ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 09, 2020 , 02:09:05

జాతీయ స్థాయి స్కోచ్‌ పురస్కారానికి ‘నివేదన యాప్‌' ఎంపిక : కలెక్టర్‌ ఎంవీ రెడ్డి

జాతీయ స్థాయి స్కోచ్‌ పురస్కారానికి ‘నివేదన యాప్‌' ఎంపిక : కలెక్టర్‌ ఎంవీ రెడ్డి


కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో ప్రత్యేకంగా రూపొందించబడిన ‘నివేదన యాప్‌' జాతీయ స్థాయి స్కోచ్‌ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల కలెక్టర్‌  ఎంవీ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పురస్కారం అందుకోవడానికి మన జిల్లా ఒక్క అడుగుదూరంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల న్యూ ఢిల్లీలో నిర్వహించిన ప్రదర్శన తరువాత సెమీ ఫైనల్స్‌ కోసం తయారు చేయబడిన జాబితాలో ‘నివేదన’ యాప్‌ పోటీలో ఉన్నట్లు పేర్కొన్నారు. సోమవారం వరకు ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ద్వారా వచ్చిన స్పందన ఆధారంగా తుది విజేతను ఎంపిక చేయనున్నందున మన జిల్లా జాతీయ స్థాయిలో పురస్కారం అందుకోవడానికి ప్రతిఒక్కరూ ఆన్‌లైన్‌ ఓటింగ్‌లో పాల్గొనాలన్నారు. ప్రభుత్వ శాఖల్లోని అన్ని విభాగాల సిబ్బంది ద్వారా ఓటింగ్‌ ప్రక్రియను నమోదు చేయించి నివేదికలు అందజేయాలన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాలు, యూజర్‌ గ్రూపు లు, పాత్రికేయులు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఓటింగ్‌ చేయాలన్నారు. ప్రతిఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనడం వల్ల మన జిల్లాకు జాతీయ స్థాయిలో పురస్కారం లభిస్తుందన్నారు. అన్నిశాఖల అధికారులు ఇందుకు సంబంధించిన నివేదికను అందజేయాలని ఆయన ఆదేశించారు. ఆన్‌లైన్‌ ద్వారా ఏ విధంగా ఓటింగ్‌ నిర్వహించాలో జిల్లా అధికారులకు పంపిన వీడియోను అన్ని గ్రూపులకు షేర్‌ చేయడంతో పాటు ఓటు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు మాత్రమే సమయం ఉన్నందున ప్రతిఒక్కరూ తప్పని సరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అధికారులు తప్పక ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.