సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 10, 2020 , 00:08:53

మక్కలపై మక్కువ

మక్కలపై మక్కువ

ప్రతీ ఏటా రబీ సీజన్‌లో మక్క సాగును ఎక్కువగా వేస్తున్నారు. జీరో టిల్లేజ్‌ పద్దతితో మొక్కజొన్న గింజలను వేశారు. దీంతో అన్ని ఏరియాల్లో మొక్కజొన్న సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. వేసవి కాలంలో మక్క విక్రయాలపై రైతులు ఆసక్తి చూపడంతో జిల్లా వ్యాప్తంగా పంట సాగు విస్తీర్ణాన్ని పెంచి విక్రయాలు పెంచుకుంటున్నారు. అడుగడుగునా మక్కలకు డిమాండ్‌ పెరగడంతో అన్ని ప్రాంతాల్లో రైతులు మొక్కజొన్నపై దృష్టి సారించారు. రెండు రకాల మొక్కజొన్న పంటలను వేయడంతో దాణాకు ఉపయోగించే మక్కలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. తినే మొక్కజొన్నలను తక్కువ విస్తీర్ణంలో వేసి ఎప్పటికప్పుడు రహదారి పక్కన విక్రయాలు చేస్తున్నారు. దీంతో రైతులకు లాభసాటి ఆదాయ వనరుగా మొక్కజొన్న ఉపయోగపడుతుంది. 

 పెరిగిన కూరగాయల సాగు...

       మిషన్‌ కాకతీయ చెరువుల్లో పుష్కలంగా ఉండటంతో రైతులు కూరగాయల సాగును కూడా విస్తారంగా వేస్తున్నారు. మరో వైపు పొలాల్లో బోర్లు వేసుకున్న రైతులు కూరగాయలు సాగు చేసి యాసంగి పంటలపై దృష్టి సారించారు. బీర, చిక్కుడు, వంగ, టమాట, బోడకాక, కాకర, పచ్చిమిర్చితో పాటు ఆకుకూరలు పాలకూర, చుక్కకూర, బచ్చలి, గంగబాయిలి, తోటకూర, గోంగూర, కొత్తిమీరలను విస్తారంగా పండిస్తున్నారు. జిల్లాలోని జూలూరుపాడు, సుజాతనగర్‌, చర్ల, దుమ్ముగూడెం, రేగళ్ల, కారుకొండ, కిన్నెరసాని, మణుగూరు, అశ్వారావుపేట, పాత అంజనాపురం, కొత్త అంజనాపురం ప్రాంతాల్లో కూరగాయల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్లు, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి జినుగు మరియన్నలు రైతులకు కూరగాయల సాగు, వేసవి పంటలపై అవగాహన కల్పించడంతో రైతులు తక్కువ కాలంలోనే చేతికందే పంటలను సాగు చేసి అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. 

మేలు రకం వంగడాలతో   అధిక దిగుబడులు 

అధిక దిగుబడి వచ్చే మేలు రకం వంగడాలపై ఆదాయం రావడంతో రైతులు మేలురకమైన మొక్కలను సాగు చేస్తున్నారు. వివిధ ఏరియాల్లో ఉన్న నర్సరీల్లో మేలు రకం వంగడాల మొక్కలను తయారు చేసి రైతులకు విక్రయించడంతో రైతులు అధిక దిగుబడి కలిగిన పంటలను పండిస్తున్నారు. ఎక్కువ దిగుబడి వచ్చే మొక్కలను క్రాస్‌బ్రీడ్‌ చేయడం వల్ల కూరగాయల్లో కూడా అధిక దిగుబడిని సాధిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ పంట వచ్చే హైబ్రీడ్‌ రకాలను రైతులు ఎంచుకొని పంటల సాగు చేస్తున్నారు.