ఆదివారం 23 ఫిబ్రవరి 2020
నేడే సహకార సమరం

నేడే సహకార సమరం

Feb 14, 2020 , 23:14:59
PRINT
నేడే సహకార సమరం
  • 19 సొసైటీలకు ఎన్నికలు
  • పంపిణీ కేంద్రాల నుంచి తరలిన ఎన్నికల సామగ్రి
  • బందోబస్తు నడుమ పోలింగ్‌ కేంద్రాలకు తరలింపు

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : సహకార సమరానికి సర్వం సిద్ధమైంది. జిల్లాలో 19 సొసైటీలకు ఆయా సొసైటీ కార్యాలయాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కలెక్టర్‌ ఎంవీ రెడ్డి పర్యవేక్షణలో జిల్లా సహకార అధికారి మైఖేల్‌బోస్‌ నేతృత్వంలో ఎన్నికులు సజావుగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరుగనుంది. జిల్లాలోని 21 సొసైటీలకు గాను రెండు సొసైటీలు ఏకగ్రీవం అవగా, 18 సొసైటీలకు బ్యాలెట్‌ పద్ధతిన ఎన్నికలు జరగనున్నాయి. భద్రాచలం సొసైటీలో కేవలం 40 మంది ఓటర్లే ఉండటంతో చేతులెత్తే పద్ధతిన ఎన్నిక జరగనుంది. కాగా ఎస్టీ ఓటరు లేనందున 12 వార్డులకే నామినేషన్‌ ప్రక్రియ జరిగి డైరెక్టర్లను ఎన్నుకోనున్నారు. మిగతా 18 స్థానాల్లోని పోలింగ్‌ కేంద్రాలకు జిల్లాలోని డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల నుంచి మెటీరియల్‌ను ఆయా ఎన్నికల అధికారులు తరలించారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆర్డీవో కనకం స్వర్ణలత చుంచుపల్లి హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన మెటీరియల్‌ పంపిణీ కేంద్రాన్ని పరిశీలించి మెటీరియల్‌ను పంపిణీ చేయించారు. 


పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి

జిల్లాలోని ఐదు పంపిణీ కేంద్రాల ద్వారా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయించి పోలింగ్‌ సిబ్బంది, బ్యాలెట్‌ బాక్సులు, పోలింగ్‌ మెటీరియల్‌ను బందోబస్తు ద్వారా పోలింగ్‌ కేంద్రాలకు తరలి వెళ్లారు. దమ్మపేట, అశ్వారావుపేట, నారాయణపురం సొసైటీలకు అశ్వారావుపేట నియోజకవర్గంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో, బూర్గంపాడు, పాల్వంచ, ములకలపల్లి సొసైటీలకు పాల్వంచ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ బొల్లోరిగూడెంలో, కొత్తగూడెం, జూలూరుపాడు, గానుగపాడు, గుంపెన సొసైటీలకు కొత్తగూడెంలోని చుంచుపల్లి హైస్కూల్‌లో, మణుగూరు, పినపాక సొసైటీలకు సమితిసింగారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో, భద్రాచలం, సత్యనారాయణపురం, చర్ల, దుమ్ముగూడెం సొసైటీలకు నన్నపనేని మోహన్‌ జడ్పీహైస్కూల్‌ భద్రాచలంలో, ఇల్లెందు, గుండాల, బేతంపూడి సొసైటీలకు జేబీఎస్‌ హైస్కూల్‌ ఇల్లెందులో పోలింగ్‌ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. 


పోలింగ్‌ కేంద్రాలు ఇవే..

జిల్లాలోని ఆయా కేంద్రాల్లో జిల్లా పరిషత్‌ హైస్కూళ్లను పోలింగ్‌ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. భద్రాచలం సొసైటీకి చేతులెత్తే పద్ధతి ద్వారా ఎన్నిక జరుగనున్నందున అక్కడ కూడా పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బూర్గంపాడు సొసైటీకి జడ్పీహెచ్‌ఎస్‌ బూర్గంపాడు, దమ్మపేట సొసైటీకి జడ్పీహెచ్‌ఎస్‌ దమ్మపేట, చర్ల సొసైటీకి జడ్పీహెచ్‌ఎస్‌ చర్ల, సత్యనారాయణపురం సొసైటీకి జడ్పీహెచ్‌ఎస్‌ సత్యనారాయణపురం, జూలూరుపాడు సొసైటీకి జడ్పీహెచ్‌ఎస్‌ జూలూరుపాడు, పాల్వంచ సొసైటీకి బొల్లోరిగూడెం జడ్పీహెచ్‌ఎస్‌లో, మణుగూరు సొసైటీకి సమితిసింగారం జడ్పీహెచ్‌ఎస్‌లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పినపాక సొసైటీకి జడ్పీహెచ్‌ఎస్‌ పినపాక, దుమ్ముగూడెం సొసైటీకి జడ్పీహెచ్‌ఎస్‌ దుమ్ముగూడెం, అశ్వారావుపేట సొసైటీకి జడ్పీహెచ్‌ఎస్‌ అశ్వారావుపేట, కొత్తగూడెం సొసైటీకి జడ్పీహెచ్‌ఎస్‌ చుంచుపల్లి, ఇల్లెందు సొసైటీకి జేబీఎస్‌ హైస్కూల్‌ ఇల్లెందు, గానుగపాడు సొసైటీకి రేపల్లెవాడ హైస్కూల్‌, గుంపెన సొసైటీకి యర్రగుంట జడ్పీహెచ్‌ఎస్‌, బేతంపూడి సొసైటీకి టేకులపల్లి హైస్కూల్‌, గుండాల సొసైటీలో జడ్పీహెచ్‌ఎస్‌ గుండాల, ములకలపల్లి సొసైటీకిజ డ్పీహెచ్‌ఎస్‌ ములకలపల్లిలో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.


ఎన్నికల సిబ్బంది 455 మంది ..

జిల్లాలో 19 సొసైటీలకు జరిగే ఎన్నికలకు పోలింగ్‌ సిబ్బందిని నియమించారు. పీవోలు 153 మంది, ఏపీవోలు 153 మంది, వోపీవోలు 131 మందిని నియమించడంతో పాటు రిజర్వులో కొంత మంది సిబ్బందిని నియమించారు. ఎలక్షన్‌ అధికారులు 18 మంది, మానిటరింగ్‌ అధికారులు 18 మంది, మండల ప్రత్యేక అధికారులు 18మందిని నియమించారు. పంపిణీ కేంద్రాల ద్వారా కేటాయించిన సిబ్బంది విధుల్లో జాయిన్‌ అయ్యారు. ప్రత్యేక బస్సుల్లో ఎన్నికల మెటీరియల్‌తో పాటు సిబ్బంది కూడా పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చారు. జిల్లాలోని 153 వార్డులకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించారు. 33,945 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 


సొసైటీల వారీగా ఓటర్లు..

కొత్తగూడెంలో 3,673, బేతంపూడిలో 4,620, గానుగపాడులో 2,089, గుండాలలో 2,189, మణుగూరులో 2,334, ఇల్లెందులో 2,376, సత్యనారాయణపురంలో 847, చర్లలో 915, పినపాకలో 3,384, ములకలపల్లి 1,976, జూలూరుపాడు 2,569, పాల్వంచలో 960, గుంపెనలో 1,074, దుమ్ముగూడెంలో 1,382, దమ్మపేట 1,625, బూర్గంపాడులో 1,144, అశ్వారావుపేటలో 383, నారాయణపురంలో 405 మంది మొత్తం 153 వార్డుల్లో 33,945 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 


logo