శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 10, 2020 , 00:10:24

భద్రాద్రి రామయ్యకు సహస్ర కలశాభిషేకం

భద్రాద్రి రామయ్యకు సహస్ర కలశాభిషేకం

భద్రాచలం, నమస్తే తెలంగాణ : పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా ఉత్సవ మూర్తులను బేడా మండపంలో వేంచేయింప చేసి స్వామివారికి సహస్ర కలశాభికోత్సవం నిర్వహించారు. 28మంది వేద పండితులు స్వామివారికి ముందుగా 108 లీటర్ల క్షీరాలతో, పెరుగు, ఆవు నెయ్యి, తెనె, పంచదార, హరిద్రాచూర్ణము, గందోధకము, పసుపు ముద్ద, తులసి మాలలతో, కుంభ, ధ్వజ, అష్ట, ద్వాదశ హారలములతో, అర్జ, ఆధ్యా ఆచమనంతో, దీప, దూప నైవేద్యాలతో, షోడోపాచారాలతో పంచ ఉపనిశత్తు మంత్రాలతో పూజలు చేశారు. శీక్షావలి,్ల ఆనందవల్లి, నారాయణం, ద్రవిడ ప్రబంధనం, సకల రాజలాంఛనాలతో అర్పించారు. తదుపరి మహా కుంభమును సమస్త మంగళవాయిద్యాలతో, వేద ఘోషలతో, ఆలయ అధికారులతో అంతరాలయంలో మూలమూర్తుల వద్ద వేంచేయింపచేసి మహా కుంభప్రోక్షణ నిర్వహించారు. తదుపరి భక్తులపై సంప్రోక్షణ చేశారు. అనంతరం యాగశాలలో పూర్ణాహుతి జరిపారు. మధ్యాహ్నం 3గంటలకు ధ్యాన మందిరం ప్రక్కన ఉన్న రంగనాథస్వామి ఆలయంలో రంగనాథస్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. రాత్రి రంగనాథస్వామివారికి గరుడవాహనంపై తిరువీధిసేవ గావించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా రంగనాథస్వామివారి కళ్యాణాన్ని భక్తులు తిలకించి పునీతులయ్యారు. ఇదిలా ఉండగా సోమవారం నిత్యకల్యాణాలు పునఃప్రారంభంకానున్నట్లు దేవస్థానం విశ్రాంత ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథచార్యులు తెలిపారు. సోమవారం సందర్భంగా స్వామివారికి ముత్తంగిసేవ నిర్వహిస్తారని, అదేవిధంగా మహానక్షత్రం సందర్భంగా తిరుమంగైళ్వార్‌ తిరునక్షత్రోత్సవం సందర్భంగా భద్రుని మండపంలో స్వామివారికి అభిషేకం చేస్తారని ఆయన పేర్కొన్నారు. సాయంత్రం స్వామివారికి దర్భార్‌సేవ నిర్వహించి, తిరుమంగైళ్వార్‌కు ఆలయ చుట్టుసేవ నిర్వహించి, తదుపరి అంతరాలయంలోకి ప్రవేశింపచేసి మరలా ఆళ్వార్‌లకు ఆలయ మర్యాదలతో పరివట్టం కట్టి దండ వేస్తారు. శఠారి సమర్పించి సేవాకాలం 200ల పాశురాలు అధ్యయనం చేసి, నివేదన, శాత్తుమరై, గోష్ఠి తదితర నివేదన చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఈనెల 13వ తేదీ కుంభ సంక్రమణం సందర్భంగా పవళింపుసేవ లేదని, చుట్టుసేవ కలదని, 14వ తేదీ చిత్తానక్షత్రం సందర్భంగా యాగశాలలో సుదర్శనయాగం నిర్వహిస్తారని పేర్కొన్నారు. 19వ తేదీ సర్వేశాం ఏకాదశి సందర్భంగా స్వామివారికి అంతరాలయంలో మధ్యాహ్నం 3నుంచి 5గంటల వరకు లక్ష తులసి కుంకుమార్చన నిర్వహిస్తారని, రాత్రి పవళింపు సేవ లేదని, తిరువీధిసేవ కలదన్నారు. 21వ తేదీ రామాలయం అనుబంధ ఆలయమైన శివాలయంలో కాశీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర దేవాలయం నందు శివరాత్రి వేడుకలు మూడు రోజులపాటు అత్యంత వైభవోపేతంగా జరపబడునని దేవస్థానం విశ్రాంత ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథచార్యులు తెలిపారు. ఇదిలా ఉండగా ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులరాక సందర్భంగా రామాలయం ప్రాంగణం సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.