గురువారం 04 జూన్ 2020
Badradri-kothagudem - Feb 26, 2020 , 00:05:35

మరోసారి... సత్తా చాటిన మంత్రి అజయ్‌

మరోసారి... సత్తా చాటిన మంత్రి అజయ్‌
ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఖమ్మం జిల్లాలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రాజకీయంగా చైతన్యం కలిగిన ఖమ్మం జిల్లా మరోమారు రాష్ట్ర రాజకీయాలకు ఆదర్శంగా నిలిచింది. రాజకీయ సమీకరణాలకు కేంద్ర బిందువుగా ఉండే ఖమ్మం జిల్లా మారుతున్న రాజకీయ, సామాజిక మార్పులకు కూడా కేంద్రమైంది. ఎవరూ ఊహించని ఫలితాలను ఖమ్మం జిల్లా ప్రజలు అందిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా గులాబీ పవనాలు వీస్తున్నప్పటికీ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలో ఎదురీదిన టీఆర్‌ఎస్‌ ఆ తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ క్లీన్‌స్వీప్‌ చేస్తూ వస్తున్నది. ఇదే క్రమంలో మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ (డీసీసీబీ), జిల్లా కేంద్ర మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) రెండింటి పైన తొలిసారిగా గులాబీ జెండా ఎగిరింది. సహకార చరిత్రలోనే తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయడం, అది 

కూడా 90 శాతం స్థానాలను గెలుచుకోవడం గులాబీ పార్టీకే సాధ్యమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 101 ప్రాథమిక సహకార సంఘాలకుగానూ 85 సంఘాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. కాంగ్రెస్‌-4, ఇతరులు 11 స్థానాలలో గెలుపొందడం జరిగింది. ఖమ్మం జిల్లాలో  76 సంఘాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21, ములుగుజిల్లాలో రెండు, మహబూబాబాద్‌ జిల్లాలో రెండు చొప్పున ఉన్నాయి. నాలుగు జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఖమ్మం డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలక వర్గాలను టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుచుకోగలిగింది. దీంతో మంగళవారం డీసీసీబీలో 20 డైరెక్టర్ల స్థానాలకు గానూ ఎస్సీ-3, ఎస్టీ-1 స్థానాల్లో అభ్యర్థులు లేనందున మిగిలిన 16 స్థానాల్లో నామినేషన్లను దాఖలు చేశారు. 16 మంది కూడా సింగిల్‌ సెట్‌ నామినేషన్లను దాఖలు చేసినందున డైరెక్టర్ల ఎన్నిక జరిగింది. నామినేషన్లు దాఖలు చేసిన 16 మందిని ఏకగ్రీవంగా డైరెక్టర్లుగా ఎన్నుకున్నారు. డీసీఎంఎస్‌లో 10 డైరెక్టర్లకుగాను ఎస్సీ-1, ఎస్టీ-1 మినహా మిగిలిన 8 డైరెక్టర్ల స్థానాలకు గానూ 8 నామినేషన్లే దాఖలైనందున వారు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు వెల్లడించారు. 

సత్తాచాటిన మంత్రి అజయ్‌...

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 101 ప్రాథమిక సహకార సంఘాలకు గాను 85 సంఘాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకున్నప్పటికి డైరెక్టర్లు, చైర్మన్లను ఎన్నుకునే ప్రక్రియలో అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న పలువురు సొసైటీ చైర్మన్లు డైరెక్టర్ల కోసం పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తనదైన శైలీలో పార్టీ నాయకులందరిని సమన్వయం చేసి అన్ని నియోజకవర్గాల నుంచిప్రాతినిథ్యం ఉండేలా వ్యవహరించారు. దీంతో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక లాంఛన ప్రాయమే. మంత్రి అజయ్‌ రెండు రోజుల క్రితం ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు, పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. వారందరితో చర్చించి ప్రతి నియోజకవర్గం నుంచి డైరెక్టర్లుండేలా శాసనసభ్యులతో మాట్లాడి వారి సూచించిన వ్యక్తులనే డైరెక్టర్లుగా నియమించారు. దీంతో అన్ని ప్రాంతాలకు ప్రాతినిథ్యం కల్పించిన వారయ్యారు. మంత్రి అజయ్‌ సమావేశం నిర్వహించక ముందు అనేక మంది పేర్లు డైరెక్టర్లుగా, చైర్మన్‌లుగా ప్రచారంలోకి వచ్చినప్పటికీ నాయకులను సమన్వయం పరచడంలో మంత్రి విజయ్‌ సాధించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు , టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు సూచించిన అభ్యర్థినే చైర్మన్‌గా ఎన్నుకోనున్నారు. ఈ నెల 29వ తేదీన ఎన్నికైన డైరెక్టర్లు డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. అధిష్టానం సూచించిన వారినే డైరెక్టర్లు ఎన్నుకోనున్నారు. ఆ ఎన్నిక కూడా లాంఛనప్రాయమేనని తెలుస్తుంది. 

ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌దే విజయం....

 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్‌ఎస్‌  వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తుంది. ఎంపీ, ఎమ్మెల్సీ, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్లు కారుగుర్తు పై ఓటు వేసి అభివృద్ది వైపు కారు వేగాన్ని పెంచారు. ఇటీవల జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో కూడా అదే ఒరవడి జిల్లాలో కొనసాగింది. ఎన్నిక ఏదైనా సరే టీఆర్‌ఎస్‌దే గెలుపు నల్లేరు మీద నడకే అన్నట్లుగా కొనసాగుతుంది.   2014 నుంచి జరుగుతున్న ఎన్నికలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అప్పుడు, ఇప్పుడు టీఆర్‌ఎస్‌ పార్టీయే విజయకేతనం ఎగురవేసింది. ఎన్నికకు ఎన్నికకు పార్టీ మరింత బలపడుతూ వస్తుంది. పార్టీ సంస్థాగత సభ్యత్వ నమోదులో అత్యధిక సభ్యత్వాలను నమోదు చేసుకొని భారతదేశంలోనే అతిపెద్ద ప్రాంతీయ రాజకీయ పార్టీగా అవతరించింది. 2001 సంవత్సరంలో జలదృశ్యంలో అతికొద్ది మందితో పురుడోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అంచెలంచెలుగా విస్తరిస్తూ అనతి కాలంలోనే జాతీయ, ఇతర  ప్రాంతీయ పార్టీలకు దీటుగా ఎదిగింది. 

ఖమ్మం జిల్లాలో ప్రతిపక్షాలు ఖల్లాస్‌...

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ దెబ్బకు ప్రతి పక్ష పార్టీలు కల్లాస్‌ అయ్యాయి. జిల్లాలో జరిగిన  గ్రామపంచాయతీ, స్థానిక సంస్థలు (జడ్పీటీసీ, ఎంపీటీసీ), మున్సిపల్‌ ఎన్నికల్లో  ప్రతి పక్షాలు ఉనికి కోసం పోటీచేశాయే తప్పా టీఆర్‌ఎస్‌ హవాలో కనుచూపు మేరలో లేకుండా పోయాయి. సహకార సంఘ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలు ఒక్కటై ఐక్యంగా పోటీ చేసినప్పటికి టీఆర్‌ఎస్‌ పార్టీనే ప్రజలు గెలిపించారు. ప్రతి ఎన్నికల్లోనూ సిద్ధ్దాంతాలను గాలికి వదిలి కూటమిగా జతకట్టిన ప్రతిపక్ష పార్టీలు గులాబీ దెబ్బకు తమ ఉనికిని కోల్పోయాయి.  గ్రామపంచాయతీ ఎన్నికల్లో జిల్లాలోని 584 గ్రామపంచాయతీల్లో  80 శాతం పంచాయతీలను టీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థులు విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికలైన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ విజయయాత్ర ముందు ప్రతిపక్ష పార్టీల పాత్ర నామమాత్రమైంది.  20 ఎంపీపీ స్థానాల్లో 18 ఎంపీపీలను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. 20 జడ్పీటీసీ స్థానాలకుగాను 17 జడ్పీస్థానాలల్లో విజయ ఢంకాను మోగించి ఖమ్మం జిల్లా పరిషత్‌పై గులాబీ జెండాను రెపరెపలాడించాయి. గత నెలలో జరిగిన మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, బీజేపీ పార్టీలు నామ మాత్రపు సీట్లకే  పరిమితమయ్యాయి. బీజేపీకి ఒక్క సీటు కూడా రాకపోగా డిపాజిట్‌ కూడా దక్కలేదు. జిల్లాలో  కారు వేగానికి రెండు జాతీయ పార్టీలు దాదాపుగా  కనుమరుగైనట్లుగానే చెప్పవచ్చు. ఇతర  వామపక్ష పార్టీలు ప్రజల్లో తమ చిరునామాను నిలబెట్టుకోలేకపోయాయి.


logo