ఆదివారం 07 జూన్ 2020
Badradri-kothagudem - Feb 26, 2020 , 23:56:02

అభ్యర్థులు దళారులను ఆశ్రయించొద్దు

అభ్యర్థులు దళారులను ఆశ్రయించొద్దు

కొత్తగూడెం సింగరేణి : సింగరేణి సంస్థ ఎక్స్‌టర్నల్‌ ఈఅండ్‌ఎం ఈ2గ్రేడ్‌ 68 పోస్టులను భర్తీ చేసేందుకు మార్చి 1న నిర్వహించే అర్హత పరీక్షలో అభ్యర్థులు ఎవరూ దళారులను నమ్మి మోసపోవద్దని, పరీక్షలను నిష్పక్షపాతంగా పూర్తి కంప్యూటరీకరణతో సీసీకెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్‌(పా) ఎస్‌ చంద్రశేఖర్‌ అన్నారు. బుధవారం సింగరేణి హెడ్డాఫీస్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2017 సంవత్సరంలో ఎలక్ట్రికల్‌ అండ్‌ మెకానికల్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను జారీ చేశామని, కొంత మంది కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆదేశాల మేర కు మార్చి ఒకటో తేదీన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పరీక్షలకు కొత్తగూడెం, పాల్వంచ, ఖమ్మంలో మొత్తం 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షలకు 22,221 మంది దరఖాస్తులు చేసుకోగా ఇప్పటి వరకు 14,131 మంది తమ హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారన్నారు. మార్చి ఒకటో తేదీన మున్సిపల్‌ శాఖా మంత్రి పర్యటన, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడి వివాహం ఉన్నందున ట్రాఫిక్‌ జామయ్యే అవకాశం ఉందని, అభ్యర్థులందరూ గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు మధ్యాహ్నం 12.45 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. 1.45 గంటలకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని, నిమిషం ఆలస్యమైనా అనుమతించమని, ప్రశ్నాపత్రాలు మొ త్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో భద్రపరుస్తామని, ఐదు నిమిషాలు ముందుగానే  సీల్‌ తీసి అభ్యర్థులకు అందిస్తామన్నారు. ఖమ్మంలో కూడా హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు దళారుల మాయమాటలు నమ్మి మోసపోకుండా తమ సామర్థ్యాలపై ఆధారపడి పరీక్షలు రాయాలని సూచించారు. ఈ సమావేశంలో జీఎం పర్సనల్‌ (ఆర్‌సీ, ఐఆర్‌ అండ్‌ పీఎం) ఆనందరావు, జీఎం (సీపీ అండ్‌ పీ) రవిశంకర్‌ పాల్గొన్నారు.

పరీక్షా కేంద్రాలు ఇవే..

కొత్తగూడెంలోని అబ్దుల్‌కలాం ఇంజనీరింగ్‌ కాలేజీ, చుంచుపల్లి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ (రుద్రంపూర్‌), పాతకొత్తగూడెం ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌, జేవీఎస్‌ చైతన్య జూనియర్‌ కాలేజీ, కేఎన్‌ఆర్‌ క్రియేటివ్‌ స్కూల్‌, ప్రియదర్శిని డిగ్రీ కాలేజి, సింగరేణి హైస్కూల్‌, సింగరేణి ఉమెన్స్‌ డిగ్రీ, పీజీ కాలేజి, ఎస్‌ఆర్‌డీజీ స్కూల్‌, ఎస్‌ఆర్‌ ప్రైం స్కూల్‌ (రామవరం), నలంద జూనియర్‌ కాలేజి, శారద విద్యాలయం, సూర్యోదయ స్కూల్‌, స్వర్ణభారతి హైస్కూల్‌, వివేకవర్ధని డిగ్రీ, పీజీ కాలేజి, మార్వాడీ క్యాంప్‌ పాత కొత్తగూడెం జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాల, 

పాల్వంచలో..

అనుబోస్‌ ఇంజనీరింగ్‌ కాలేజి (బీ బ్లాక్‌), అనుబోస్‌ ఇంజనీరింగ్‌ కాలేజి (సీ బ్లాక్‌), డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌, కేఎల్‌ఆర్‌ డిగ్రీ, పీజీ కాలేజి, కేఎల్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజి (మెయిన్‌ బ్లాక్‌), కేఎల్‌ఆర్‌ ఫార్మసీ కాలేజి, రెజీనా కాన్వెంట్‌, శ్రీచైతన్య స్కూల్‌, కేఎస్‌ఎం ఇంజనీరింగ్‌ కాలేజి.

ఖమ్మంలో..

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, హార్వెస్ట్‌ పబ్లిక్‌ స్కూల్‌ (ఏ, బీ, సీ బ్లాక్‌లు), కవితా మెమోరియల్‌ డిగ్రీ కాలేజి, ప్రియదర్శిని డిగ్రీ కాలేజి (బ్లాక్‌ ఏ, బ్లాక్‌ బీ), ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజి (సెంటర్‌1, సెంటర్‌2).


logo