గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 13, 2020 , 23:47:07

మొక్క నాటుదాం... కేసీఆర్‌కు గిఫ్ట్‌ ఇద్దాం..

మొక్క నాటుదాం... కేసీఆర్‌కు గిఫ్ట్‌ ఇద్దాం..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని మరోవైపు వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటాలని ఇప్పటికే నిర్ణయించారు. ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు జిల్లా, మండల స్థాయి అధికారులు ఆ రోజున మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొక్కలు నాటడం ద్వారా హరితహారాన్ని పెంపొందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం గత 6 సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా కోట్లాది మొక్కలను నాటడం జరిగింది. మూడు, నాలుగు సంవత్సరాల క్రితం నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా ఎదిగాయి.  

ప్రతి బడిలో, గుడిలో మొక్కలు నాటే కార్యక్రమం....

మహానేత జన్మదినం సందర్భంగా అన్ని ప్రభుత్వశాఖల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది. ఈ మేరకు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలో మొక్కలు నాటాలని ఆదేశాలు జారీ చేశారు.  అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలల్లో కూడా మొక్కలు నాటాలని నిర్ణయించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధ్ది శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామపంచాయతీలో ఒక నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు.  జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో మొక్కలు నాటనున్నారు. అదే విధంగా గ్రామాల పరిధిలోని పాఠశాలలతో పాటు దేవాలయాలు, చర్చిలు, మస్జీద్‌ ఆవరణాలలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున జరగబోతుంది. 

ప్రతి ఒక్కరిలో  పెరిగిన అవగాహన...

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అడవుల పెంపకం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ప్రతి ఏడాది వర్షాలు పడగానే  మొక్కలు నాటడం జరుగుతుంది. దీని కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో మొక్కలు నాటాలనే ఉత్సాహం, అవగాహన పెరిగింది. దీనికి తోడు యువనేత, రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌ కూడా గ్రీన్‌ ఛాలెంజ్‌ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టారు. వీఐపీలు, బ్యూరోక్రాట్స్‌ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సాధారణ ప్రజల్లో కూడా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలనే ఆసక్తి, ఆలోచన వచ్చింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతుంది. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ నిధుల్లో 10శాతం నిధులను హరితహారానికి ఖర్చు పెట్టాలని నూతన చట్టాలో ఉండడంతో మొక్కల పెంపకానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. నిధుల కొరత కూడా ఉండడం లేదు. అంతేకాకుండా ప్రజాప్రతినిధుల్లో మరింత బాధ్యత పెరిగింది.