ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 08, 2020 , 00:09:30

సల్లంగ చూడు సమ్మక్క

 సల్లంగ చూడు సమ్మక్క

ఇల్లెందు రూరల్‌/మణుగూరు, నమస్తే తెలంగాణ: వన దేవతలైన సమ్మక్క-సారలమ్మలు గద్దెల మీద దర్శనమివ్వడంతో జాతరకు పరిపూర్ణత సంతరించుకుంది. అమ్మవార్ల దర్శన భాగ్యంతో భక్తజనం పులకించిపోయింది. సల్లంగ చూడు సమ్మక్కా.. అంటూ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని బొజ్జాయిగూడెం సమ్మక్క గద్దెల వద్దకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌లతోపాటు ఇతర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. జాతర ప్రాంతంలో పలువురికి అమ్మవారు ఆవహించడంతో వారి పలుకులు వినేందుకు భక్తులు ఆసక్తి కనబర్చారు. పలువురు భక్తులు అమ్మవార్లకు ప్రీతిపాత్రమైన బెల్లంను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ప్రాంగణంలోనే భక్తులు కుటుంబాలతో సహా తరలిరావడంతో జాతర ఉత్సవాలు కొత్తశోభను సంతరించుకున్నాయి. భక్తుల అంచనాకు మించి తరలిరావడంతో నిర్వాహకులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసుశాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది

మణుగూరు, నమస్తేతెలంగాణ: మండలంలోని తోగ్గూడెం గ్రామం వద్ద వెలిసిన గిరిజనుల ఆరాధ్య వనదేవతలు శ్రీ సమ్మక్క-సారలమ్మల జాతరకు శుక్రవారం భక్తజనం అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. వనదేవతలు గద్దెపై కొలువుదీరడంతో భక్తజనం దర్శించుకొని పసుపు, కుంకుమ, నిలువెత్తు బంగారం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో డప్పు చప్పుళ్ళతో గిరిజన నృత్యాల నడుమ గిరిజన పూజారులు వన దేవతలను గద్దెకు తీసుకొచ్చారు. దీంతో భక్తజనం అధిక సంఖ్యలో తమ మొక్కులను చెల్లించుకున్నారు. ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు వనదేవతలను సందర్శించుకొని గురువారం రాత్రి జాతరలో సందడి చేశారు. మణుగూరు ఏరియా జీఎం జక్కం రమేష్‌, బీటీపీఎస్‌ సీఈ పిల్లి బాలరాజులు, మండలంలోని ప్రజా ప్రతినిధులు వనదేవతలను దర్శించుకున్నారు. వనమంతా జన సందోహంతో నిండిపోయింది. గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్న భక్తులు పక్కనే ఉన్న అడవిలో వంటలు చేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో జారతకు తరలివచ్చారు. భక్తులకు ఎలాం టి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ నెల 8న శ్రీ సమ్మక్క-సారలమ్మ తల్లులు తిరిగి వన ప్రవేశం చేయనున్నారు. మణుగూరు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో హెల్త్‌క్యాంపును ఏర్పాటు చేశారు. మణుగూరు పోలీస్‌శాఖ, ఏరియా స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ఆధ్వర్యంలో భక్తులకు సేవలందిస్తున్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో జాతరకు వచ్చిన భక్తులకు మంచినీటిని సరఫరా చేస్తున్నారు. నిర్వాహకులు, గిరిజన పూజారులు, ఆయా పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.