శనివారం 05 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Feb 13, 2020 , 01:25:28

రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలి..

రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలి..

కొత్తగూడెం క్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు నిత్యం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, మహిళల భద్రత పట్ల పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సునీల్‌ దత్‌ అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో జిల్లాలోని అన్ని సబ్‌డివిజన్ల పోలీస్‌ అధికారులతో ఏర్పాటు చేసిన నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు 2020 సంవత్సరాన్ని మహిళలకు భద్రత కల్పించడంలో, రోడ్డు ప్రమాదాలను నివారించండంలో జిల్లాలోని పోలీస్‌ అధికారులు, సిబ్బంది మెరుగైన ఫలితాలను సాధించి ప్రజల్లో పోలీస్‌ శాఖపై మరింత విశ్వాసాన్ని నింపాలన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీగా సరైన ప్రణాళికలు రూపొందించి వాటి ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. ఎక్కువగా యువత నిర్లక్ష్యంగా వాహనాలు నడపం ద్వారా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని.. త్రిబుల్‌ రైడింగ్‌, మైనర్లకు వాహనాలు ఇవ్వడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్‌ డ్రైవింగ్‌, ఓవర్‌ స్పీడ్‌ వంటి విషయాలపై దృష్టి సారించి నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రజలంతా రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్‌ శాఖకు సహకరించాలని కోరారు. జిల్లాలోని రాష్ట్ర, జాతీయ రహదారులలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, సంబంధిత అధికారులతో చర్చలు జరిపి ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నిత్యం వాహన తనిఖీలు చేపట్టి హెల్మెట్‌ ధరించకుండా, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించే వాహనాలపై, రోడ్డు భద్రత నియమాలను పాటించని వారికి జరిమానాలు విధించి కౌన్సిలింగ్‌ నిర్వహించాన్నారు. అదే విధంగా ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో వాహన తనిఖీలు చేపట్టి ఇసుక అక్రమ రవాణాదారులపై సమాచారం వస్తే రెవెన్యూ అధికారులతో సంయుక్తంగా దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలి అదేశించారు. ఏజెన్సీలో పనిచేసే పోలీస్‌ అధికారులు ఎప్పటికపుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలోని ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లో 5ఎస్‌ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని, పాట్రో కార్‌, బ్లూ కోల్ట్‌ వాహనాలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రోడ్లపై సంచరిస్తూ ఉండాలన్నారు. డయల్‌ 100పై మహిళలకు, విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి పోలీస్‌ సేవలను సద్వినియోగం చేసుకునేలా వారిలో ఆత్మైస్థెర్యాన్ని నింపాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) అట్ల రమణారెడ్డి, ఏఆర్‌ అదనపు ఎస్పీ బోయిన కిష్టయ్య, భద్రాచలం ఏఎస్పీ ఎం. రాజేష్‌ చంద్ర, ట్రైనీ ఐపీఎస్‌ బిరుదరాజు రోహిత్‌ రాజు, కొత్తగూడెం డీఎస్పీ షేక్‌ మహమ్మద్‌ అలి, పాల్వచ డీఎస్పీ కేఆర్‌కే ప్రసాద్‌, మణుగూరు డీఎస్పీ రామానుజం, ఎస్బీ ఇన్స్‌పెక్టర్‌ శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ ఇన్స్‌పెక్టర్‌ గురుస్వామి, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ ఇన్స్‌పెక్టర్‌ బూర రాజగోపాల్‌, ఆర్‌ఐలు సీహెచ్‌ఎస్వీ కృష్ష, బి. సోములు నాయక్‌, తుత్తురు దామోదర్‌, ప్రగడ కామరాజు, ఇన్స్‌పెక్టర్లు లింగనబోయిన ఆదినారాయణ, ఎం.ఏ. షుకూర్‌, డి. వేణుచందర్‌, ముసుకు అబ్బయ్య, బత్తుల స్యనారాయణ, లావుడ్యా రాజు, పులిగిళ్ల నవీన్‌, వినోద్‌ రెడ్డి, సట్ల రాజు, దోమల రమేష్‌, బాణోత్‌ రాజు, ఎం. నాగరాజు, అన్నిస్టేషన్ల ఎస్సైలు, పోలీస్‌ పీఆర్‌వో దాములూరి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.