శుక్రవారం 05 జూన్ 2020
Badradri-kothagudem - Feb 13, 2020 , 01:31:01

నిరంతర ప్రగతికి నిధులు

నిరంతర ప్రగతికి నిధులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ‘గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది.. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు... ఈ నానుడిని బలంగా నమ్మిన కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అనేక పథకాలు ప్రవేశ పెట్టారు.. అంతరించిపోతున్న కులవృత్తులకు జీవం పోస్తూ గ్రామీణ జనజీవనాన్ని గ్రామాల్లోనే ఉన్న వనరులతో స్థిరపరచి తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. తద్వారా గ్రామాలన్నీ కొత్తరూపును సంతరించుకున్నాయి. తాజాగా ఓ కొత్త నిర్ణయం తీసుకుని గ్రామాల అభివృద్ధికి బాటలు వేశారు. ప్రతి జిల్లా కలెక్టర్‌కు రూ.కోటి ప్రత్యేక నిధులను విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రానున్న రోజుల్లో కలెక్టర్లు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. గ్రామాల్లో పర్యటించిన సందర్భంలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనుల కోసం రూ.కోటి కలెక్టర్‌ విచక్షణతో వినియోగించనున్నారు. క్రూషియల్‌ బ్యాలెన్సింగ్‌ ఫండ్‌ (సీబీఎఫ్‌) కింద జిల్లాకు రూ.కోటి విడుదల చేశారు. 


అధికారుల, ప్రజల సమన్వయంతో అభివృద్ధి..

జిల్లాలో పల్లె ప్రగతిపై కాకుండా ఇతర కార్యక్రమాలను జిల్లా అధికారులతో సమన్వయం చేసుకునేందుకు రానున్న రోజుల్లో వైర్‌లెస్‌ సెట్లు అందనున్నాయి. గ్రామాల్లో భూ రికార్డుల నిర్వహణ, రెవెన్యూ పరమైన అంశాలు, ఇతర సంస్కరణల దిశగా కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్లు పనిచేయనున్నారు. డీపీవో, డీఎల్‌పీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులతో అడిషనల్‌ కలెక్టర్లు నిత్యం సమావేశం అవుతూ గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. పల్లెలను అభివృద్ధి చేయడంతో పాటు గ్రామాల్లో అక్షరాస్యత శాతాన్ని కూడా పెంచేందుకు కృషి చేయనున్నారు. నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా మార్చే బాధ్యతను గ్రామ సర్పంచ్‌, ఇతర ప్రజాప్రతినిధులు తీసుకోనున్నారు. సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా మార్చేంత వరకు కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్ల సలహాలను, సూచనలను పాటిస్తూ గ్రామాల్లో అక్షరాస్యత కోసం పాటుపడనున్నారు. 

జిల్లాలో పంచాయతీరాజ్‌ సమ్మేళనం..


గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసిన సీఎంకేసీఆర్‌ అందుకు అనుగుణంగా మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఇటీవల నియమించిన అడిషనల్‌ కలెక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పల్లె అభివృద్ధి చేసేందుకు తీసుకునే చర్యలపై  కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. రానున్న పదిహేను రోజుల్లో జిల్లాస్థాయిలో పంచాయతీరాజ్‌ సమ్మేళనం నిర్వహించి స ర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు, ఎంపీపీ లు, జడ్పీటీసీలకు గ్రామాలను అభివృద్ధి చేసుకునే పద్ధతులను వివరించనున్నారు. ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధిపై అవగాహన కార్యక్రమం జరుగనుంది. సమ్మేళనాలకు ఎమ్మెల్యేలు, జెడ్పీచైర్మన్లు, ఎంపీ, మంత్రులు హాజరై గ్రామాల అభివృద్ధిపై ప్రసంగించనున్నారు. అనంతరం గ్రామాల్లో తిరిగి పల్లెకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కొనసాగించనున్నారు. పంచాయతీల్లో జరిగే పనులను బట్టి అవార్డులు, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందనున్నాయి. జిల్లాలో జరగనున్న పంచాయతీరాజ్‌ సమ్మేళనానికి ఇన్‌చార్జిగా రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు బాధ్యతలను అప్పగించారు.


కొనసాగుతున్న పల్లె ప్రగతి స్ఫూర్తి..

దసరా పండుగకు ముందు తీసుకొచ్చిన ఈ కార్యక్రమం ప్రజల్లో విస్తృత ప్రాచుర్యం పొంది గ్రామాల్లో ఉన్న ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ గ్రామాలను పరిశుభ్రంగా, సుందరంగా అధికారుల భాగస్వామ్యంతో 30 రోజుల్లో తీర్చిదిద్దుకున్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ సీఎం కేసీఆర్‌ మరో పది రోజుల పాటు పల్లెకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. రెండో విడుతలో కూడా జిల్లాలో ఉన్న పల్లె ప్రజలందరూ స్వచ్చందంగా ముందుకొచ్చి తమ గ్రామాలను బాగు చేసుకున్నారు. అనంతరం పల్లె ప్రగతి నిరంతరంగా కొనసాగించేందుకు ప్రతి నెల రూ.339 కోట్లు పల్లెల అభివృద్ధికి మంజూరు చేస్తూ ప్రతీ గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌, వాటర్‌ ట్యాంకర్‌, శ్మశాన వాటిక, డంపింగ్‌ యార్డు లాంటి శాశ్వత పనులను మంజూరు చేసి వాటిని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. 


నిరంతరం అభివృద్ధి పనులు

గ్రామాల అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రెండు విడుతలుగా పల్లెకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని తీసుకొచ్చి అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో పల్లెల రూపురేఖలను సమూలంగా మార్చేసింది. దీనిని నిరంతరం కొనసాగించి పల్లెలను సమగ్రాభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఇందుకు అనుగుణంగా నిధులను కూడా అందిస్తూ వస్తున్నారు. దీంతో పల్లెలన్నీ ప్రగతిబాటలో పయనిస్తున్నాయి. పల్లెలు పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండేందుకు హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణా బాధ్యతలను కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్‌, అధికారులకు అప్పగించారు. దీంతో పల్లెలన్నీ పచ్చదనంతో దర్శనమిస్తున్నాయి. 


logo