మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 11, 2020 , 23:17:50

సహకార పోరుకు మూడు రోజులే..

సహకార పోరుకు మూడు రోజులే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సహకార సంఘాల సమరానికి కేవలం మూడు రోజులే మిగిలింది. వారం, పది రోజుల నుంచి ఎన్నికల నిర్వహణలో నిమగ్నమైన అధికారులు 15న జరిగే సహకార సంఘం ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 21 సహకార సంఘాలకు గాను ఇప్పటికే రెండు సంఘాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 19 సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. 18 సహకార సంఘాలకు నామినేషన్లు దాఖలు చేయగా 107 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 153 డైరెక్టర్‌ స్థానాలకు 350 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రైతుసంఘాల సభ్యులు, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల పరిధిలో ఉన్న సహకార సంఘాలకు ఎన్నికలు జరిపేందుకు జిల్లా సహకార అధికారి మైఖేల్‌బోస్‌ ఆయా సహకార సంఘాల పరిధిలో పోలింగ్‌ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఎన్నికల అధికారులకు కూడా సహకార ఎన్నికల నియమనిబంధనల గురించి తెలియజేసి బ్యాలెట్‌ పత్రాల ద్వారా ఓటింగ్‌ నిర్వహించే ప్రక్రియను ముందస్తుగానే తెలియజేశారు. 


పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి..

జిల్లాలోని 19 సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఇతర జిల్లాల నుంచి బ్యాలెట్‌ బాక్సులను తీసుకొచ్చి జిల్లా కేంద్రం నుంచి అన్ని సహకార సంఘాలకు ఎన్నికల సిబ్బందితో బ్యాలెట్‌ బాక్సులను పంపిణీ చేశారు. దీంతో పాటు పోలింగ్‌ మెటీరియల్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఆయా సొసైటీల పరిధిలో ఎన్నికల అధికారులు బ్యాలెట్‌ పత్రాలను తయారు చేయించారు. గుర్తులు కేటాయించిన విధంగా సొసైటీల వారీగా ఏకగ్రీవ వార్డులకు మినహా మిగతా వార్డులకు బ్యాలెట్‌ పత్రాలను సిద్ధం చేశారు. ఒక్కో సొసైటీలో 13 మంది డైరెక్టర్‌ స్థానాలకు నామినేషన్లు వేయగా, కొన్ని వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. జిల్లాలోని అశ్వాపురం, నెల్లిపాక సొసైటీలు 13 స్థానాలకు 13 మంది నామినేషన్లు దాఖలు కావడంతో ఈ రెండు సొసైటీలు ఏకగ్రీవం అయ్యాయి. 


పచారంలో రైతులను కలుసుకుంటున్న అభ్యర్థులు..

సహకార ఎన్నికల ప్రచారానికి రైతుసంఘాల నాయకులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వరుస ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీ సొసైటీలను కైవసం చేసుకునేందుకు ఇప్పటికే ప్రజలందరితో సమావేశాలు ఏర్పాటు చేసి మీ ఓటు మాకే వేయాలని వార్డు స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. జిల్లాలోని ఎక్కువ స్థానాలు టీఆర్‌ఎస్‌ ఖాతాలోనే జమ కావడంతో మిగతా స్థానాలను కూడా టీఆర్‌ఎస్‌ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది. భద్రాచలం డివిజన్‌లో 3 సొసైటీల్లో 13 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇల్లెందు డివిజన్‌లోని 2 సొసైటీలకు గాను ఒక స్థానం ఏకగ్రీవం అయింది. పినపాక డివిజన్‌లోని 2 సొసైటీలు ఏకగ్రీవం కాగా, నాలుగు సొసైటీల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. కొత్తగూడెం డివిజన్‌లో రెండు సొసైటీలకు ఏడు స్థానాలు ఏకగ్రీవం కాగా మరో 19 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఆరు సొసైటీలకు గాను 41 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగతా వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని 260 డైరెక్టర్‌ స్థానాలకు 107 స్థానాలు ఏకగ్రీవం కాగా, 153 స్థానాలకు 350 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 


భద్రాచలంసొసైటీకి అదే రోజు నామినేషన్‌, ఎన్నిక..

జిల్లాలోని అన్ని సొసైటీల కంటే భద్రాచలం సొసైటీలో అతి తక్కువ మంది ఓటర్లు ఉన్నారు. కేవలం 40 మంది ఓటర్లే ఉండటంతో ఆ సొసైటీకి ప్రత్యేక నోటిఫికేషన్‌ను ఎన్నిక రోజే ఇవ్వనున్నారు. అక్కడ ఉన్న 40 మంది ఓటర్లలో ఎస్టీ ఓటరు లేకపోవడం, 12 వార్డులు మాత్రమే ఉండటంతో చైర్మన్‌ ఎన్నిక ఉత్కంఠగా మారనుంది. అధికారులు ఇంకా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదే రోజు నామినేషన్లు, పరిశీలన, స్క్రూట్నీ, చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక జరగనుంది. దీంతో 20 సొసైటీలకే నామినేషన్లు, ఉపసంహరణ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. జిల్లాలోని రెండు సొసైటీలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 18 సొసైటీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి.