మంగళవారం 02 జూన్ 2020
Badradri-kothagudem - Feb 17, 2020 , 23:32:39

‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి..

‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి..

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: వచ్చేనెల 19వ తేదీ నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్ష నిర్వహణ ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం 14,674 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, 41 జోన్లుగా విభజించి 75 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షలు నిర్వహణ రోజుల్లో సమీపంలోని అన్ని జిరాక్సు కేంద్రాలను నిర్దేశిత సమయం వరకు ముసివేయించాలని చెప్పారు. పరీక్షలకు ఐదుగురు నాయబ్‌ తహసీల్దార్లకు ఫ్లైయింగ్‌ స్కాడ్‌ విధులు కేటాయించామన్నారు. వారి జాబితాను సిద్ధం చేసి ఉత్తర్వులను తయారు చేయాలని, నియమించిన అధికారులు మార్చి 18వ తేదీన డీఈవో కార్యాలయంలో రిపోర్టు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డీఆర్‌వోకు సూచించారు. 


విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసుకునేందుకు వీలుగా పరీక్షా కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణం కల్పించేందుకు జనసంచారం లేకుండా 144 సెక్షన్‌ను విధించనున్నట్లు చెప్పారు. ప్రశ్నా, జవాబు పత్రాలు భద్రపరిచే కేంద్రాల వద్ద మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు పటిష్ట పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏడు జోన్లుగా విభజించి ఎస్కార్ట్‌ టీమ్‌లను ఏర్పాటు చేయనున్నామని, ఐదుగురు ఎస్సైలతో ఫ్లైయింగ్‌ స్కాడ్‌ బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలలో మొబైల్‌ పెట్రోలింగ్‌ ఉంటుందని, పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్‌ అధికారులకు సూచించారు. విద్యార్థులు ఏదేని అస్వస్థతకు గురైతే తక్షణం వైద్య సేవలు అందజేసేందుకు అత్యవసర చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ట్రైనీ కలెక్టర్‌ అనుదీప్‌, డీఆర్‌వో లక్ష్మణస్వామి, డీపీఆర్‌వో శ్రీనివాసరావు, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ సురేందర్‌, జిల్లా వైద్యాధికారి భాస్కర్‌నాయక్‌, మున్సిపల్‌ కమీషనర్‌ సంపత్‌కుమార్‌, డీపీవో ఆశాలత పాల్గొన్నారు.


logo