బుధవారం 03 జూన్ 2020
Badradri-kothagudem - Feb 11, 2020 , 01:17:56

డీసీసీబీపై గులాబీ జెండా..

డీసీసీబీపై గులాబీ జెండా..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సహకార సంఘాల ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. జిల్లాలోని 20 సొసైటీల్లో 933 మంది నామినేషన్లు దాఖలు చేయగా, స్క్రూట్నీలో 65 నామినేషన్లు తొలగించగా 868 నామినేషన్లు మిగిలాయి. ఇందులో 411 మంది ఉపసంహరణ చేసుకోగా, 350 మంది డైరెక్టర్‌ పదవులకు బరిలో ఉన్నారు. 15వ తేదీన జరగనున్న సహకార ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా విధివిధానాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సొసైటీ కార్యాలయాల పరిధిలోని ఎన్నికల కో ఆర్డినేటర్లు బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నుకునే విధానం గురించి పోలింగ్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. 20 సొసైటీల్లోని ఎన్నికల అధికారులు, మండల ప్రత్యేక అధికారులు నామినేషన్‌ పత్రాలను పూర్తిస్థాయిలో పరిశీలించి పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. ఎవరెవరు పోటీలో ఉన్నారు, ఎన్ని వార్డులు ఏకగ్రీవం అయ్యాయనేది స్పష్టత ఇచ్చారు. 15వ తేదీన సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్నందున జిల్లా అధికారులు సొసైటీల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. ఇప్పటికే బ్యాలెట్‌ బాక్సులను జిల్లా కేంద్రం నుంచి మండలాల్లో ఉన్న సహకార కార్యాలయాలకు తరలించారు. ఎన్నికల సిబ్బందికి వార్డుల వారీగా బ్యాలెట్‌ పత్రాలను కూడా పంపిణీ చేశారు. 

జిల్లాలోని 21 సహకార సంఘాలకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తికావడంతో 20 సహకార సంఘాలకు 350 మంది ఎన్నికల బరిలో నిలిచారు. 107 మంది డైరెక్టర్లు ఏకగ్రీవమయ్యారు. కొత్తగూడెం- 27, పాల్వంచ - 14, బేతంపూడి- 36, ఇల్లెందు-29, గానుగపాడు-26, గుంపెన-12, అశ్వారావుపేట-06, నారాయణపురం-7, ములకలపల్లి-19, దమ్మపేట-10, గుండాల-30, జూలూరుపాడు-19, దుమ్ముగూడెం-13, సత్యనారాయణపురం-22, చర్ల- 26, బూర్గంపాడు-8, మణుగూరు-28, పినపాక-18 మంది ఆయా సొసైటీల పరిధిలో పోటీలో ఉన్నారు.  

ఏకగ్రీవం దిశగా 7 సొసైటీలు.. 

జిల్లాలోని 21 సొసైటీల్లో 15న ఎన్నికలు జరగనున్నందున ముందస్తుగా రాజకీయ నాయకులు సొసైటీలను ఏకగ్రీవం చేసుకున్నారు. వివిధ సొసైటీల పరిధిలోని నాయకులు, రైతులు కలిసి డైరెక్టర్ల స్థానాలను ఏకగ్రీవం చేసుకొని సొసైటీలను కైవసం చేసుకున్నారు. నారాయణపురంలో 10 వార్డులు, బూర్గంపాడులో 9 వార్డులు, గుంపెన 7 వార్డులు, అశ్వారావుపేటలో 10 వార్డులు, జూలూరుపాడులో 6 వార్డులు, ములకలపల్లిలో 6 వార్డులు, దుమ్ముగూడెంలో 8 వార్డులు, దమ్మపేటలో 8 వార్డులు ఏకగ్రీవం చేసుకొని సొసైటీలను తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో పాటు నెల్లిపాక, అశ్వాపురం సొసైటీలు రెండు ఏకగ్రీవం అయ్యాయి. ఈ రెండు సొసైటీలకు ఎన్నికలు జరగవు. ఏకగ్రీవ డైరెక్టర్లతో పాటు రెండు సొసైటీల్లో ఉన్న 26 మంది డైరెక్టర్లకు ఏకగ్రీవ ధ్రువీకరణ పత్రాలను ఎన్నికల అధికారులు అందజేశారు. 

భద్రాచలం సొసైటీకి అదే రోజు నామినేషన్‌, ఎన్నిక..

జిల్లాలోని అన్ని సొసైటీల కంటే భద్రాచలం సొసైటీలో అతి తక్కువ మంది ఓటర్లు ఉండటంతో భద్రాచలం సొసైటీలో కేవలం 40 మంది ఓటర్లే ఉండటంతో ఆ సొసైటీకి ప్రత్యేక నోటిఫికేషన్‌ను ఎన్నిక రోజే ఇవ్వనున్నారు. అక్కడ ఉన్న 40 మంది ఓటర్లలో ఎస్టీ ఓటరు లేకపోవడం, 12 వార్డులు మాత్రమే ఉండటంతో చైర్మన్‌ ఎన్నిక ఉత్కంఠగా మారనుంది. అధికారులు ఇంకా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదేరోజు నామినేషన్లు, పరిశీలన, స్క్రూట్నీ, చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక జరగనుంది. దీంతో 20 సొసైటీలకే నామినేషన్లు, ఉపసంహరణ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. జిల్లాలోని రెండు సొసైటీలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 18 సొసైటీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. 

టీఆర్‌ఎస్‌కే రైతన్నల మద్దతు.. 

రైతు లేనిదే రాజ్యం లేదని బలంగా నమ్మిన సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమానికి అనేక పథకాలను తీసుకొచ్చారు. రైతుబంధు, రైతుబీమా, పంటరుణ మాఫీ, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, ఉచిత విద్యుత్‌ లాంటి అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి రైతులను రాజును చేసే దిశగా ముందుకెళ్తున్నారు. దీంతో కొంత కాలంగా వచ్చిన ప్రతీ ఎన్నికలో రైతులందరూ టీఆర్‌ఎస్‌ పార్టీకే మద్దతు తెలిపి విజయాలను అందించారు. అదే ఒరవడిలో ముందుకు సాగుతూ కేవలం రైతులే ఓటర్లుగా ఉన్న సహకార సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకే తమ మద్దతును ప్రకటిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రెండు సొసైటీల్లో 13 స్థానాలకు 13 ఏకగ్రీవం చేసుకొని రెండు చైర్మన్లకు విజయాన్ని అందించారు. మరో ఐదు సొసైటీలను కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకగ్రీవంగా తమ ఖాతాలో వేసుకుంది. అక్కడ కొన్ని డైరెక్టర్లకు మాత్రమే నామమాత్రంగా ఎన్నిక జరగనుంది.


logo