లీ, పూరి, పులిహోర, బిస్కెట్స్‌, పల్లీ పట్టీలు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు, సాంబారుతో పౌష్టికాహారాన్ని విద్యార్థులకు రోజూ అందిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు అదనంగా స్టడీ అవర్స్‌లో టీ, బిస్కెట్లు అందిస్తున్నారు. అలాగే తరగతుల వారీగా విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్‌, కాంపాస్‌లు, నాలుగు జతల బట్టలు, దుప్పట్లు, పెట్టెలు, చెప్పులు, రెండు జతల బూట్లు, ఆట వస్తువులు, స్కూల్‌ బ్యాగ్‌ ఉచితంగా అందిస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులకు తరగతులు, వయస్సుల ఆధారంగా కాస్మొటిక్స్‌ చార్టీలకు ప్రతి నెలా రూ.50 నుంచి రూ.75 వరకు చెల్లిస్తున్నారు.  

నిరంతర పర్యవేక్షణలో యంత్రాంగం..

పదో తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నారు. జిల్లా స్థాయి అధికారులతో పాటు సహాయ సంక్షేమాధికారులు పదోతరగతి విద్యార్థులు ఉన్న వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేస్తున్నారు. త్వరలో సంక్షేమాధికారులు వసతి గృహాల్లో బస చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది పదో తరగతి ఫలితాల కంటే ఈసారి మరింత ఉత్తమ ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో సంక్షేమ అధికారులు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు.  logo