సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 11, 2020 , 23:14:03

నవమి బ్రహ్మోత్సవాలకు మాస్టర్‌ ప్లాన్‌

నవమి బ్రహ్మోత్సవాలకు  మాస్టర్‌ ప్లాన్‌

 భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో మార్చి 25 నుంచి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్‌2న శ్రీసీతారాముల వారి కల్యాణం, 3న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు మరో 40రోజులు గడువు మాత్రమే ఉండటంతో దేవస్థానం ఇప్పటికే శ్రీరామనవమి కసరత్తులను ప్రారంభించింది. రూ.కోటిన్నరకు పైగా ఈ కల్యాణానికి దేవస్థానం ఖర్చు చేయనుంది. రూ.85.97లక్షలతో వివిధ భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు పనులు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి దేవాదాయశాఖ అనుమతి కూడా దేవస్థానానికి లభించింది. ఇప్పటికే 33 పనులకు సంబంధించిన టెండర్లను కూడా ఆహ్వానించారు. ఈనెల 15, 24వ తేదీల్లో ఈ ప్రొక్యూర్‌ మెంట్ల ద్వారా ఈ టెండర్ల ప్రక్రియను ఖరారు చేయనున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ తరువాత శ్రీరామనవమి పనులను ప్రారంభించే అవకాశం ఉంది. రూ.85.97లక్షలతో వివిధ ఏర్పాట్లను చేయనున్నారు. కల్యాణ మండపంలో ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేస్తారు. ప్రధాన ఆలయం విద్యుదీకరణ గావిస్తారు. గోదావరి ఘాట్‌, పర్ణశాల కల్యాణ మండపం వద్ద విద్యుత్‌ పనులను చేపడతారు. ఆర్చీగేట్లు, చలువ పందిళ్లు, షామియానాలు, తాత్కాలిక వసతి, మరుగుదొడ్లు, సీసీ కెమేరాలు ఏర్పాటు, తలంబ్రాలు, ప్రసాదాల కౌంటర్లు, ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తారు. తానీషా కల్యాణ మండపానికి, డార్మెంటరీ హాల్స్‌కు, స్టేడియానికి, కల్యాణ మండపంలోని సెక్టార్లకు, గ్వాలియం సీట్లకు రంగులు వేస్తారు. పట్టణంలోని వివిధ ఆర్చీ గేట్లకు సైతం రంగులు వేస్తారు. కరకట్ట ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దుతారు. బారీకేడింగ్‌ నిర్మాణాలు చేపడతారు. రూ.85.97లక్షలతో వివిధ పనులను దేవస్థానం చేపట్టనుండగా, వివిధ శాఖల తరుఫున చేపట్టే పనులకు కూడా దేవస్థానం ఖర్చులను చెల్లిస్తోంది. అవి మరో రూ.50లక్షలకు పైగానే ఉండే అవకాశం ఉంది.   

ఈసారి అధికారులందరూ కొత్తవారే..

ఏప్రిల్‌2న జరిగే శ్రీసీతారాముల కల్యాణం, 3న జరిగే శ్రీరామ పట్టాభిషేకానికి ప్రభుత్వ పెద్దలు హాజరయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా భారీ ఎత్తున వీవీఐపీలు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో సకల ఏర్పాట్లను చేయాల్సి ఉంది. అయితే ఈ ఏడాది నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు సంబంధించి జిల్లాలో అధికారులందరూ కొత్త వారే కావడం గమనార్హం. కలెక్టర్‌గా ఎంవీ రెడ్డి ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. దేవస్థానం ఈవో జీ.నరసింహులు కూడా ఇటీవలే విధుల్లో చేరారు. భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌ కూడా కొత్త వారే. భద్రాచలం సబ్‌కలెక్టర్‌ పదోన్నతిపై వెళ్లడంతో కొత్తగూడెం ఆర్‌డీవోకు ఇన్‌చార్జి ఇచ్చారు. వీరంతా కొత్తవారే కావడంతో ఈ ఉత్సవాల విజయవంతానికి పెద్ద ఎత్తున కసరత్తులు చేయాల్సి ఉంది. ఈ నెలాఖారుకే శ్రీరామనవమి జిల్లా సమీక్ష సమావేశం జరగనుందని తెలిసింది. ఈ మహోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఆ దిశగా ఏర్పాట్లను కూడా చేపట్టాల్సి ఉంది. ఇందుకు పూర్తిస్థాయిలో కసరత్తులు జరిపితే బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయవచ్చు. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కూడా త్వరలోనే శ్రీరామనవమి సమీక్ష సమావేశం జరగనుందని తెలిసింది.