సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 16, 2020 , 01:05:09

సహకార పోరు ప్రశాంతం

సహకార పోరు ప్రశాంతం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలోని సహకార ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన సొసైటీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ 9 గంటలకు 31శాతం పోలింగ్‌ కాగా, 10 గంటలకు 56శాతం, 11 గంటలకు 72శాతం, మధ్యాహ్నం 12 గంటలకు 83 శాతం, ఒంటి గంటకు పోలింగ్‌ ముగిసే సమయానికి 85.1 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 33,945 మంది ఓటర్లకు గాను 28,881 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ ప్రక్రియ పూర్తి కావడంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి పోలింగ్‌ కేంద్రాల్లోనే కౌంటింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకు కౌంటింగ్‌ చేసి అభ్యర్థుల ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. గెలుపొందిన అభ్యర్థులకు అప్పటికప్పుడు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. కొన్ని వార్డుల్లో ఇరు పార్టీల అభ్యర్థులకు సమానమైన ఓట్లు రాగా టాస్‌ ద్వారా ఫలితాన్ని నిర్ణయించారు. మరో వార్డులో రెండు ఓట్లతో అభ్యర్థి ఓటమి పాలవగా రీ కౌంటింగ్‌ చేయాలని పట్టుబట్టడంతో అధికారులు రీకౌంటింగ్‌ చేసి అనంతరం ఫలితాలను వెల్లడించారు. 


నేడు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక.. 

సొసైటీ ఎన్నికలు పూర్తి కావడంతో ఎన్నికల అధికారులు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలను నిర్వహించేందుకు ఇప్పటికే అభ్యర్థులకు లిఖిత పూర్వకంగా ఎన్నికకు ఆహ్వానించారు. ఆదివారం ఉదయం ప్రత్యేక సమావేశాన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనే ఏర్పాటు చేసి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికను నిర్వహిస్తారు. ముందుగా డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం చేతులెత్తే పద్ధతితో ఈ ఎన్నికను నిర్వహిస్తారు. జిల్లాలోని 20 సొసైటీల్లో ఎన్నికల అధికారులు, మానిటరింగ్‌ అధికారులు, సొసైటీ ప్రత్యేక అధికారులు ఈ ఎన్నికను జరిపిస్తారు. భద్రాచలం సొసైటీలో 40 మంది ఓటర్లు ఉన్నందున, ఎస్టీ వార్డుకు ఓటరు లేనందున ఆ ఎన్నికను వాయిదా వేశారు. తదుపరి ఎన్నిక ప్రత్యేక నోటిఫికేషన్‌ ద్వారా జరపనున్నట్లు అధికారులు తెలిపారు.