బుధవారం 03 జూన్ 2020
Badradri-kothagudem - Feb 24, 2020 , 01:07:18

సేవాలాల్‌ బాటలో నడవాలి

సేవాలాల్‌  బాటలో  నడవాలి

చుంచుపల్లి, ఫిబ్రవరి 23: సంత్‌శ్రీశ్రీశ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన ఆశయ సాధన కోసం పాటుపడాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం చుంచుపల్లి మండలంలోని నందతండ గ్రామ పంచాయతీలో నియోజకవర్గ స్థాయి సేవాలాల్‌ 281వ జయంతి ఉత్సవాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా గురువు దుర్గ మహరాజ్‌  భోగ్‌బండారో నిర్వహించారు. సేవాలాల్‌ చిత్రపటానికి వనమా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నీతికి నిజాయితికి మారుపేరు బంజారా జాతి అని, వారు ఎన్నో ఉన్నత స్థానాలను అలంకరించారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంజారా జాతి పక్షపాతి అని పేర్కొన్నారు. 


లంబాడీలకు ఆరాధ్యదైవమైన సేవాలాల్‌ మహరాజ్‌ జయంతిని ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్నారని, సేవాలాల్‌ సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా జయంతి వేడుకలను నిర్వహించాలని ఆదేశించారని పేర్కొన్నారు. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా నిధులను కేటాయించారని తెలిపారు బంజారాల సంక్షేమం కోసం తాను కృషి చేస్తానని, వారికి ఎల్లప్పుడూ అందుబాటులోఉంటానని చెప్పారు.  తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి, వాటిని అభివృద్ధి బాటలో నడిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. సేవాలాల్‌ మహరాజ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని, ప్రతి గ్రామంలో యువకులు, మహిళలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం గురువు దుర్గమహరాజ్‌ శాంతి సందే శం ఇస్తూ లంబాడీలకు సేవాలాల్‌ మహరాజ్‌ ఆరాధ్యదైవమన్నారు. లంబాడీల జీవన శైలి, చరిత్ర, సేవాలాల్‌ చేసిన సేవలను, త్యాగాలను గురించి వివరించారు.  మహనీయుడైన సేవాలాల్‌ మహరాజ్‌ జయంతిని ప్రభుత్వం గుర్తించి అధికారికంగా నిర్వహించడం హర్షనీయమన్నారు. అలాగే ఆయన జన్మదినమైన ఫిబ్రవరి 15న సెలవుదినంగా ప్రకటించేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించాలని ఎమ్మెల్యేను కోరారు. అనంతరం కమిటీ సభ్యులు వనమాను సత్కరించారు. 


అందరికీ ఆదర్శం సేవాలాల్‌

సేవాలాల్‌ మహరాజ్‌ అందరికీ ఆదర్శమని అదనపు కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లు అన్నారు. విద్యతోనే వినయం, అభివృద్ధి ఉంటుందన్నారు. లంబాడీల సంక్షేమం, అభివృద్ధి కోసం సేవాలాల్‌ మహరాజ్‌ విశేష కృషి చేశారన్నారు. అందరినీ ఒకతాటిపైకి తెచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను కొనియాడారు. అలాగే సేవాలాల్‌ జయంతి ని కూడా నియోజకవర్గ స్థాయిలో అధికారికంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. చదువు ఒక్కటే మనిషికి మారుస్తుందని, గత 50 సంవత్సరాల క్రితం హాస్టల్‌లో ఉండి చదువుకున్న వారు ఇప్పుడు ఉన్నతస్థానంలో ఉన్నారని, తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివించాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్య, ఉద్యోగ అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. బంజారాలు చదువుకుని ఉన్నత స్థాయిలో ఉండాలని కోరారు. మానవతా దృక్పదంతో వ్యవహరిస్తూ ఇతరులను ఆదుకోవడమే సంత్‌ సేవాలాల్‌కు ఇచ్చే నివాళి అన్నారు.


ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు

సంత్‌ శ్రీశ్రీశ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ 281వ జయంతి సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రేక్షకులను అలరించాయి. బంజా రా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు స్వాగతం పలుకుతూ నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బంజార ఉద్యోగ సంఘాలు, బంజారాలు తమ ఆరాధ్యదైవం సేవలాల్‌ మహరాజ్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు తరలివచ్చారు. కొందరు ఉద్యోగులు బంజార గీతాలను ఆలపించారు. నృత్యాలు చేసి అలరించారు. అనంతరం సంత్‌ శ్రీశ్రీశ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ 281వ జయంతి వేడుకలను పురస్కరించుకుని కమిటీ సభ్యులు పలువురు ప్రజాప్రతినిధులను సన్మానించారు. 


బంజార ప్రజాప్రతినిధులు ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాళోత్‌ హరిలాల్‌ కుటుం బ సభ్యులను సన్మానించారు. అనంతరం అన్నదా న కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీలు బాదావత్‌ శాంతి, భూక్యా సోన, భూక్యా విజయలక్ష్మి, జెడ్పీటీసీ బిందు చౌహాన్‌, నందతండా సర్పంచ్‌ మాళోతు లక్ష్మి, చుంచుపల్లి సర్పంచ్‌ ధనలక్ష్మి, ఆర్డీవో స్వర్ణలత, తహశీల్దార్‌లు భవాని, భద్రకాళి, నాగరాజు, రవికుమార్‌, సీఐ రాజు, ఎస్సై చల్లా అరుణ, ఎంపీటీసీ రాంబాబు, పాల్వంచ సహకార సంఘం చైర్మన్‌ కొత్వాల శ్రీనివాసరావు, డీఎంహెచ్‌వో భాస్కర్‌నాయక్‌, వివిధ శాఖల అధికారులు, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు వనమా రాఘవేందర్‌రావు, కమిటీ సభ్యులు సామ్యానాయక్‌, సీతారాంనాయక్‌, డాక్టర్‌ రవిబాబు, డాక్టర్‌ శంకర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.logo