సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 09, 2020 , 02:14:47

బతుకు ఎడ్ల బండి

బతుకు ఎడ్ల బండి
  • రైతన్నకు ఎంతో ఆసరాగా ఉండేది
  • కనుమరుగవుతున్న కాడెడ్ల బండ్లు
  • పల్లెల్లో రవాణాకూ ఉపయోపడేది

రోడ్లు వాహనాలు లేని రోజుల్లో కాడెద్దుల బండ్లే రవాణా సాధనాలు.. వ్యవసాయ పనులకు వెళ్లాలన్నా, ఎరువులు, విత్తనాల సంచులు తీసుకెళ్లాలన్నా ఎద్దుల బండ్లు ఎంతో ఉపయోగపడేవి. దేవాలయాలకు, వివాహ వేడుకలకు వెళ్లాలన్నా ఎడ్ల బండ్లపైనే పోయేవాళ్లు. ఒక్కో బండిపై 10 మంది వరకు కూర్చుని ప్రయాణం సాగించేవారు. 50 మంది ఉంటే ఐదారు బండ్లు కట్టేవారు. ఒకదాని వెంట ఒకటి నడుస్తుంటే బండ్లపై కూర్చునేవారు బండెనక బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి.. అనుకుంటూ పాటలు పాడుతూ ముందుకు సాగేవారు. వ్యవసాయ కుటుంబాల్లో అందరికీ ఎడ్ల బండ్లు ఉండేవి. అప్పట్లో ఎడ్ల బండ్లు ఉన్నవారంటే ఆర్థికంగా గొప్పవారిగా భావించేవారు. పేద రైతులకు ఎడ్ల బండ్లు ఉండేవి కావు. కానీ తమ అవసరాల కోసం బండ్లు ఉన్నవారి వద్ద నుంచి బాడుగకు తీసుకెళ్లేవారు. ఇప్పడు కాలం మారిపోయింది. ఒకప్పుడు ఎంతో ఉపయోగపడిన ‘బతుకు బండి’ చక్రం విరిగిపోయింది. ఇంటింటికీ ఉండే ఎడ్ల బండ్లు ఇప్పుడు ఊరికి నాలుగైదు కూడా కానరావడం లేదు. 


పెళ్లికైనా.. పేరంటానికైనా బండిపైనే..

అప్పట్లో రవాణా వ్యవస్థ లేకపోవడంతో ప్రతి ఒక్కరూ ఎడ్లబండినే వాడుకునేవారు. ముఖ్యంగా పెళ్లిళ్ల కోసం ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లడానికి ఎడ్లబండే వారి వాహనం. దూర ప్రాంతాలకు బండిపై వెళ్లేవారు తమ భోజనాలకు అవసరమైన సామగ్రిని తీసుకెళ్లి సమయం ఉన్నచోట ఓ చెట్టుకింద ఆగి భోజనాలు చేసుకుని భుజించేవారు. తిరిగి తమ ప్రయాణం సాగించేవారు.


వ్యవసాయానికి సాయం

రైతులు వ్యవసాయ పనులకు సంబంధించి ఎడ్ల బండిని ఎంతగానో ఉపయోగించుకునే వారు. ముఖ్యంగా వర్షాకాలం సీజన్‌కు ముందుగానే పశువుల పేడను పంట చేలకు తరలించేవారు. పశువుల పాకలు, నివాసపు గుడిసెలు కట్టడానికి అవసరమైన కలప, పొరక కోసం, పొలాలు దున్నడానికి అవసరమైన నాగళ్లు, గొర్రులను ఎడ్లబండిపై వేసుకొనేవారు. విత్తనాలు, ఎరువులను తీసుకెళ్లడం, పంట చేతికొచ్చిన తరువాత సంచులను, బియ్యం పట్టించడానికి వడ్ల సంచులను గిర్నీలకు తీసుకెళ్లడానికి ఎడ్ల బండ్లనే ఉపయోగించేవారు. ఇలా రైతులకు ప్రతి విషయంలోనూ ఎడ్లబండి ఎంతగానో ఉపయోగపడుతూ తమ జీవితంలో కావాల్సిన ముఖ్యమైనదిగా గుర్తించేవారు. 


దేవాలయాల చుట్టూ ప్రదర్శన

వివిధ పండుగల సందర్భంలో రైతులు తమ బండ్లను ముస్తాబు చేసి దేవాలయాల చుట్టూ పోటాపోటీగా తిప్పేవారు. దసరా, ఉగాది, ముత్యాలమ్మ జాతర, పొలాల అమావాస్య వంటి పండుగల సందర్భంలో ఎద్దుల బండ్ల ప్రదర్శనలు నిర్వహిస్తారు. సంప్రదాయం కొనసాగుతున్నప్పటికీ గతంలో వందలాది బండ్లు తిరిగేవి. కాడెద్దులను కూడా ముస్తాబు చేసి తమదే ముందు వెళ్లాలంటూ పోటీకి సిద్ధపడేవారు.


తయారీ ఖర్చు పెరిగింది

ఎడ్లబండి తయారు చేయాలంటే అనుభవం ఉండటంతోపాటు మంచి కలప అవసరం. ముఖ్యంగా చక్రాలు టేకు కలపతో తయా రు చేస్తారు. ఇరుసు, పార్లు, ఖానీ, నొగళ్లు, గొలుసు, సాయిసీలా, పిరాడుబద్ద, బడతలు, కోలు, వార్నె అవసరం అవుతాయి. గతంలో రూ.10వేలకో ఎడ్లబండి తయారయ్యేది. ఇప్పుడు బండి ధర రూ. 50వేల వరకు ఖర్చవుతోంది. ఊరూరా ట్రాక్టర్లు, ఆటోలు, జీపులు, కార్లు తరలిరావడంతో ఎద్దుల బండికి ఆదరణ తగ్గింది. దీంతో ఎడ్ల బండ్లు తయారు చేసేవారికి ఉపాధి కూడా కరువైంది. 


నేటి తరానికి తెలుసా..?

గతంలో ఎడ్ల బండ్ల గొప్పతనం, వాటి వల్ల ఉపయోగాలు ఇప్పటి తరం వారికి తెలియకుండా పోయింది. గ్రామాల్లో పిల్లలు ఎడ్ల బండిపై ఎంతో సంతోషంగా ప్రయాణించేవారు. పట్టణాల నుంచి గ్రామాలకు వచ్చేవారు. ఇప్పడు గ్రామాల్లోని పిల్లలకు సైతం ఎడ్లబండి అంటే ఏందో తెలియని పరిస్థితి.  ఇక పట్టణాలు, నగరాల్లో ఉండే వారి సంగతి సరేసరి..