మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 24, 2020 , 23:48:08

పట్టణాల అభివృద్ధికి శ్రీకారం

పట్టణాల అభివృద్ధికి శ్రీకారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ‘పల్లెప్రగతి’కి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఇచ్చిన స్ఫూర్తితో సీఎం కేసీఆర్‌ పట్టణాల సమగ్ర అభివృద్ధికోసం ‘పట్టణ ప్రగతి’కి శ్రీకారం చుట్టారు. కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సోమవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు పదిరోజుల పాటు పట్టణ ప్రణాళిక నిర్వహించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. దీంతో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలైన కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరులో ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, బానో త్‌ హరిప్రియానాయక్‌ తొలిరోజు పట్టణ ప్రగతి కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ ఇంటిని  పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి పల్లెప్రగతిని విజయవంతం చేసి తమ గ్రామాలను సుందర పల్లెలుగా తీర్చిదిద్దుకున్నట్లే.. పట్టణ ప్రగతిలో కూడా వార్డుల ప్రజలు ముందుకు వచ్చి అధికారుల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.  ప్రాధాన్యత అంశాల వారీగా పనులను పూర్తి చేసి పట్టణాలను సుందరంగా మార్చాలన్నారు. ప్రతి వార్డు కౌన్సిలర్‌, ప్రత్యేకాధికారులు ప్రజల భాగస్వామ్యంతో వార్డుల్లో పారిశుధ్యం, పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ వీధిని తామే బాగుపరుచుకుంటామనే ఆలోచన వచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అందరూ బాధ్యతగా పనిచేసి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. 


నాలుగు మున్సిపాలిటీల్లో ‘పట్టణ ప్రగతి’ ప్రారంభం

కొత్తగూడెం మున్సిపాలిటీలోని 20వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రారంభించారు. తొలిరోజు వార్డుల్లో కౌన్సిలర్లు, ప్రత్యేకాధికారులు పర్యటించి సమస్యలను గుర్తించాలని సూచించారు. మణుగూరు మున్సిపాలిటీలో  ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు కోటకట్ట, భగత్‌సింగ్‌నగర్‌, బాపనకుంట ప్రాంతాల్లోని వార్డుల్లో ‘పట్టణ ప్రగతి’ని  ప్రారంభించారు.  ప్రతిరోజు వార్డుల్లో తాను పర్యటిస్తానని, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. ప్రజలందరూ పట్టణ ప్రగతిలో భాగస్వాములై ఆదర్శవార్డులుగా తీర్చిదిద్దుకోవాలన్నారు. ఇల్లెందు మున్సిపాలిటీలోని 12వ వార్డు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్‌ ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో ఎమ్మల్యే పాల్గొని మాట్లాడారు. పాల్వంచ మున్సిపాలిటీలోని నెహ్రూనగర్‌లో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 


పనిచేయని సిబ్బందిపై చర్యలు తప్పవు  

పట్టణ ప్రగతి కార్యక్రమం పదిరోజుల పాటు జరుగనుందని, ప్రతిరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 5గంటలకు వార్డుల్లోనే కౌన్సిలర్లు, వార్డు ప్రత్యేకాధికారులు పనిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రతిరోజు ఏదో ఒక వార్డును తాను సందర్శిస్తానని, ప్రజలు గుర్తించిన సమస్యలను సైతం పరిష్కరించకుండా, పనులు చేయకుండా నిర్లక్ష్యం వహించిన వారిని హెచ్చరిస్తామని, అయినా పనితీరులో మార్పు రాకుంటే ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తామన్నారు. పదిరోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని, పట్టణ ప్రగతి అనంతరం సీఎం కేసీఆర్‌, మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు ఆకస్మికంగా ప్రతి వార్డును సందర్శిస్తారని, పనులు సక్రమంగా జరుగని వార్డుల్లోని వార్డు ప్రత్యేకాధికారి, కౌన్సిలర్లపై చర్యలు తప్పవన్నారు. సుందరంగా ఉన్న వార్డుకు అవార్డులు సైతం అందజేస్తారని కలెక్టర్‌ చెప్పారు. అంగన్‌వాడీ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పరిశుభ్రంగా ఉండాలని, వాటికి విద్యుత్‌, కంపౌండ్‌ వాల్స్‌, టాయిలెట్స్‌, మంచినీటి సరఫరా ఏ విధంగా ఉన్నాయో సరిచూసుకోవాలని ఆయా అధికారులకు ఆదేశించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల సిబ్బంది, చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని, కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం  వారిని తొలగించే హక్కును కలెక్టర్లకు ఇచ్చారని గుర్తు చేశారు. చిత్తశుద్ధితో పనిచేసి వార్డును అభివృద్ధి చేసుకోవాలన్నారు.