ఆదివారం 07 జూన్ 2020
Badradri-kothagudem - Feb 09, 2020 , 02:21:16

అడవి తల్లి చెంతకు వన దేవతలు

అడవి తల్లి చెంతకు వన దేవతలు
  • బొజ్జాయిగూడెం, తోగ్గూడెంలో అపురూప ఘట్టం
  • మినీ మేడారాన్ని తలపించిన కోలాహలం
  • చివరి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు

ఇల్లెందు రూరల్‌/మణుగూరు నమస్తే తెలంగాణ: మూడు రోజులపాటు గద్దెలపై కొలువుదీరిన వన దేవతలు సమ్మక్క-సారలమ్మలు భక్తుల నుంచి విశేష పూజలతోపాటు నైవేద్యాలు అందుకుని శనివారం సాయంత్రం వనంలోకి ప్రవేశించారు. అంతకుముందు ఇష్టదైవాలు వనంలోకి ప్రవేశించే రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఇల్లెందు మండలంలోని బొజ్జాయిగూడెం గ్రామ శివారు సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద అమ్మవార్ల వనప్రవేశ కార్యక్రమాన్ని ప్రధాన పూజారులు, భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి సాంప్రదాయబద్ధంగా చేపట్టారు. అమ్మవారికి ఇష్టమైన బంగారం (బెల్లం), పసుపు, కుంకుమ, గాజులు అలంకరించిన ప్రధాన పూజారులు వనదేవతల వనప్రవేశానికి సన్నద్ధమైనట్లు ప్రకటించడంతో భక్తులు పెద్దసంఖ్యలో గద్దెల వద్దకు తరలివచ్చారు. ఈ సమయంలో ప్రధాన పూజారికి అమ్మవారు ఆవహించడంతో కొద్దిసేపు ఆమె పలుకులను భక్తులు ఆసక్తిగా ఆలకించారు. అనంతరం భక్తులు తమ వెంట తెచ్చుకున్న నీళ్ళను అమ్మవారికి ఆరబోసి ఘనంగా సాంప్రదాయబద్ధంగా వనంలోకి సాగనంపారు.  


మణుగూరు, నమస్తేతెలంగాణ: మండలంలోని తోగ్గూడెం గ్రామం వద్ద వెలిసిన సమ్మక్క-సారలమ్మల జాతర శనివారం ముగిసింది. అడవి తల్లులు వనప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ నిర్వాహకులు వనదేవతలను దర్శించుకొని వనప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మినీ మేడారం విజయవంతానికి, తరలివచ్చిన భక్తులకు సేవలు అందించిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అభినందనలు తెలిపారు.  మణుగూరు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో డీఎస్పీ బొజ్జ రామానుజం పర్యవేక్షణలో మణుగూరు సీఐ షుకూర్‌ నేతృత్వంలో 40 మంది పోలీస్‌ సిబ్బంది జాతరకు తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా బందోబస్తు నిర్వహించారు. మణుగూరు వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్‌క్యాంపు ఏర్పాటు చేశారు. మణుగూరు పోలీస్‌శాఖ, ఏరియా స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ఆధ్వర్యంలో భక్తులకు సేవలందించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయకమిటీ నిర్వాహకులు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఆలయకమిటీ నిర్వాహకులు, గిరిజన పూజారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సింగరేణి అధికారులు, మండల టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, టీబీజీకేఎస్‌ నాయకులు పాల్గొన్నారు.logo