బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 09, 2020 , 02:18:48

సహకార పోరుకు ఏర్పాట్లు ముమ్మరం

సహకార పోరుకు ఏర్పాట్లు ముమ్మరం
  • జిల్లాలో ఆరు కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి
  • బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేస్తున్న యంత్రాంగం
  • ఈ నెల 14వ తేదీన ప్రత్యేధికారులకు పంపిణీ

అశ్వారావుపేట, నమస్తే తెలంగాణ: ఈ నెల 15వ తేదీన నిర్వహించే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. శనివారంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా, పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేశారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని పంపిణీ చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 21 సహకార సంఘాల ఎన్నికలకు 6 కేంద్రాల ద్వారా ఎన్నికల సామగ్రి పంపిణీ చేయనున్నారు. ఒక్కో కేంద్రం నుంచి 2 లేదా 3 సహకార సంఘాలకు సామగ్రిని పంపిణీ చేస్తారు. ఈ నెల 14న ఎంపిక చేసిన కేంద్రాల నుంచి సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేయనున్నారు. పోలింగ్‌ కేంద్రాలను సహకార సంఘాల సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. 


273 డైరెక్టర్ల పదవులకు ఎన్నికలు

జిల్లాలో మొత్తం 21 సహకార సంఘాల పరిధిలో 273 డైరెక్టర్ల పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 66,988 మంది సభ్యులుండగా వీరిలో కేవలం 55,103 మంది ఓటర్లే అర్హత సాధించారు. వీరు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్ల జాబితాలో తప్పొప్పుల వల్ల సుమారు 40 శాతం వరకు ఓట్లు పోలైయ్యే అవకాశాలు లేవు. అంటే 33 నుంచి 35వేల వరకు మాత్రమే పోలింగ్‌ నమోదు కాకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.