గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 17, 2020 , 00:27:21

కబడ్డీ.. కబడ్డీ..

కబడ్డీ.. కబడ్డీ..

ఇల్లెందు నమస్తే తెలంగాణ: ఇల్లెందులోని సింగరేణి స్టేడియంలో సోమవారం జిల్లా కబడ్డీ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు ప్రారంభం కానున్నాయి. క్రీడలను రాష్ట్ర క్రీడాశాఖమంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రారంభించనున్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరావు, మానుకోట ఎంపీ మాలోత్‌ కవిత, ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. జడ్పీ చైర్మన్‌లు కోరం కనకయ్య, లింగాల కమల్‌రాజ్‌, ఆంగోత్‌ బిందు, మహబూబాబాద్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యేలు హజరయ్యే అవకాశం ఉంది. చివరి రోజున గెలిచిన జట్టుకు ట్రోఫీని అందజేయడానికి ఐటీ, మున్సిపల్‌ శాఖమంత్రి కేటీఆర్‌ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్‌, జిల్లా కబడ్డీ అసోషియేషన్‌ అధ్యక్షుడు బానోతు హరిసింగ్‌నాయక్‌ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 33 మహిళా జట్లు, 33 పురుషుల జట్లు పోటీల్లోపాల్గొననున్నాయి. మొత్తం 1100 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటుండగా నిర్వాహకులు వారికి వసతి, భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు.


కబడ్డీ.. కబడ్డీ.. ఇది మన జాతీయ క్రీడ. ఒకప్పుడు ప్రతి గ్రామంలో కబడ్డీ పోటీలు నిర్వహించేవారు.  శ్రీరామనవమి, సంక్రాంతి, శివరాత్రి, దసరా, వినాయకచవితి తదితర పండుగలకు ఉత్సాహభరితంగా కబడ్డీ పోటీలు నిర్వహించేవారు. కొన్నాళ్ల పాటు స్తబ్దత ఏర్పడింది. తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్‌ అన్ని క్రీడలకు సమప్రాధాన్యతనిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కబడ్డీ పోటీలకు ప్రాచుర్యం పెరిగింది. ప్రో కబడ్డీ పోటీల ద్వారా కబడ్డీకున్న క్రేజ్‌ మరింత పెరిగింది. ప్రస్తుతం ఎక్కడ విన్నా కబడ్డీ గురించే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఇల్లెందులో రాష్ట్రస్థ్దాయి కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు జిల్లా అసోసియేషన్‌ ముందుకొచ్చింది.  ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఒకప్పుడు కబడ్డీకి ఊహించని క్రేజ్‌ ఉండేది. రెండు జిల్లాల్లో ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం మద్దులపల్లి కబడ్డీ జట్టు చాలా ప్రాచుర్యం పొందింది. అనేకమార్లు జిల్లా, రాష్ట్ర స్థ్దాయిలలో విజయకేతనం ఎగురవేసింది. ఏజెన్సీ ప్రాంతమైన మద్దులపల్లిలో కబడ్డీ క్రీడాకారులకు పెట్టింది పేరు.  ప్రస్తుతం ఇల్లెందులో కబడ్డీ ఫీవర్‌ పట్టుకుంది. 


మద్దులపల్లి జట్టు ఆధిపత్యం 

కామేపల్లి మండలం అడవిమద్దులపల్లి. రాష్ట్ర స్థాయిలో మద్దులపల్లి జట్టు ఆధిపత్యం కనబరిచేది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి పోటీలు ఎక్కడ నిర్వహించినా కప్పు ఆ గ్రామానికే సొంతమయ్యేది. 1986 నుంచి 2006 వరకు తిరుగులేని కబడ్డీ జట్టుగా రికార్డులకెక్కింది. జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో అనేక బహుమతులు గెలుచుకుంది. ఉమ్మడి జిల్లాలో మద్దులపల్లి పేరును దేశ చరిత్రలో లిఖించేలా చేసింది. 


ప్రోత్సాహానికి ఊపిరి 

ఉమ్మడి జిల్లాలో మద్దులపల్లి జట్టు అనేక సార్లు రికార్డు స్థాయిలో బహుమతులు గెలుచుకున్నా ప్రోత్సాహం కరువైంది. జాతీయ జట్టు తరుపున మద్దులపల్లి క్రీడాకారులకు అవకాశం దక్కలేదు. ఖమ్మం ఉమ్మడి జిల్లా, ఇల్లెందు ఏజెన్సీలో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారు. వాళ్ల ప్రతిభకు ఊపిరి పోసేందుకే కబడ్డీ క్రీడలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఇల్లెందులో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఇల్లెందులో అన్ని సౌకర్యాలు లేకపోయినా ఏజెన్సీని దృష్టిలో పెట్టుకొని ఇల్లెందులో నిర్వహించడానికి అసోసియేషన్‌ ముందుకొచ్చింది.  ఇల్లెందు పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపజేసేలా రాష్ట్రస్థాయిలో ప్రాచుర్యం పొందేలా క్రీడలు ఇక్కడ నిర్వహించాలని కబడ్డీ అసోసియేషన్‌ భావించింది. తద్వారా ఇక్కడి క్రీడాకారుల్లో చైతన్యం నింపడం, వారి ప్రతిభకు ఊపిరిపోయడానికి అసోసియేషన్‌ తనవంతు కృషి చేస్తూ వస్తుంది. భవిష్యత్‌లో ఇల్లెందుకు స్పోర్ట్స్‌ స్కూల్‌ వచ్చే విధంగా తమవంతు ప్రయత్నం చేస్తున్నట్లు వివరించింది. ఏజెన్సీ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇదొక సువర్ణావకాశమని అభిమానులు, క్రీడాకారులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు.