గురువారం 04 జూన్ 2020
Badradri-kothagudem - Feb 19, 2020 , 00:52:11

‘పల్లె’ స్ఫూర్తితో పట్టణ ప్రగతి

‘పల్లె’ స్ఫూర్తితో పట్టణ ప్రగతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో ఉన్న ప్రతీ పట్టణం పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడి, ప్రధానరోడ్లు, గల్లీలు, అన్ని ప్రాంతాల్లో చెత్తాచెదారం లేకుండా పారిశుధ్య పనులు సక్రమంగా జరిగేలా, సుందర పట్టణాలే లక్ష్యంగా ప్రగతిబాటలో పట్టణాలు పయనించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక కార్యక్రమాన్ని తీసుకుంది.

  • పట్టణ ప్రగతికి మొదలైన ప్రణాళిక
  • 24 నుంచి కార్యాచరణ ప్రారంభం
  • ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించిన కలెక్టర్‌
  • ప్రతి వార్డుకూ 4 కమిటీలు
  • చైర్మన్లు, అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం కేసీఆర్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో ఉన్న ప్రతీ పట్టణం పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడి, ప్రధానరోడ్లు, గల్లీలు, అన్ని ప్రాంతాల్లో చెత్తాచెదారం లేకుండా పారిశుధ్య పనులు సక్రమంగా జరిగేలా, సుందర పట్టణాలే లక్ష్యంగా ప్రగతిబాటలో పట్టణాలు పయనించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక కార్యక్రమాన్ని తీసుకుంది. ప్రతీ మున్సిపాలిటీలో వార్డులవారీగా కమిటీలు వేసి అధికారులు, యువత, మేధావులు, వార్డు ప్రజలందరి సమన్వయంతో పనిచేసి తమ పట్టణాల రూపురేఖలు మారేలా ప్రణాళికా పనులు చేపట్టే విధంగా కార్యాచరణ రూపొందించింది. మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే రాజకీయాలకతీతంగా ప్రజలందరిని కలుపుకుపోతూ వార్డుల్లోని ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారానే సాధ్యమని ప్రభుత్వం గుర్తించింది. ప్రజలను భాగ్యస్వాములను చేయడం వల్ల తమ వార్డును అభివృద్ధి చేసుకోవాలనే తపన, పర్యవేక్షణ, బాధ్యత ఉంటాయనే సదుద్దేశంతో ఈ వార్డుల కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వార్డులు ఎలా ఉండాలి... రాబోయే రోజుల్లో ఏం పనిచేయాలనే అంశాలను సమీక్షించుకుంటూ అవసరమైన నిధులను వినియోగించుకుంటూ ప్రగతి పథంలో సాగే విధంగా కార్యక్రమాలను చేపట్టనున్నారు. వార్డుల్లోని ఈ కమిటీలు వార్డులో చేయాల్సిన పనులు, కమిటీ సభ్యులు చేసిన సూచనలు, సలహాలను మున్సిపల్‌ కమిషనర్లు పరిగణలోకి తీసుకొని, మున్సిపల్‌ నిధులను బట్టి అవసరమైన చోట పనుల ప్రతిపాదనలు సిద్ధం చేసి కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి అనుమతి తీసుకోనున్నారు.


పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు..

పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం గతి మారుతుందని బలంగా నమ్మిన సీఎం కేసీఆర్‌ స్వయంగా రూపొందించి అమలు పర్చిన పల్లె ప్రగతికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక పూర్తిస్థాయిలో విజయవంతమైంది. అదే ఒరవడిలో ముందుకు సాగుతూ నూతన మున్సిపల్‌ పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పట్టణ ప్రగతికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి 24 నుంచి అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. మంగళవారం ఈ విషయమై జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, జిల్లాలో ఉన్న మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లతో ప్రత్యేకంగా సమావేశమై పట్టణ ప్రగతి కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. 


ప్రతి వార్డుకూ నాలుగు కమిటీలు 

మున్సిపాలిటీలోని ప్రతి వార్డుకు నాలుగు కమిటీలు వేయాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్‌ సైతం వార్డుల కమిటీల ప్రక్రియను చేపట్టి వెంటనే పూర్తి చేయాలని మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు మొత్తం నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. నాలుగు కమిటీలలో యువకులతో కమిటీ, మహిళలతో కమిటీ, సీనియన్‌ సిటీజెన్స్‌తో కమిటీ, వార్డుల్లో ప్రముఖ,ప్రసిద్ధి పొందిన వ్యక్తులు ఇలా కమిటీలు వేయాలి. ఒక్కో కమిటీకి 15మందితో మొత్తం నాలుగు కమిటీలలో 60మంది సభ్యులు ఉంటారు. ఈ సభ్యులు వార్డుకు అవసరమైన పనులు, జరిగే, జరగబోయే, చేపట్టబోయే పనుల పర్యవేక్షణ సైతం ఉంటుంది. వార్డు అభివృద్ధి కోసం ఈ నాలుగు కమిటీలు చేసే సూచనలు కమిషనర్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌లో ప్రవేశపెట్టి చర్చిస్తారు. వార్డుకు అవసమైన పనులను ఆయా వార్డులలో ప్రాముఖ్యతను బట్టి నిధులు కేటాయింపు జరుగుతుంది. మున్సిపల్‌ కౌన్సిల్‌ లేనిచోట వార్డుల కమిటీ సభ్యులే నేరుగా కమిషనర్‌ను కలిసి సమస్యలను వివరించవచ్చు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్‌కు ఈ ప్రతిపాదనలు, సమస్యలను  సైతం వివరించి అభివృద్ధికి కావాల్సిన నిధుల అనుమతిని తీసుకుంటారు. వార్డు కమిటీలకు తద్వారా ప్రాధాన్యత ఉంటుంది. ప్రతీ మూడు నెలలకొకసారి ఈ కమిటీలు సమావేశం అయి వార్డు అభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు, ప్రతిపాదనలు తయారు చేసి మున్సిపల్‌ అధికారులకు అందజేయవచ్చు. 


‘హరితహారం’ ‘పారిశుధ్యం’పై కమిటీల పర్యవేక్షణ

మున్సిపాలిటీలలో ప్రధానంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరంతర కార్యక్రమం ‘హరితహారం’. ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించేందుకు, మొక్కలను పెంచడం వాటికి నీటిని అందించడం, వాటిని సంరక్షించడం వాటి ఎదుగుదలకు పాటుపడటం మున్సిపాలిటీలలో పచ్చదనం పెంచేందుకు ఈ కమిటీలు ప్రముఖ పాత్ర పోషించనున్నాయి. అలాగే మున్సిపాలిటీలంటే ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం ఉంటాయనే భావన ప్రజల్లో నెలకొంది. పారిశుధ్య పనుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని ప్రజల్లో ఏవగింపు ఉంది. వీటన్నింటిని పారదోలేందుకు పట్టణంలోని ప్రధానరోడ్లు, వార్డుల్లోని ప్రతి గల్లీ కూడా పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ కమిటీ ఎప్పటికప్పుడు చర్యలను చేపట్టనుంది. పారిశుధ్య పనులు సక్రమంగా జరగని పక్షంలో నేరుగా కమిటీ సభ్యులు కమిషనర్‌, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. అంతేగాక పారిశుధ్య పనుల్లో సైతం కమిటీసభ్యులు, వార్డుల ప్రజలను భాగస్వాములను చేస్తూ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేందుకు కమిటీ కార్యక్రమాలు చేపట్టవచ్చు. 


దిశానిర్దేశం చేసిన సీఎం కేసీఆర్‌ 

పల్లె ప్రగతి కార్యాచరణ మాదిరిగానే పట్టణాల్లో కూడా ప్రగతి కార్యాచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేసి పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దామని సీఎం కేసీఆర్‌ నూతనంగా ఎన్నికైన మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లకు సూచించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి మున్సిపల్‌ సమ్మేళనంలో సీఎం కేసీఆర్‌ ప్రజాప్రతినిధులకు కర్తవ్యబోధ చేశారు. మనిషి ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని, అధికారం, హోదా వచ్చాక మారొద్దన్నారు. లేనిగొప్పతనాలకు, ఆడంబరాలకు పోవొద్దని, ప్రజలు తమను తాము, పరిసరాలను బాగు చేసేందుకు మనల్ని గెలిపించారని, సంపూర్ణ మెజార్టీతో గెలిపించిన ప్రజల బాగోగులు చూడాల్సిన గురుతర బాధ్యత మనపై ఉందన్నారు. గత ప్రభుత్వాల కాలంలో మున్సిపాలిటీలు అంటేనే మురికికి, చెత్తకు, అవినీతికి పర్యాయపదాలుగా మారాయని, అటువంటి చెడ్డపేరు పోవాలంటే పారదర్శకమైన సేవలు అందించాలని సీఎం కేసీఆర్‌ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను ఆదేశించారు.


పట్టణ ప్రణాళికలో చేయాల్సిన పనులు..

*డ్రైనేజీలను శుభ్రం చేయాలి. మురికి గుంతలను పూడ్చాలి.

*విరివిగా మొక్కలు నాటాలి. హరిత ప్రణాళికను రూపొందించాలి. 

*వార్డులలో నర్సరీల ఏర్పాట్లకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలి. స్థలాలు అందుబాటులో లేకుంటే సమీప గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి.

*పట్టణంలో మంచినీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలి.

*పట్టణంలో ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో రోడ్లు పరిస్థితిని మెరుగుపర్చాలి. గుంతలను పూడ్చాలి.

*వైకుంఠధామాల ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను ఎంపిక చేయాలి.

*పొదలు, మురికి తుమ్మలను నరికివేయాలి.

*వెజ్‌/నాన్‌వెజ్‌ మార్కెట్‌లు ఎన్ని నిర్మించాలో నిర్ణయించుకొని స్థలాలను ఎంపిక చేయాలి.

*క్రీడా ప్రాంగణాలు, ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేయాలి.

*డంపింగ్‌ యార్డుల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలి.

*పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించాలి. మహిళల కోసం ప్రత్యేకంగా షీ టాయిలెట్స్‌ నిర్మించాలి. వీటికి అవసరమైనర స్థలాలు గుర్తించాలి. టాయిలెట్స్‌ నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాలను కేటాయించాలి.

*వీధుల్లో వ్యాపారం చేసుకునే వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపించే వరకు వారికి ఇబ్బందులు పెట్టొదు

*పట్టణ వాసులకు అవసరమైన పార్కింగ్‌ స్థలాలను గుర్తించాలి. అవసరమైన ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను పార్కింగ్‌ కోసం ఏర్పాటు చేయాలి.

*పట్టణ విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఆధునిక పద్ధతులను అవలంబించాలి. ప్రమాద రహిత విద్యుత్‌ వ్యవస్థ ఉండాలి. వంగిన, తుప్పుపట్టిన, రోడ్ల మధ్యలో ఉన్న స్తంభాలను, ఫుట్‌పాత్‌లపై ఉన్న నియంత్రికలు మార్చాలి. వేలాడే తీగెలను సరిచేయాలి.


logo