సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 13, 2020 , 01:26:06

శ్రీసేవాలాల్‌ మహరాజ్‌కి జై ఆంధ్రప్రదేశ్‌లో జన్మించి...

శ్రీసేవాలాల్‌ మహరాజ్‌కి జై  ఆంధ్రప్రదేశ్‌లో జన్మించి...

   ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తిలోని రాంజీనాయక్‌తండాకు చెందిన రాంజీనాయక్‌ ముగ్గురు కుమారుల్లో ఒకరు భీమానాయక్‌. ఆయనకు ధర్మినిబాయి అనే ధర్మపత్ని ఉంది. వీరికి 3,755 ఆవులు, 6,400 ఎద్దులు, గరాసియసాండ్‌ (ఆంబోతు), తొళారం గుర్రాలున్నాయి. అయితే వీరికి సంతానం మాత్రం కలగలేదు. అయితే బంజారాల ఆరాధ్యదైవాలైన సాతిభవానిలలో (తొళ్జా, మత్రాల్‌, హింగళా, ధ్వాళంగర్‌, కంకాళి, దండి, సీత్లా) ఒకరైన మేరామాయాడి ధర్మినిబాయి కలలో కనిపించి.. మీకు సంతాన ప్రాప్తి కలగజేస్తాను. పుట్టిన మొదటి బిడ్డకు 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అతడిని భగత్‌(సేవకుడిగా) నియమించాలని చెప్పింది. అందుకు భీమానాయక్‌ దంపతులు సంతోషించినప్పటికీ.. మొదటి సంతానాన్ని భగత్‌గా చేయాల్సి వచ్చినందుకు బాధపడతారు. వీరికి 1739 ఫిబ్రవరి 15న సేవాలాల్‌ మహరాజ్‌ జన్మించారు. అనంతరం హప, బద్దు, బాణా అనే సంతానం కలిగారు.

పుట్టకతోనే జ్ఞాని

     అమ్మవారి అనుగ్రహంతో పుట్టిన సేవాలాల్‌ మహరాజ్‌ పుట్టకతోనే మహాజ్ఞానిగా ఉన్నాడు. చిన్నతనంలోనే సకల విద్యలను ప్రదర్శించేవాడు. పశువులను కాసేవాడు. ఉదయాన్నే లేచి సమీపంలోని కాళోకూండ్‌ (నల్లకుంట)లో స్నానమాచరించి సూర్య నమస్కారాలు చేసి తన దినచర్యను ప్రారంభించేవాడు. ఎవరికి కష్టం వచ్చినా వారి సమస్యలను పరిష్కరించేవాడు. ఒకరోజు మేరామాయాడి కలలో దర్శనమిచ్చి అతడిని భగత్‌గా మారాలని సూచిస్తుంది. అయితే స్వతహాగా మద్యం ముట్టని, మాంసం తినని సేవాలాల్‌ మేరామాయాడితో ‘నీకు రక్తతర్పణం చేయడం కాని, మద్యాన్ని నైవేధ్యంగా ఇవ్వడం కానీ చేయలేనని, తాను భక్తితో మాత్రమే పూజించగలనని.. అందుకు భగత్‌గా మారడం కష్టమని’ చెబుతాడు. భగత్‌గా మారేందుకు సేవాలాల్‌ నిరాకరించడంతో మేరామాయాడి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇచ్చిన మాటను తప్పాడనే కోపంతో మేరామాయాడి సేవాలాల్‌ కుటుంబాన్ని ఇబ్బందులపాలు చేయాలని తలుసుంది. సేవాలాల్‌ చిన్నతమ్ముడు బాణాను, ఆంబోతును, గుర్రాలను, 3,755 పశువులను పూర్తిగా నాశనం చేస్తుంది. చివరకు సేవాలాల్‌కు ఒక పూట భోజనం కూడా కరువవుతుంది. దీంతో మేరామాయాడిని శాంతింప చేసేందుకు భీమా దంపతులు కడావ్‌ (ప్రత్యేక వంటకం) వండి అమ్మవారి సాక్షాత్కారాన్ని పొందుతారు.

అమ్మవారికే షరతులు

      సేవాలాల్‌ అమ్మవారికి కొన్ని షరతులు పెట్టి తాను భగత్‌గా ఉంటానని మాట ఇస్తాడు. తాను మాత్రం శాఖాహారిగా ఉంటూ మద్యం సేవించనని ఆ వెసులుబాటుతో సేవకునిగా మారుతాడు. దీంతో అమ్మవారు అనుగ్రహించి అతని తమ్ముడ్ని పునర్జీవింపచేస్తూ సంపదను తిరిగి ఇస్తుంది. సంవత్సరానికి ఒకసారి కడావ్‌, చుర్మో (బియ్యం పిండితో చేసిన) నైవేద్యాన్ని సమర్పిస్తామని, జీవహింసను చేయబోమని చెబుతాడు. తన నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కు అమలు కావాలని కోరడంతో దేవి అన్ని వరాలను ఇచ్చేందుకు సేవాలాల్‌ను అనుగ్రహిస్తుంది. దీంతో సేవాలాల్‌ తన అలవాట్ల ద్వారా మంచి పేరు సంపాదిస్తారు. 


అధికారికంగా నేడు సేవాలాల్‌ జయంతి

      గతంలో ఎన్నడూ లేని విధంగా..తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సేవాలాల్‌ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సేవాలాల్‌ జయంతిని కేవలం బంజారాలు మాత్రమే జరుపుకునేవారు. రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పుడు ఈ జయంతిని లంబాడీల సంస్కృతి సంప్రదాయాల ప్రకారం.. నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈనెల 15న సేవాలాల్‌ 281వ జయంతిని నిర్వహించేందుకు నియోజకవర్గాల వారీగా రూ.6.19 లక్షల నిధులను కేటాయించారు. ప్రతి తండాలో సేవాలాల్‌ మహరాజ్‌ జయంతిని నిర్వహించనున్నారు. అధికారులతోపాటు గిరిజన సంఘాలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. వీరి ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బంజారాల సంప్రదాయ భోగ్‌బండారో, మహిళల నృత్యాలతో ఈ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు.  


1806లో ఆత్మను వదిలి..

      సేవాలాల్‌ తన చివరిదశలో యత్మర్‌ జిల్లా డిగ్రాస్‌ తాలూకాలోని రూయీ అనే తండాలో నివశించాడు. మేరామాయాడి కటాక్షంతో తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన సేవాలాల్‌ 1806 ఏడాది ఏప్రిల్‌ 14న మహారాష్ట్రలోని బేరార్‌లోని నేటి అకొలా జిల్లాలకు డిగ్రస్‌ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో పొహర అనే గ్రామంలో తన పార్థివ దేహాన్ని వదిలారు. ఆయన కుటుంబీకులు ఆయన స్మృత్యర్థం రెండు మందిరాలను పక్కపక్కనే నిర్మించారు. ఒకటి ఆయన కోసం.. మరొకటి మేరామాయాడి కోసం నిర్మించారు. పొహర ప్రాంతాన్ని 1870లో పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దారు. ఈ ప్రాంతం బంజారాలు తరుచుగా సందర్శించే ప్రార్థన స్థలంగా రూపుదిద్దుకుంది. ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా గుత్తి నియోజకవర్గంలో సేవాగడ్‌ నిర్వహిస్తారు. దేవాలయం ఆవరణంలో భోగ్‌ బండారోలో నిర్వహిస్తారు. సేవాలాల్‌కు అత్యంత ప్రీతికరమైన లాప్సి (పాయసం), చుర్మో (బియ్యంపిండితో రొట్టెను చేసి..అందులో బెల్లం, నెయ్యి కలిపి చేసే వంటకం)ను పొయ్యిలో వేసి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ భోగ్‌ అనేది మన పూర్వీకులు నిర్వహించిన యజ్ఞం లాంటిది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.