ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 26, 2020 , 00:04:04

డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్లు ఏకగ్రీవం

డీసీసీబీ, డీసీఎంఎస్‌  డైరెక్టర్లు ఏకగ్రీవం

ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 25 :జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌, జిల్లా మార్కెటింగ్‌ సొసైటీలకు సంబంధించిన డైరెక్టర్ల స్థానాలకు సింగిల్‌ సెట్‌ నామినేషన్లు దాఖలు కావడంతో ఈ రెండు సంఘాలకు ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ కార్యాలయ సమావేశ మందిరంలో వేరువేరుగా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరిగింది. డీసీసీబీ ఎన్నికల అధికారిగా కొత్తగూడెం జిల్లాకు చెందిన డీసీవో మైఖేల్‌బోస్‌ నామినేషన్లను స్వీకరించారు. సహాయ ఎన్నికలాధికారిగా ఖమ్మం జిల్లా అడిషనల్‌ రిజిస్టార్‌ అవదానుల శ్రీనివాస్‌ వ్యవహరించారు. అదేవిధంగా డీసీఎంఎస్‌ ఎన్నికల అధికారిగా విజయ్‌కుమారి, సహాయ ఎన్నికల అధికారిగా బాలజీ విధులు చేపట్టారు. ఉదయం 8  గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరిగింది. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, 3.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అయితే డీసీసీబీ డైరెక్టర్లకు సంబంధించి మొత్తం 20 స్థానాలకు గాను ఎస్సీ-3, ఎస్టీ-1 స్థానాలు మినహా మిగిలిన 16 స్థానాలకు కేవలం సింగిల్‌ సెట్‌ నామినేషన్లు దాఖలు కావడంతో డీసీసీబీ డైరెక్టర్లుగా నామినేషన్‌ దాఖలు చేసిన వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా డీసీఎంఎస్‌కు సంబంధించి మొత్తం 10 డైరెక్టర్ల స్థానాలకుగాను ఎస్సీ-1, ఎస్టీ-1 స్థానాలు మినహా మిగిలిన 8 డైరెక్టర్ల స్థానాలకు 8 సింగిల్‌ సెట్‌ నామినేషన్లు దాఖలు కావడంతో డీసీఎంఎస్‌ డైరెక్టర్లుగా నామినేషన్‌ దాఖలు చేసినవారు ఏకగ్రీవం అయ్యారు. 

నామినేషన్ల స్వీకరణకు పటిష్ట బందోబస్తు....

డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్ల స్థానాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమానికి ఎలాంటి అవరోధాలు కలగకుండా పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. నగర ఏసీపీ గణేష్‌, ట్రాఫిక్‌ ఏసీపీ రామోజీ రమేష్‌లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టారు. ఉదయం 8 గంటలకే డీసీసీబీ పరిసర ప్రాంతాలను, కార్యాలయం ఆవరణను ఆధీనంలోకి తీసుకున్న పోలీస్‌ అధికారులు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు ఎప్పటికప్పుడు సీఐలతో చర్చలు జరుపుతూ ఇబ్బందులు కలగకుండా చూశారు. డీసీసీబీ సమీపంలోని మహిళా వసతిగృహం మరోవైపు మహిళా కళాశాల దగ్గర భారీకేడ్లు  ఏర్పాటు చేసి ఇతర వాహనాలు అటువైపు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా నామినేషన్లు వేసేవారికి సంబంధించి అభ్యర్థితోపాటు మరో ఇద్దరు లేదా ఒక్కరిని మాత్రమే అనుమతించారు. సొసైటీ చైర్మన్లకు సంబంధించి తగిన గుర్తింపు కార్డులు, ఆధారాలుంటేనే కార్యాలయంలోని అనుమతించడం జరిగింది.దీంతో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా ముగిసినైట్లెంది. 

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నామినేషన్లు నిల్‌...

జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ డైరెక్టర్లకు సంబంధించి మంగళవారం జరిగిన నామినేషన్ల స్వీకరణలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌లకు చెందిన అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లు దాఖలు కాలేదు. బీ-క్లాస్‌ (వ్యవసాయేతర) సంఘాల నుంచి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి నామినేషన్లు దాఖలైనప్పటికీ ఏ-క్లాస్‌ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు) నుంచి ముగ్గురు ఎస్సీ, ఒక ఎస్టీ డైరెక్టర్‌కు రిజర్వ్‌డు అయ్యాయి. అయితే ఈ రెండు సామాజిక వర్గాల నుంచి నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 20 డైరెక్టర్ల స్థానాలకు గాను కేవలం 16 డైరెక్టర్లకు సంబంధించి మాత్రమే సింగిల్‌ సెట్‌ నామినేషన్లు దాఖలు అయ్యాయి. దీంతో ఈ సంవత్సరం డీసీసీబీ చైర్మన్‌ను 16 మంది డైరెక్టర్లు మాత్రమే ఎన్నుకోవాల్సి వచ్చింది.ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానాలకు సంబంధించి 101 స్థానాలలో ఒక్కరూ కూడా లేకపోవడంతో నామినేషన్‌ దాఖలు కాలేదు. అయితే ఎస్టీ డైరెక్టర్స్‌కు సంబంధించి ఒక సొసైటీ చైర్మన్‌ ఉన్నప్పటికి నామినేషన్‌ దాఖలు చేయకపోవడంతో ఆ స్థానం కూడా ఖాళీగానే ఉండిపోయింది. డీసీసీబీ పాలక వర్గం ఏర్పడిన తరువాత ఆయా సొసైటీలలో డైరెక్టర్‌గా ఎన్నికైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను డీసీసీబీ డైరెక్టర్లుగా నామినేటెడ్‌ చేసే అవకాశం ఉంది.