శనివారం 05 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Feb 24, 2020 , 23:36:02

నేడు నామినేషన్ల స్వీకరణ

నేడు నామినేషన్ల స్వీకరణ

(ఖమ్మం వ్యవసాయం) ప్రస్తుతం ఖమ్మం జిల్లా కేంద్రసహకార బ్యాంక్‌ పరిధిలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతోపాటు మహబూబాబాద్‌ జిల్లా పరిధిలోని గార్ల, బయ్యారం, ములుగు జిల్లా పరిధిలోని వెంకటాపురం, వాజేడు మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 101 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఇప్పటికే వీటికి చైర్మన్ల ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. డీసీసీబీకి సంబంధించి మొత్తం 20 మంది డైరెక్టర్లు ఉంటారు. వీరిలో 16 మంది డైరెక్టర్లను సహకార సొసైటీ చైర్మన్లు (ఏ-క్లాస్‌ ఓటర్లు) ఎన్నుకుంటారు. మిగిలిన 4 మంది డైరెక్టర్ల స్థానాలకు సంబంధించి డీసీసీబీ పరిధిలో ఉన్న వ్యవసాయేతర సంఘాలకు చెందిన మరో 38 మంది (బీ-క్లాస్‌) ఓటర్లు ఎన్నుకుంటారు. ఇకపోతే డీసీఎంఎస్‌కు సంబంధించి 10 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. వీరిలో ఆరుగురు డైరెక్టర్లను సొసైటీ చైర్మన్లు (ఏ-క్లాస్‌) ఓటర్లు ఎన్నుకుంటారు. మిగిలిన డైరెక్టర్లను వ్యవసాయేతర సం ఘాల చైర్మన్లు (బీ-క్లాస్‌) ఓటర్లు ఎన్నుకుంటారు. 


నామినేషన్ల ప్రక్రియ నియమావళి

జిల్లా కేంద్రసహకర బ్యాంక్‌, జిల్లా మార్కెటింగ్‌ సొసైటీల పాలకవర్గ సభ్యుల నామినేషన్ల ప్రక్రియకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ప్రత్యేక నియమావళిని రూపొందించింది. అందుకు అనుగుణంగానే డైరెక్టర్ల స్థానాలకు నామినేషన్‌లు దాఖలు చేసే అభ్యర్థులు నామినేషన్‌లు వేయాల్సి ఉంటుంది. ఒక్క రోజు ముందుగానే సదరు అభ్యర్థులు డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికల అధికారుల నుంచి నామినేషన్‌ దరఖాస్తు ఫారాలను స్వీకరించవచ్చు. పూర్తి చేసే సమయంలో మాత్రం నిబంధంనలకు లోబడి వాటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే విధంగా దరఖాస్తుఫారంతో సంబంధితపత్రాలు సైతం పొందుపరచాల్సి ఉంది.


నామినేషన్ల పక్రియకు ఏర్పాట్లు పూర్తి 

జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌, జిల్లా మార్కెటింగ్‌ సొసైటీల డైరెక్టర్ల నామినేషన్ల ప్రక్రియకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారులు మైఖేల్‌బోస్‌, విజయకుమారి తెలిపారు. జిల్లా కేంద్రసహకార బ్యాంక్‌ కార్యాలయంలో సోమవారం వారు ఆ వివరాలు వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. నామినేషన్‌ల ప్రక్రియ సందర్భంగా అవాంఛనీయ సంఘటలకు తావు లేకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్‌ దాఖలు చేసే అభ్యర్థి వెంట ప్రతిపాదిత సభ్యుడు, బలపరుస్తున్న సభ్యుడు మాత్రమే రావాల్సి ఉంటుందన్నారు. నామినేషన్‌ల స్వీకరణ, డైరెక్టర్ల ఎన్నికలు, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఓటర్లు, ఇతర నాయకులు సహకరించాలని వారు సూచించారు. మంగళవారం నామినేషన్‌ స్వీకరణతోపాటు పరిశీలన, ఉపసంహరణల కార్యక్రమం సైతం ఉంటుందని వివరించారు. పోటీలో ఉన్న వారి వివరాలు సాయంత్రం తెలుస్తాయని, 28న బ్యాలెట్‌ పద్ధతి ద్వారా ఎన్నికల నిర్వహణ ఉంటుందని వివరించారు.