శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 10, 2020 , 00:08:01

సహకార ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

సహకార ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

కొత్తగూడెం, నమస్తేతెలంగాణ : ఈ నెల 15వ తేదీన సహకార ఎన్నికలు ఎలాంటి సమస్యలు లేకుండా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా సహకార అధికారి మైఖేల్‌ బోస్‌ తెలిపారు. ఆదివారం జిల్లా సహకార కార్యాలయంలో మోనటరింగ్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ కోసం నేడు జిల్లా కేంద్రంలో ఒక్క రోజు శిక్షణ ఉంటుందన్నారు. 14న ఎన్నికల అధికారులకు మోనటరింగ్‌ అధికారులు దిశానిర్దేశం చేయాలన్నారు. జిల్లాలో 20 సొసైటీలకు మాత్రమే ఎన్నికలు ఉంటాయని, భద్రాచలం సొసైటీకి మాత్రం బ్యాలెట్‌ పద్ధతిలో జరుగదని గుర్తుంచుకోవాలన్నారు. 15న  ఎన్నికలు, అదేరోజు కౌంటింగ్‌, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఉంటుందన్నారు. ముందస్తు కార్యాచరణ చేసి సక్రమంగా ఎన్నికలు నిర్వహించాలని, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. తెలియని విషయాలు వెంటనే తెలుసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఇప్పటికే అన్ని సొసైటీలకు బ్యాలెట్‌ బాక్సులు చేరుకున్నాయో.. లేదో తెలుసుకోవాలన్నారు. ప్రతి సొసైటీకి 13 బాక్సులు ఉండాలని, ప్రత్యేక అధికారులు ఎన్నికల నిర్వహణను పరిశీలిస్తారన్నారు. కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, జేసీ కర్నాటి వెంకటేశ్వర్లు ఎన్నికల తీరును పరిశీలిస్తారని తెలిపారు. ఇప్పటికే అన్ని సహకార సంఘాల వద్దకు జేసీ వెంకటేశ్వర్లు వెళ్లి పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా సహకార ఆడిట్‌ అధికారి  మమత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.