బుధవారం 03 జూన్ 2020
Badradri-kothagudem - Feb 13, 2020 , 01:29:32

ఓరి దేవుడా.. నీకు మనసెలా వచ్చెరా..

ఓరి దేవుడా.. నీకు మనసెలా వచ్చెరా..

(ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ):

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. నిండు చూలాలు రోడ్డుపై ఛిద్రం కావడంతోపాటు కడుపులో ఉన్న బిడ్డ కంకర రోడ్డుపై ఎగిరిపడ్డాడు. పెనుబల్లి మండల కేంద్రంలో బుధవారం జరిగిన రోడ్డు ఈ ప్రమాదాన్ని చూసిన స్థానికుల హృదయాలు బరువెక్కాయి. మండల పరిధిలోని రామచందర్‌రావు బంజర గ్రామానికి చెందిన బలుసుపాటి కల్యాణి (20), భర్త మురళి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షల నిమిత్తం వచ్చారు. ఆసుపత్రిలో పరీక్షల తరువాత తల్లీబిడ్డలు పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. వైద్యులు. 19 రోజులు ఆగి వచ్చే నెల మార్చి 2న కాన్పునకు రమ్మని సూచించారు. త్వరలోనే తమ బిడ్డ తమ ఒడిలోకి చేరబోతున్ననే సంతోషంతో తమ బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు ఆ దంపతులు. మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన ఆ దంపతులను ఓ లారీ బలంగా ఢీ కొట్టింది. హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌ వెళుతున్న ఆ లారీ వాయువేగంతో వచ్చి వీరి ద్విచక్ర వాహానాన్ని ఢీ కొట్టడంతో వెనుక కూర్చున్న కల్యాణి కిందపడింది. ఆ కుదుపునకు నిండు గర్భిణి కడుపులో బిడ్డ పది మీటర్ల దూరంలో కంకర రోడ్డుపై పడిపోయింది. లారీ టైర్ల కింద పడి తల్లి ఛిద్రమై అక్కడికక్కడే శ్వాసవిడిచింది. దూరంగా పడిని శిశువు పది నిమిషాలపాటు కొన ఊపిరితో కొట్టుకుంది. ప్రమాదంలో మృతురాలి భర్త తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. 

గ్రామంలో విషాద ఛాయలు

రేపు, మాపో ప్రసవించబోయే మహిళ లారీ టైర్ల కింద పడి నుజ్జునుజ్జు కావడాన్ని, ఆమె గర్భంలోని శిశువు పేగులు తెంచుకొని పది మీటర్ల దూరంలో ఎగిరి పడడాన్ని చూసిన స్థానికులు, గ్రామస్తుల ఆర్తనాదాలు మిన్నంటాయి. మరికొన్ని రోజుల్లో మరో ప్రాణికి జన్మను ఇవ్వబోయే తల్లి తనువు గుర్తుపట్టలేని విధంగా లారీ కిందపడి నుజ్జునుజ్జయిన ప్రదేశాన్ని, ప్రపంచం లేని తెలియని శిశువు రోడ్డు పక్కనున్న రాళ్లపై పడిన ఘటనను చూసిన స్థానికులు కన్నీటిని ఆపుకోలేకపోయారు. తల్లీ శిశువుల మృతితో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా కొన ఊపిరితో ఉన్న శిశువును స్థానికులు వెంటనే వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ తోట నాగరాజు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేశారు.


logo