శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 20, 2020 , 23:52:59

డీసీసీబీ, డీసీఎంఎస్‌ల

డీసీసీబీ, డీసీఎంఎస్‌ల

జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌(డీసీసీబీ) పాలకవర్గ సభ్యుల, చైర్మన్‌, వైస్‌చైర్మన్లు, జిల్లా మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌) పాలకవర్గ సభ్యుల, చైర్మన్‌ వైస్‌ చైర్మన్ల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ విడుదల చేసింది

  • ఎన్నికల షెడ్యూల్‌ విడుదల
  • 25న నామినేషన్ల స్వీకరణ.. అదేరోజు ఉపసంహరణ
  • 28న డీసీసీబీ, డీసీఎంఎస్‌ల డైరెక్టర్ల ఎన్నిక
  • 29న చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ
  • ఏ క్లాస్‌ ఓటర్లుగా సొసైటీల చైర్మన్లు
  • బీ క్లాస్‌ ఓటర్లుగా
  • వ్యవసాయేతర సంఘాల బాధ్యులు

ఖమ్మం ప్రధాన ప్రతినిధి నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌(డీసీసీబీ) పాలకవర్గ సభ్యుల, చైర్మన్‌, వైస్‌చైర్మన్లు, జిల్లా మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌) పాలకవర్గ సభ్యుల, చైర్మన్‌ వైస్‌ చైర్మన్ల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ విడుదల చేసింది. రేపు జిల్లా ఎన్నికల అధికారి ఈ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ జిల్లా వారీగా విడుదల చేయడం జరుగుతుంది. ఈ నెల 25న డీసీసీబీ, డీసీఎంఎస్‌ల పాలకవర్గ సభ్యులకు ఎన్నికలకు సంబంధించి ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అదే రోజున అధికారులతో 1-30 నుంచి 3 గంటల వరకు నామినేషన్ల పరిశీలన అనంతరం 3-30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం. 28న ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పాలకవర్గ సభ్యులకు సంబంధించి పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజున కౌంటింగ్‌ ప్రక్రియ జరుగుతుంది. 29న డీసీసీబీ, డీసీఎంస్‌లకు సంబంధించి చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నికలు జరుగుతాయి. ఇందుకు సంబంధించిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 101 వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికైన చైర్మన్లు ఓటింగ్‌లో పాల్గొంటారు. వీరితో పాటు డీసీసీబీ పరిధిలోని వ్యవసాయ ఇతర సంఘాలకు సంబంధించిన మరో 38 మంది ఓటర్లు డీసీసీబీ పాలకవర్గ సభ్యులు ఎన్నికలో ఓటుహక్కు కల్పించడం జరిగింది. సొసైటీ చైర్మన్లు ఏ-క్లాస్‌ పరిధిలోకి రాగా, వ్యవసాయేతర సంఘాలకు సంబంధించిన ఓటర్లు బీ-క్లాస్‌ సభ్యులుగా ఉంటారు. ఏ క్లాస్‌ సభ్యులు 16 మందిని ఎన్నుకోనుండగా, బీ క్లాస్‌ సభ్యులు మరో నలుగురిని డైరెక్టర్లుగా ఎన్నుకుంటారు. డీసీఎంఎస్‌లో సైతం ఇదే విధానం కొనసాగుతుంది. ఇక్కడ ఏ క్లాస్‌ సభ్యులు 6 గురు డైరక్టర్లను ఎన్నుకోవడం జరుగుతుంది. బీ క్లాస్‌కు చెందిన మరో 12మంది సభ్యులు 4గురు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. 


డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎంపిక ఇలా..

ప్రస్తుతం ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ పరిధిలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు మహబూబాద్‌ జిల్లా పరిధిలోని గార్ల, బయ్యారం మండలాలతో పాటు ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 76 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21, ములుగు జిల్లాలో 2, మహబూబాద్‌ జిల్లాలో మరో రెండు సొసైటీలున్నాయి. మొత్తం ఖమ్మం డీసీసీబీ పరిధిలో 101 సహకార సంఘాలున్నాయి. వీటికి ఇప్పటికే అన్ని సంఘాలలో ఎన్నికలు జరిగాయి. వీటితో పాటు డీసీసీబీ పరిధిలో మరో 38 మంది నాన్‌ సొసైటీలకు చెందిన సభ్యులు ఉన్నారు. డీసీసీబీ చైర్మన్‌, వైస్‌చైర్మన్లను ఎన్నుకోవాలంటే తొలుత 21 మంది పాలకవర్గ సభ్యులు ఎన్నిక కావాల్సి ఉంటుంది. సొసైటీ చైర్మన్లు ఈ ఎన్నికలలో ఏ క్లాస్‌ సభ్యులుగా ఉంటారు. నాన్‌ 

సొసైటీలకు చెందిన సభ్యులు బీ-క్లాస్‌ సభ్యులుగా ఉంటారు. 101మంది ఏ క్లాస్‌ సభ్యులు కలిపి 16 మందిని డైరెక్టర్లుగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా బీ-క్లాస్‌ చెందిన సభ్యులు మరో 4 మంది డైరెక్టర్లను ఎన్నుకోవడం జరుగుతుంది. మొత్తం 20 మంది డైరెక్టర్లుగా ఎన్నికైన తరువాత సదరు సభ్యులు ప్రత్యక్ష్యంగా కానీ పరోక్షంగా కానీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకుంటారు.


పాలకవర్గ సభ్యులకు రిజర్వేషన్లు తప్పనిసరి..

జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌, జిల్లా మార్కెటింగ్‌ సొసైటీలకు ఎన్నికయ్యే పాలకవర్గ సభ్యులు రిజర్వేషన్లకు అనుగుణంగా ఎన్నికవుతారు. ఏ క్లాస్‌, బీ క్లాస్‌ సభ్యులు పోటీలో ఉండాలంటే రిజర్వేషన్లు తప్పనిసరి, ఇప్పటికే డీసీసీబీ. డీసీఎంఎస్‌లకు సంబంధించిన రిజర్వేషన్లకు అనుగుణంగా టీం ఏర్పాటుకానుంది. పాత విధానం ప్రకారమే డీసీఎంస్‌, డీసీసీబీ పాలకవర్గాల సభ్యులకు రిజర్వేషన్లు ఖారార్‌ చేశారు.డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక...

జిల్లా మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌)ల ఎన్నికలు సైతం దాదాపు డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక తరహాలోనే జరుగనుంది. డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఏ-క్లాస్‌, బీ-క్లాస్‌ సొసైటీల సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుంది. ఎన్నికల షెడ్యూల్‌ను అనుసరించి మొత్తం 10మంది పాలకవర్గ సభ్యులకు గాను ఆరుగురు డైరెక్టర్లను ఏ-క్లాస్‌ సభ్యులు (101 సొసైటీల చైర్మన్లు ప్రత్యక్షంగా లేదా పరోక్ష పద్ధతి ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. మిగిలిన నలుగురు డైరక్టర్లకు గాను ఆయా ఇతర సొసైటీ బాధ్యులు ఎన్నుకుంటారు. సొసైటీ చైర్మన్ల ద్వారా ఎన్నికైన 10మంది డైరెక్టర్లు చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకోవడం జరుగుతుంది. కమిటీకి అనుగుణంగా నామినేషన్లు దాఖలైతే పాలకవర్గాలు ఏకగ్రీవంగా ప్రకటించడం జరుగుతుంది. కమిటీ సభ్యుల కంటే ఎక్కువ మొత్తంలో నామినేషన్లు దాఖలైతే బ్యాలెట్‌ పద్ధతి ద్వారా డైరెక్టర్ల ఎంపిక జరుగుతుంది. 
డీసీసీబీ డైరెక్టర్ల రిజర్వేషన్ల వివరాలు...


 ఏ-క్లాస్‌(సొసైటీ చైర్మన్లు)        బీ-క్లాస్‌ సభ్యులు

 నుంచి 16                (నాన్‌ సొసైటీ సభ్యులు) నుంచి 5

ఎస్టీ జనరల్‌: 3            ఎస్టీ జనరల్‌: 1

       ఎస్సీజనరల్‌: 1            ఎస్సీ జనరల్‌: 1

       బీసీ జనరల్‌: 2            బీసీ జనరల్‌: 1

       ఓసీ జనరల్‌: 10          ఓసీ జనరల్‌: 1

       మొత్తం: 16                   4


డీసీఎంఎస్‌ల పాలకవర్గ సభ్యుల రిజర్వేషన్లు ఇలా..


ఏ-క్లాస్‌(సొసైటీ చైర్మన్లు)          బీ-క్లాస్‌ (ఇతర సొసైటీల) 

    నుంచి 6         నుంచి 4

ఎస్టీ జనరల్‌: 1              ఎస్టీ జనరల్‌: 1

      ఎస్సీ జనరల్‌: 1              ఎస్సీ జనరల్‌:0       

      బీసీ జనరల్‌: 1               బీసీ జనరల్‌:1 

      ఓసీ జనరల్‌: 3               ఓసీ జనరల్‌: 2

      మొత్తం:      6                 4