గురువారం 03 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Feb 21, 2020 , 00:04:01

దుమ్ముగూడెం బరాజ్‌..ఇక సాగర్‌ ..?

దుమ్ముగూడెం బరాజ్‌..ఇక  సాగర్‌ ..?

శరవేగంగా కొనసాగుతున్న పనులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయి..

  • ఆనకట్టకు నామకరణం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..!
  • గోదావరిపై నిర్మిస్తున్న ఆనకట్టలకు నూతన నామకరణాలు
  • సీతారామ ప్రాజెక్టుతో నాలుగు జిల్లాలు సస్యశ్యామలం

శరవేగంగా కొనసాగుతున్న పనులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. దీనిలో భాగంగా గోదావరి నదిపై నిర్మిస్తున్న దుమ్ముగూడెం ఆనకట్టకు సీతమ్మసాగర్‌గా నామకరణం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో చర్చించినట్లు తెలుస్తోంది.. గోదావరిపై నిర్మిస్తున్న పలు ఆనకట్టలకు చరిత్ర, సంప్రదాయం, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నామకరణం చేస్తున్నారు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించే సీతారామకు ఇప్పటి వరకు అడ్డంకిగా ఉన్న అటవీ భూముల సేకరణకు క్లియరెన్స్‌ వచ్చింది. దీంతో ప్రాజెక్టు పనులు వేగవంతంగా కొనసాగుతాయి.  - ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ


ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రూ. 1200 కోట్లతో నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులపై ప్రతి నెలా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌ ప్రాజెక్టుల పనుల పురుగతిని పర్యవేక్షిస్తున్నారు. దీంతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతున్నాయి. అయితే సీఎం కేసీఆర్‌ గోదావరిపై నిర్మిస్తున్న పలు ఆనకట్టలకు చారిత్రాత్మక చరిత్ర, సంప్రదాయం, సాంస్కృతిని ప్రతిబింబించే విధంగా పేర్లను నామకరణం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి నదిపై దుమ్ముగూడెం వద్ద నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి దుమ్ముగూడెం అనకట్టుకు సీతమ్మసాగర్‌ నామకరణం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో చర్చించిట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి.  అదే విధంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండలంలోని అన్నారం వద్ద నిర్మించిన పంపుహౌజ్‌కు సరస్వతి బరాజ్‌గా నామకరణ చేసిన సంగతి తెల్సిందే. దీనితో పాటు తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మిస్తున్న పలు ప్రాజెక్టులకు కూడా పేర్లు మార్చడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించే సీతారామ ఎత్తిపోతల పథకానికి ఇప్పటి వరకు అడ్డంకిగా ఉన్న అటవీ భూముల సేకరణకు క్లియరెన్స్‌ వచ్చింది. దీంతో ప్రాజెక్టు పనులు వేగవంతంగా కొనసాగుతాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ఉన్న అటవీ భూముల నుంచి మెయిన్‌ కెనాల్‌ను నిర్మిస్తున్నారు.  దీని కొరకు అటవీ, అటవీయేతర భూములను సేకరించడం పూర్తయింది. అయితే అటవీయేతర భూముల సేకరణ వేగంగా కొనసాగుతుంది. ప్రధాన అడ్డంకిగా ఉన్న అటవీ భూముల క్లియరెన్స్‌ కూడా రావడంతో ఇక పనులు జట్‌ స్పీడ్‌ వేగంతో జరుగుతున్నాయి.  


4.93 లక్షల ఎకరాలకు సాగునీరు.. 

దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి ప్రధాన కాలువ ద్వారా కిన్నెరసాని మీదుగా గోదావరి జలాలను తరలిస్తారు. 46.3 కిలోమీటర్ల కాలువ కిన్నెరసాని నది దాటిన తర్వాత కోయగట్టు వద్ద లిఫ్ట్‌ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ 40 మీటర్ల నుంచి 110 మీటర్ల ఎత్తు వరకు అంటే 70 మీటర్ల మేర నీటిని ఎత్తిపోస్తారు. ఆ తర్వాత గ్రావిటి కాలువ ద్వారా నీటిని 108 మీటర్ల స్థాయి వరకు తరలించి కమలాపురం దగ్గర 160 మీటర్లకు ఒక లిఫ్ట్‌ను ఏర్పాటు చేస్తారు. అనంతరం అంచెలంచెలుగా 57.67 కిలో మీటర్లు గ్రావిటి కాలువ, 2.8 కిలో మీటర్లు టన్నిల్‌ ద్వారా నీటిని రేలకాయలపల్లి వరకు (153 మీటర్లు ) తరలిస్తారు. అక్కడ నీటిని లిఫ్ట్‌ చేసి 200 మీటర్ల స్థాయిలో ఉన్న రోళ్లపాడులో పోస్తారు. ఇది మూడు జిల్లాలకు ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌గా ఉంటుంది. ఇక్కడి నుంచి బయ్యారం ట్యాంక్‌, ఎస్సారెస్పీలో నిర్మించిన డీబీఎం-60 కాలువకు నీటిని అందిస్తారు. ఇలా రాజీవ్‌సాగర్‌ ప్రక్రియ పూర్తి అవుతుంది. దీని కింద 3.03 లక్షల ఎకరాలకు సాగునీరును అందిస్తారు. మరోవైపు ఇందిరాసాగర్‌ కింద ఉన్న 1.97 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు డిజైన్‌లో స్వల్ప మార్పు చేశారు. 200 మీటర్ల ఎత్తులో ఉన్న ఆయకట్టుకు కమలాపురం నుంచి ఒక లిఫ్ట్‌ను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా ఆకాంటూర్‌ కింద ఉన్న భూములకు సాగునీరు అందుతుంది. అదే విధంగా 270 మీటర్ల ఎత్తులో నీటిని ఎత్తిపోసేందుకు మరో లిఫ్ట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా 200-270 మీటర్ల మధ్యలో ఉన్న ఆయకట్టుకు నీరు అందుతుంది.


ఇలా ఈ సమీకృత ప్రాజెక్టుకు సీతారామ ఎత్తిపోతల పథకం కింద 27.4 టీఎంసీల నికర గోదావరి జలాలతో సహా మొత్తం 50 టీఎంసీల నీటిని వాడుకునేలా పథకాన్ని రూపొందించారు. నీటిని నిల్వలో భాగంగా రోళ్లపాడు రిజర్వాయర్‌ను 10.6 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్నారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రజల ప్రయోజనంతో ఏ మాత్రం సంబంధం లేకుండా ప్రతిపాదించిన దుమ్ముగూడెం, రాజీవ్‌సాగర్‌, ఇందిరాసారగ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం రీడిజైనింగ్‌  చేసింది. దీని ఫలితంగా రూపుదిద్దుకున్న  సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ. 7,969 కోట్లతో ప్రభుత్వం అనుమతులిచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా వ్యాప్కోస్‌తో సమగ్ర అధ్యయనం చేయించి సిద్ధం చేసింది.