ఆదివారం 23 ఫిబ్రవరి 2020
సహకారం.. ఏకపక్షం..

సహకారం.. ఏకపక్షం..

Feb 08, 2020 , 00:11:27
PRINT
సహకారం.. ఏకపక్షం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వరుస ఎన్నికల్లో అప్రతిహాత విజయాలను నమోదు చేసుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ అదే ఊపుతో సహకార ఎన్నికల్లో అత్యధికంగా తమ మద్దతు దారులనే గెలిపించుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసింది. పంచాయతీల నుంచి పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు మున్సిపల్‌ ఎన్నికల్లో విజయదుందుబీ మోగించిన గులాబీ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో సహకార ఎన్నికలను కూడా సంపూర్ణం చేసే దిశగా పావులు కదుపుతోంది. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు మెజార్టీ సొసైటీలను ఏకగ్రీవం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. రైతుల మద్దతును కూడగట్టి మరోమారు జిల్లాలో తిరుగులేని శక్తిగా మారేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగియడంతో ఇక బరిలో నిలిచేది ఎవరనే దానిపై కసరత్తు చేస్తోంది. బలమైన అభ్యర్థులను సొసైటీ వార్డుల్లో నిలిపి గెలుపే లక్ష్యంగా సాగుతోంది. 


గులాబీ పార్టీకే రైతుల మద్దతు

జిల్లా అంతటా గులాబీ వర్ణం సంతరించుకుంది. ఏ ఎన్నికల్లో చూసినా గెలుపు గులాబీదే అవుతూ ప్రతిపక్ష పార్టీల అడ్రస్‌ గల్లంతవుతున్నాయి. ప్రతీ ఎన్నికల్లో బీరాలు పలికిన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, వామపక్షాలు కారు దెబ్బకు తమ ఉనికిని కోల్పోయి చతికిలపడ్డాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన నాటి నుంచి సీఎం కేసీఆర్‌ వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసి రైతును రాజు చేసేందుకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. రైతుబీమా, రైతుబంధు, ఉచిత విద్యుత్‌, రైతుకు సులభంగా రుణాలు, రుణమాఫీ వంటి వాటిని అమలు చేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతును ఆర్థికంగా బలోపేతం చేసేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకే రైతులు మద్దతిచ్చి విజయాలను కట్టబెట్టారు. అదే తీరుగా రైతే ఓటరుగా పాల్గొనే సహకార సంఘాల ఎన్నికల్లో తిరిగి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారులను గెలిపించి మరింత అభివృద్ధిని అందుకునేందుకు రైతులందరూ ఒకతాటిపైకి వస్తున్నారు. దీంతో జిల్లాలో అత్యధిక సొసైటీల్లో వార్డు సభ్యులు టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుచుకోనుంది. 


అత్యధిక సొసైటీల కైవసం దిశగా వ్యూహం

గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో సహకార ఎన్నికల్లో కూడా పూర్తి మెజార్టీ సాధించి జిల్లాలో పూర్తిస్థాయిలో పార్టీ పాగా వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే రాష్ట్రస్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు తమ పరిధిలోని సహకార సంఘాల సమావేశాల్లో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లాలో ఎన్నికలు జరిగే  21 సొసైటీలకు 21 సొసైటీల పరిధిల్లోని వార్డు సభ్యులను పూర్తి స్థాయిలో గెలుచుకొని జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు, సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇచ్చేందుకు నడుం బిగించారు. అత్యధిక సొసైటీలను కైవసం చేసుకొని అనంతరం జరిగే డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికల్లో సత్తా చాటనున్నారు. 


ఏకగ్రీవాల దిశగా సొసైటీలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలను దృష్టిలో పెట్టుకొని రైతులందరూ గులాబీ పార్టీకే తమ మద్దతు తెలుపుతున్నారు. రాష్ట్రంలో, జిల్లాలో గులాబీ పార్టీనే అభివృద్ధికి చిరునామాగా మారిపోయిందని, అటువంటి టీఆర్‌ఎస్‌ పార్టీని సహకార ఎన్నికల్లో కూడా పైస్థాయిలో నిలబెట్టి తమకు కావాల్సింది అడిగి తెచ్చుకోవచ్చని రైతులు నిర్ణయానికొచ్చారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికల్లో ఏకగ్రీవాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే అశ్వాపురం, దుమ్ముగూడెం, పాల్వంచ సొసైటీల డైరెక్టర్లు ఏకగ్రీవం కానున్నాయి. జిల్లాలోని మిగిలిన సొసైటీల్లో కూడా ఏకగ్రీవానికి రైతులందరూ సై అంటున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుతో పోటీ చేసే వారే అత్యధికులు ఏకగ్రీవం కానున్నారు. దీంతో రానున్న రోజుల్లో సహకార పీఠాలపై టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారులే పాగా వేయనున్నారు.


logo