శనివారం 05 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Feb 14, 2020 , 23:10:50

సంక్షేమ సర్కారుకు రైతుల మద్దతు

సంక్షేమ సర్కారుకు రైతుల మద్దతు
  • అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించిన రైతాంగం
  • రేపు చైర్మన్‌ పీఠాలకు ఎన్నికలు
  • ప్రభుత్వ పథకాలకు విశేష ఆదరణ
  • సహకార ఎన్నికల్లోనూ ‘గులాబీ’ వైపే..
  • ఫలితాలపై టీఆర్‌ఎస్‌ ధీమా..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :దేశంలో ఎక్కడాలేని విధంగా రైతును ఆర్థికంగా బలోపేతం చేసేందుకు టీఆర్‌ఎస్‌ అధిష్టానం నడుం బిగించింది. సమైక్యపాలనలో కుదేలైన వ్యవసాయ రంగానికి నూతన జవసత్వాలను నింపుతూ అనేక సాగునీటి ప్రాజెక్ట్‌లను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి సాగునీరు, తాగునీరును సమృద్ధిగా అందించేందుకు రూ.13వేల కోట్లతో సీతారామ ప్రాజెక్ట్‌ను శరవేగంగా నిర్మిస్తుంది. అంతేకాకుండా సముద్రంలో కలిసే నీటిని ఒడిసిపట్టి జిల్లా రైతాంగానికి ప్రతి ఎకరాకు రెండు పంటలకు నీరందించేందుకు ఇటీవలికాలంలో సుమారు రూ.4500 కోట్లతో దుమ్ముగూడెం బరాజ్‌ నిర్మాణానికి ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు జరిపి రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతుంది. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికలలో గులాబీపార్టీకే మద్దతిచ్చిన రైతన్నలు తిరిగి సహకార ఎన్నికల్లో కూడా గులాబీ జెండాకే తమ మద్దతు తెలపనున్నారు. ఇప్పటికే జిల్లాలో 2 సొసైటీలను ఏకగ్రీవం చేసుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ అదే ఊపుతో శనివారం జరగనున్న ఎన్నికలలో కూడా తన సత్తా చాటనుంది. 


నేడు జరిగే ఎన్నికలలో మెజార్టీ స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకునేందుకు సన్నద్ధమైంది. దీంతో మెజార్టీ స్థానాలు గులాబీ పార్టీకి దక్కనున్నాయి. పంచాయతీల నుంచి పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు మొన్న జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన గులాబీ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో సహకార ఎన్నికలను కూడా సంపూర్ణం చేసే దిశగా పావులు కదిపింది. పార్టీ అధిష్టానం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు మెజార్టీ సొసైటీలను ఏకగ్రీవం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. రైతుల మద్దతును కూడగట్టి మరోమారు జిల్లాలో తిరుగులేని శక్తిగా మారేందుకు సన్నాహాలు చేస్తోంది.  


ఇంటి పార్టీకే పట్టం కట్టనున్న రైతన్నలు

జిల్లా అంతటా ఇప్పటికే గులాబీ వర్ణం సంతరించుకుంది. ఏ ఎన్నికల్లో చూసినా గెలుపు గులాబీదే అవుతూ ప్రతిపక్ష పార్టీల అడ్రస్‌ గల్లంతవుతున్నాయి. ప్రతీ ఎన్నికల్లో బీరాలు పలికిన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు, వామపక్షాలు కారు దెబ్బకు తమ ఉనికిని కోల్పోయి చతికిలపడ్డాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన నాటి నుంచి సీఎం కేసీఆర్‌ వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసి రైతును రాజు చేసేందుకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. రైతుబీమా, రైతుబంధు, ఉచిత విద్యుత్‌, రైతుకు సులభంగా రుణాలు, రుణమాఫీ లాంటి వాటిని అమలు చేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతును ఆర్థికంగా బలోపేతం చేసేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో జరిగిన అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకే రైతులు మద్దతిచ్చి విజయాలను కట్టబెట్టారు. 


అదే తీరుగా రైతే ఓటరుగా పాల్గొనే సహకార సంఘాల ఎన్నికల్లో తిరిగి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారులను గెలిపించి మరింత అభివృద్ధిని అందుకునేందుకు రైతులందరూ ఒక్కతాటిపైకి వస్తున్నారు. దీంతో జిల్లాలో అత్యధిక సొసైటీలలో వార్డు సభ్యులు టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుచుకోనుంది. గులాబీ దళపతి సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో సహకార ఎన్నికల్లో కూడా పూర్తి మెజార్టీని సాధించి జిల్లాలో పూర్తిస్థాయిలో పార్టీ పాగా వేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే రాష్ట్రస్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు తమ పరిధిలోని సహకార సంఘాల సమావేశాల్లో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లాలో ఎన్నికలు జరిగే 19 సొసైటీలకు 19 సొసైటీల పరిధిలో ఉన్న వార్డు సభ్యులను పూర్తిస్థాయిలో గెలుచుకొని జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు, సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వనున్నారు. అత్యధిక సొసైటీలను కైవసం చేసుకొని అనంతరం జరిగే డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికల్లో సత్తాను చాటనున్నారు.


నేటి సాయంత్రానికి ఫలితాల వెల్లడి

శనివారం ఉదయం ప్రారంభమయ్యే సహకార ఎన్నికలు మధ్యాహ్నం కల్లా ముగియనుండటంతో కౌంటింగ్‌ ప్రారంభించి సాయంత్రానికల్లా ఫలితాలను వెల్లడిస్తారు. 16వ తేదీ ఆదివారం చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎన్నికల అధికారి పర్యవేక్షణలో డైరెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసి మెజార్టీ సభ్యుల ఆమోదంతో చైర్మన్‌ ఎన్నిక జరగనుంది. చైర్మన్‌తో పాటు వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కూడా జరగనుంది. దీంతో గెలిచిన డైరెక్టర్లకు ధ్రువీకరణ పత్రాలను అప్పటికప్పుడు అందజేయనున్నారు. జిల్లాలో జరిగే 19 సహకార సొసైటీల పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ జరుపుకునేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పోలీస్‌ బందోబస్తు నడుమ నేడు పోలింగ్‌ జరగనుంది. జిల్లాలోని 33,945 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 153 వార్డులకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.