మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 16, 2020 , 01:07:38

ఎన్నికలుఏవైనా విజయం గులాబీదే..

ఎన్నికలుఏవైనా విజయం గులాబీదే..
  • 20 సొసైటీలకు 18 టీఆర్‌ఎస్‌ ఖాతాలో..
  • నేడు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక
  • ఇంటిపార్టీకే రైతన్నల మద్దతు
  • ప్రశాంతంగా ముగిసిన సహకార ఎన్నికలు
  • జిల్లాలో 85.1 శాతం పోలింగ్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వరుస ఎన్నికల్లో విజయదుందుబి మోగించిన టీఆర్‌ఎస్‌ పార్టీ అదే జోష్‌లో ముందుకు సాగుతూ శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సహకార ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నది. మరోమారు తిరుగులేని శక్తిగా అవతరించింది. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్‌, స్థానిక సంస్థలు, మొన్న మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తాచాటిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కేవలం రైతన్నలే ఓటింగ్‌లో పాల్గొనే సహకార ఎన్నికల్లో కూడా అఖండ విజయాన్ని సాధించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి పెట్టుబడికి ఎకరాకి రూ.5 వేలు అందిస్తూ రైతుని రాజును చేసేలా సీఎం కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. సమైక్యాంధ్ర పాలనలో కుదేలైన రైతాంగానికి నూతన జవసత్వాలు అందిస్తూ తెలంగాణలో కోటి ఎకరాల మాగాణిని సస్యశ్యామలం చేసేందుకు బృహత్తర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత భక్తరామదాసు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం, సీతారామ ఎత్తిపోతల పథకం, దుమ్ముగూడెం బరాజ్‌ నిర్మాణానికి నిధుల కేటాయింపు తదితర పనులను శరవేగంగా పూర్తి చేస్తూ ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆయకట్టును స్థిరీకరించడమే ధ్యేయం గా ముందుకు సాగుతున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీకి రైతులు సంపూర్ణ మద్దతు తెలిపి, తమ జీవితాలను బాగు చేసుకునేందుకు ముందుకు కదిలారు. ఇన్నాళ్లు తమను దగా చేసిన పార్టీలను కాలదన్ని ఇంటిపార్టీని గుండెల్లో పెట్టుకొని అక్కున చేర్చుకున్నారు. దీంతో ఏ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో చూసినా గులాబీ గుబాళించింది. 


టీఆర్‌ఎస్‌కే రైతుల మద్దతు

రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి రైతులు తమ ఓటు ద్వారా మద్దతు తెలిపారు. శనివారం జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో జిల్లాలోని 21 సొసైటీలను ఎన్నికకు ముందే రెండు స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 18 స్థానాల్లో 16 సొసైటీలను గెలుచుకొని మొత్తం 18 స్థానాలను తన ఖాతాలో వేసుకున్నది.  డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లను గెలుచుకోనుంది. వరుస ఎన్నికల్లో విజయాలను సాధిస్తూ ప్రత్యర్థి పార్టీల అడ్రస్‌ను గల్లంతు చేసింది. వివిధ పార్టీలతో కూటమిగా జతకట్టిన జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ 31 స్థానాలకే పరిమితమైంది. మరో జాతీయ పార్టీగా చెప్పుకునే బీజేపీకి కేవలం ఒకే ఒక వార్డు దక్కింది. 


169 స్థానాలను గెలుచుకున్న టీఆర్‌ఎస్‌

జిల్లాలోని 20 సొసైటీలకు జరిగిన ఎన్నికల్లో 169స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుచుకుంది. మొత్తం 260 డైరెక్టర్‌ స్థానాలకు 107 స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 153 స్థానాలకు శనివారం ఎన్నిక జరిగింది. ఇందు లో 62 స్థానాలు టీఆర్‌ఎస్‌ గెలుచుకొని అత్యధిక డైరెక్టర్‌ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో 169 స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ సొం తం చేసుకుంది. కాంగ్రెస్‌ 31 స్థానాలు, సీపీ ఎం 13, సీపీఐ 14, టీడీపీ 11, ఇతరులు 22 స్థానాల్లో గెలుపొందారు. జిల్లాలోని 20 సొసైటీల్లో ఎన్నికలు నిర్వహించగా 18 సొసైటీలను టీఆర్‌ఎస్‌ గెలుచుకోగా, మరో రెండు సొసైటీలను కూడా కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. చర్ల సొసైటీ ఆరు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ గెలుపొందగా, మరో ఆరు వార్డులను కాంగ్రెస్‌ గెలుపొందింది. మరో వార్డు ఇండిపెండెంట్‌ అభ్యర్థి గెలుపొందారు. ములకలపల్లి సొసైటీలో నాలుగు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలుపొందగా, ఇతర పార్టీలు 9 స్థానాల్లో గెలుపొందాయి. ఈ సొసైటీ కూడా టీఆర్‌ఎస్‌ కూటమికి దక్కే అవకాశం ఉంది. జిల్లా పరిధిలో విస్తరించి ఉన్న ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాల్లో రెండు సొసైటీలను, మహబూబాబాద్‌ జిల్లాలోని గార్ల, బయ్యారం మండలాల్లో రెండు సొసైటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది.