శుక్రవారం 29 మే 2020
Badradri-kothagudem - Feb 24, 2020 , 23:45:01

ప్రగతి పనుల్లో పురోగతి కనిపించాలి

ప్రగతి పనుల్లో పురోగతి కనిపించాలి

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: పట్టణ ప్రగతి ప్రణాళిక పక్కాగా ఉండాలని, రోజువారీ అభివృద్ధి కల్పించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మున్సిపాలిటీ స్థాయిలో పట్టణ ప్రగతి పనులను అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లుతో కలిసి సమీక్షించారు. తొలి రోజు చేపట్టిన కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... పట్టణ ప్రగతి ప్రణాళిక పక్కాగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా జిల్లాఅధికారులు పర్యటించాలన్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు పట్టణ ప్రగతి పనులను ప్రారంభించాలని ప్రత్యేక అధికారులు, సిబ్బంది పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ ప్రగతి పనులను పరిశీలించేందుకు విజిలెన్స్‌ టీం సందర్శిస్తున్నందని తెలిపారు. పట్టణ ప్రగతిలో నాలుగు కమిటీలు ఉంటాయని, ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారన్నారు. నాలుగు కమిటీల నుంచి కమిటీకి ఇద్దరు చొప్పున సమర్థవంతమైన సిబ్బందిని ఎంపిక చేసి పనులను పర్యవేక్షించాలన్నారు. ప్రతి వార్డుకు కౌన్సిలర్‌ చైర్మన్‌గా ఉంటారన్నారు. విద్యుత్‌ శాఖనుంచి ఏఈ లేక లైన్‌మెన్‌ కానీ ఆ విధంగా వైద్య శాఖ నుంచి డాక్టర్‌ లే ఏఎన్‌ఎం, తాగునీటి సరఫరాలో ఏఈ లేక సిబ్బంది, విద్యాశాఖ నుంచి ఎంఈవో లేక సిబ్బంది, మున్సిపల్‌ పనులకు ఏఈ లే టీపీవో లేక బిల్‌ కలెక్టర్‌లు ఉండాలన్నారు. ట్రాక్టర్లకు పట్టణ ప్రగతి బ్యానర్‌ కట్టించాలని సూచించారు. ఇంటింటి చెత్త సేకరణ ప్రారంభించాలని, పారిశుద్ధ్యం పక్కాగా అమలు పరచాలన్నారు. 


ప్లాస్టిక్‌ రహితానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల వరకు అయిన పనుల వివరాల నివేదికలు పంపించాలన్నారు. కలెక్టరేట్‌లో ఈ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ నుంచి డీ సెక్షన్‌ పర్యవేక్షకులు వివరాలు తెలుసుకొని ప్రతీ రోజు జిల్లా స్థాయిలో నివేదిక రూపొందించి అందజేయాలన్నారు. అలాగే నిరక్షరాస్యత వివరాలు కూడా సేకరించాలన్నారు. పారిశుద్య కార్మికులకు చేతులకు గ్లౌజులు, ముక్కులకు మాస్కులు అందజేయాలన్నారు. అదే విధంగా చెత్తాచెదారం తొలగించేందుకు ట్రాక్టర్లకు డోజర్లును జత చేసి మున్సిపల్‌ ప్రాంతాల్లోని పురాతన భవనాలు, మట్టి కుప్పలు తొలగిస్తూ వాటి మట్టిని వర్షపు నీరు, మురికి నీరు నిలిచే ప్రాంతాల్లో వేసి చదును చేయాలన్నారు. సిబ్బందికి నీటి ట్యాంక్‌లు ఉన్న చోట చెత్తను తొలగించేందుకు, మురుగు నీరు కాలువలు సరిచేసేందుకు పికాస్‌ పారలు, గడ్డపారలు, గొడ్డళ్లు, కొడవళ్లు, తట్టలు, బ్లీచింగ్‌ ప్యాకెట్లు వెంట ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.  ఈ వీడియో కాన్ఫరెన్సులో డీఆర్‌వో లక్ష్మణస్వామి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మీ, ఆర్డీవో స్వర్ణలత, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


logo