గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 11, 2020 , 01:12:43

నులిపురుగుల నివారణతో సంపూర్ణ ఆరోగ్యం

నులిపురుగుల నివారణతో సంపూర్ణ ఆరోగ్యం

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: నేటి ఆరోగ్యవంతమైన పిల్లలే రేపటి ఆరోగ్య పౌరులని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీచైర్మన్‌ కోరం కనకయ్య అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్‌లు విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన సమాజానికి అందరూ కృషిచేయాలన్నారు. జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల వయసున్న 3,19,049 మంది పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ  చేయనున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పంపిణీ చేస్తూ ఆరోగ్యశాఖ, స్త్రీశిశు సంక్షేమశాఖ, విద్యాశాఖ సమన్వయంతో నులిపురుగుల రహిత సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలన్నారు. తాను కూడా ఈ కళాశాల విద్యార్థిగా చదువుకొని వివిధ రాజకీయ హోదాల్లో పనిచేశానని, ప్రస్తుతం కొత్తగూడెం ఎమ్మెల్యేగా పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ భాస్కర్‌నాయక్‌ మాట్లాడుతూ.. నులిపురుగులు పిల్లల శరీరంలోకి వివిధ మార్గాల ద్వారా చేరి పిల్లిలకు కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, రక్తహీనత, శారీరక, మానసిక ఎదుగుదల లేకపోవడం లాంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయన్నారు. పిల్లల సమగ్ర ఆరోగ్యం కోసం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 23 మండలాల్లో 29 పీహెచ్‌సీలు, 5 యూపీహెచ్‌సీలు, 4 ఫ్యామిలీ వెల్ఫేర్‌ కేంద్రాల్లో నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం అమలు చేయడానికి జిల్లాలో వందశాతం లక్ష్యసాధన కోసం కృషి చేస్తున్నామన్నారు. ఈ నెల 17వ తేదీన జరిగే మాపప్‌ కార్యక్రమంలో మిగిలిన వారు మాత్రలు వేసుకోవాలన్నారు. జిల్లా చైల్డ్‌ హెల్త్‌ అండ్‌ ఇమ్యునైజేషన్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ నరేష్‌కుమార్‌ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం వివరాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లు, వైద్యులు భాస్కర్‌, నరేష్‌కుమార్‌, చంద్రశేఖర్‌, వినోద్‌, ఇంచార్జి విద్యాశాఖ అధికారి మాధవరావు, డీడబ్ల్యూవో శారద, నోడల్‌ ఆఫీసర్‌ జహీర్‌ అహ్మద్‌, ప్రిన్సిపాల్‌ జే.రమేష్‌బాబు, సుజాతనగర్‌ పీహెచ్‌సీ వైద్యాధికారిణి నాగమణి, అసిస్టెంట్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ నాగభూషణం, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.